సాక్షి,భైంసాటౌన్(నిర్మల్): ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం సాకుతో కొన్ని వంటనూనెల ఉత్పత్తి సంస్థలు మన మార్కెట్‌లో ధరల మాయాజాలం ప్రదర్శిస్తున్నాయి. సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతిలో మన దేశం ఉక్రెయిన్, రష్యాపైనే ఆధారపడుతోంది. ప్రస్తుతం అక్కడి పరిస్థితుల నేపథ్యంలో దిగుబడిపై ప్రభావం పడింది. ఇదే అదనుగా కొన్ని నూనెల ఉత్పత్తి సంస్థలు కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయి. రిటైలర్లు, డీలర్లకు స్టాక్ లేదని చెప్పి క్యాష్ చేసుకుంటున్నాయి. కొన్ని కంపెనీలయితే నేరుగా పాత స్టాకుపై ఉన్న ధరను చెరిపేసి, కొత్త ధర ముద్రించి మార్కెట్‌లోకి పంపుతున్నాయి. ఫలితంగా వినియోగదారులపై ప్రభావం చూపుతోంది.
షార్ట్ వెయిట్‌తో మోసం...
చాలా వరకు పేద, మధ్య తరగతి ప్రజలు, నిరక్షరాస్యులైన గ్రామీణులు ఎక్కువగా ద్వితీయ శ్రేణి వంటనూనెలనే వినియోగిస్తారు. తక్కువ ధరకే వస్తుండడం, ప్రముఖ బ్రాండ్లను పోలిన స్టిక్కర్లు ఉండడంతో నమ్మి మోసపోతుంటారు. ప్రముఖ బ్రాండ్ల నూనెలు ఖచ్చితమైన కొలతల్లో ఉంటాయి. ద్వితీయశ్రేణి నూనెలు మాత్రం 350 మి.లీ. నూనెను 500 మి.లీ పాకెట్‌లో, 650 మి.లీ.నూనెను లీటరు పాకెట్‌లో నింపి విక్రయిస్తారు. దీంతో తక్కువ ధర ఉందని చూసి, నిరక్షరాస్యులు మోసపోతున్నారు.
రూ.200–500ల వరకు పెంచేస్తూ...
జిల్లా మార్కెట్‌లో హోల్‌సేల్ వ్యాపారులు సన్‌ఫ్లవర్, పామాయిల్, ఇతర వంటనూనెలు ఎక్కువగా హైదరాబాద్, కామారెడ్డి ప్రాంతాల నుంచి తీసుకొస్తుంటారు. భైంసా మార్కెట్‌లో శనివారం ఓ హోల్‌సేల్ వ్యాపారి హైదరాబాద్ నుంచి ఓ కంపెనీకి చెందిన 15కిలోల వంటనూనె క్యాన్‌లను తెప్పించాడు. అయి తే ఆ క్యాన్‌లపై పాత ధర చెరిపేసి, కొత్త ధర రూ. 2899గా ముద్రించి పంపించారు. ఇలా ఒక్కో క్యా న్‌పై సుమారు రూ.200–500 వరకు పెంచి సరఫరా చేస్తున్నారు. అయితే వినియోగదారులు మాత్రం తానే ధర పెంచి విక్రయిస్తున్నట్లు అనుమానిస్తున్నారని వ్యాపారి వాపోయాడు. దీంతో వ్యాపారం దెబ్బతినే పరిస్థితి ఉందని చెబుతున్నాడు ఇతడు.
తనిఖీలు చేపడితే ప్రయోజనం...
యుద్ధం సాకుతో వంటనూనెల ధరలు ఇష్టానుసారం పెంచి పలు కంపెనీలు వినియోగదారులను మోసం చేస్తున్నాయి. ఈమేరకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేపట్టి స్టాకు కృత్రిమ కొరత సృష్టించి, ధరలు పెంచుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.
ధరలు అమాంతం పెంచేశారు..
యుద్ధం సాకుతో పాత స్టాకుపై ధరలు చెరిపేసి, పెంచిన ధరలతో వంటనూనెలు అమ్ముతున్నరు. ఇలా చేయడం సరికాదు. పాత స్టాకును పాత ధరకే విక్రయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
– అనుసూరి శ్రీనివాస్, భైంసా
తనిఖీలు చేపడుతాం..
పాత స్టాక్ వంటనూనెల ధరలు పెంచి విక్రయిస్తే ఫిర్యాదు చేయాలి. అయితే అది పాత స్టాకేనా.. కాదా అనేది వారి బిల్లులు చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. తనిఖీలు జరిపి ఎవరైనా పాత స్టాకును రేటు పెంచి విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం.
– చిస్తేశ్వర్‌రావు,వాణిజ్యపన్నుల శాఖ జిల్లా అధికారి
Comments
Please login to add a commentAdd a comment