సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మామిడిగూడెంకి చెందిన నిరుపేద విద్యార్థిని శ్రీలతకు మంత్రి కె.తారకరామారావు అండగా నిలిచారు. ఐఐటీ విద్య కు అవసరమైన డబ్బులను అందించడమేగాక, భవిష్యత్తులోనూ అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ప్రతిష్టాత్మక ఐఐటీలో సీటు సంపాదించుకున్న కోయ తెగకు చెందిన కారం శ్రీలత చిన్ననాటి నుంచి చదువులో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తూ వస్తోంది.
తన నిరుపేద పరిస్థితులను దాటుకుని ఇంటర్మీడియట్లో 97 శాతం మార్కులను సాధించింది. నాగర్‌కర్నూల్‌లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో చదివి ఐఐటీ వారణాసిలో ఇంజనీరింగ్ సీట్ సంపాదించింది. అయితే కూలీలుగా పనిచేసే తల్లిదండ్రులు ఆమె ఫీజులు చెల్లించే పరిస్థితిలో లేరు. దీంతో తన ఉన్నత విద్య స్వప్నం చెదిరి పోతుందేమోనని భయపడిన శ్రీలత పరిస్థితులను మంత్రి దృష్టికి తెచ్చింది.
వెంటనే కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు సోమవారం ప్రగతిభవన్‌లో శ్రీలత ను అభినందిస్తూ, ఆమె విద్యాభ్యాసం పూర్త య్యే వరకు తాను బాధ్యత తీసుకుంటున్నట్లు ఆమె కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు. అనేక సవాళ్లు దాటుకొని ఐఐటీలో సీటు సాధించిన శ్రీలత ప్రస్థానం స్ఫూర్తిగా నిలుస్తుందని కేటీఆర్ ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment