పోలీస్‌స్టేషన్‌లో ఉన్న కోడి (ఫైల్)
సాక్షి, జగిత్యాల : పందెం కోడి వ్యవహారం పోలీసులకు తలనొప్పిని తెచ్చింది. ఒకరి ప్రాణం పోయేందుకు కారణమైన కోడిని పోలీస్‌స్టేషన్‌లో ఉంచితే.. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు పోలీసులు కోడిని అరెస్ట్ చేశారంటూ సోషల్‌మీడియాలో చేసిన పోస్టు చర్చనీయాంశమైంది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లొత్తునూర్‌లో ఈ నెల 22న కొందరు కోడిపందేలు ఆడారు. జిల్లాలోని వెల్గటూర్ మండలం కొండాపూర్‌కు చెందిన తనుగుల సంతోష్ సైతం లొత్తునూర్ ఎల్లమ్మ గుట్ట వద్ద కోడిపందెంలో పాల్గొన్నాడు. సతీశ్ తన కోడికి కత్తులు కట్టి వదిలేందుకు వంగగా.. అది ఒక్కసారిగా లేచి తన్నడంతో సతీశ్ మర్మాంగాలకు గాయమై మృతిచెందాడు. గొల్లపల్లి ఎస్సై జీవన్ సంఘటన స్థలానికి చేరుకుని సతీశ్ మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ప్రాణం పోయేందుకు కారణమైన కోడి అక్కడే ఉండడంతో ఠాణాకు తీసుకొచ్చి, కొద్దిసేపటి తర్వాత సంరక్షణ కోసం కోళ్ల ఫారానికి తరలించారు. అంతలోనే గుర్తు తెలియని వ్యక్తి పోలీస్‌స్టేషన్‌లో ఉన్న కోడిని ఫొటో తీసి పోలీసులు కోడిని అరెస్ట్ చేశారంటూ సోషల్‌మీడియాలో పోస్టు చేయగా వైరల్‌గా మారింది. దీంతో రాష్ట్రస్థాయి పోలీసు అధికారులు జిల్లా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన గొల్లపల్లి ఎస్సై జీవన్ శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సంఘటన ప్రాంతంలో కోడి ఉండటంతో సంరక్షించేందుకే పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చామని, అరెస్ట్ చేయలేదని తెలిపారు. అరగంట తర్వాత కోళ్లఫారానికి తరలించామన్నారు. కోడిపందేలలో పాల్గొన్న వారి వివరాలు సేకరించి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment