సాక్షి, హైదరాబాద్: దళితబంధు పథకం మరిన్ని కుటుంబాలకు వర్తించేలా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం.. నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపుతుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. టీఆర్‌ఎస్‌ఎల్‌పీ కార్యాలయంలో ఆదివారం ఆయన ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, మెతుకు ఆనంద్, ఎమ్మెల్సీ ఎల్.రమణతో కలసి మీడియాతో మాట్లాడారు. దళితబంధు పథకం అమలుకోసం ఇప్పటి వరకు రూ. 3,249 కోట్లను వెచ్చించామని చెప్పారు.
రాష్ట్రంలో అమలవుతున్న దళితబంధును దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారని, దేశంలోని దళితులందరికీ ఈ పథకాన్ని అమలు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళితబంధుపై దుష్ప్రచారం చేయడం సరికాదని, బీజేపీ ఉచితాల రద్దు పేరుతో దళితబంధును కూడా లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు.
బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే తమ మేనిఫెస్టోలో దళితబంధు పథకాన్ని పెట్టి దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్న హామీ ఇవ్వాలన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు, అత్యాచారాలు పెరిగి పోయాయని, సామాజిక బహిష్కరణలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యూపీ, గుజరాత్ రాష్ట్రాల్లో దళితులపై ఎక్కువగా దాడులు జరుగుతున్నాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment