సీఎం కేసీఆర్ నుంచి ఫోన్ రావడంతో పక్కనే ఉన్న బురుజు వద్దకు వెళ్లి మాట్లాడుతున్న కేటీఆర్
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలోని తన నానమ్మ ఊరు కోనాపూర్‌లో మంత్రి కేటీఆర్ మంగళవారం పర్యటించారు. ‘అవ్వా.. నేను వెంకటమ్మ మనవన్ని’అంటూ పలకరించారు. ఊరంతా కలియదిరుగుతూ గ్రామస్తులతో ముచ్చటించారు. తర్వాత ఊర్లో తన సొంత డబ్బు రూ.2.5 కోట్లతో నానమ్మ పేరుతో కట్టిస్తున్న బడికి శంకుస్థాపన చేశారు. గ్రామానికి వెళ్లే దారిలో వాగుపై రూ.2.40 కోట్లతో కట్టిస్తున్న బ్రిడ్జి నిర్మాణానికి, రూ.75 లక్షలతో వేస్తున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. రూ.24 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. తర్వాత బహిరంగ సభలో మాట్లాడారు.
మాది మొదటి నుంచీ ఉన్నత కుటుంబమే
తమది మొదటి నుంచి ఉన్నత కుటుంబమేనని కేటీఆర్ చెప్పారు. ‘మా తాత రాఘవరావుది సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట. ఆయన వందల ఎకరాల ఆసామి. నానమ్మ వెంకటమ్మది కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం కోనాపూర్ (పోసానిపల్లె). నానమ్మ వాళ్లింట్లో మగ పిల్లలు లేకపోవడంతో తాతను 1930ల్లో ఇల్లరికం అల్లుడిగా తెచ్చుకున్నరు.
కోనాపూర్‌లో చెరువు కింద ఆయకట్టులో సగం భూమి మా తాతదే. ఊరి కింది భాగాన 500 ఎకరాలకు పైగా భూమి ఉండేది. నిజాం సర్కారు ఎగువ మానేరుకు ప్లానింగ్ చేస్తే తాత, నానమ్మల భూమి అంతా అందులో మునిగింది. అప్పుడు నిజాం సర్కారు రూ.2.5 లక్షల ముంపు పరిహారం ఇచ్చింది. ఆ డబ్బులతో తాత, నానమ్మ సిద్దిపేట జిల్లా చింతమడకకు వలస వెళ్లారు.
అక్కడ ఆ డబ్బుతో వందల ఎకరాల భూమి కొన్నారు. మా నానమ్మ, తాతలు వదిలి వెళ్లిన కోనాపూర్‌లో సొంత డబ్బుతో కార్పొరేట్‌ను మించిన సర్కారు బడి కట్టించాలనుకున్న. ఈ రోజు ముహూర్తం కుదిరింది. ఏడాదిలోపు భవనం నిర్మాణం పూర్తి చేస్త. రెండంతస్తుల్లో 14 గదులతో బడి నిర్మితమవుతుంది. విద్యా మంత్రిని తీసుకువచ్చి ప్రారంభించుకుందాం’ అని మంత్రి కేటీఆర్ చెప్పారు.
ఏప్రిల్, మే నెలల్లో మానేరు పొంగిందా!
సీఎం కేసీఆర్‌ది వ్యవసాయ కుటుంబమని, పొలం కొనుక్కుని ఇళ్లు కట్టుకుంటే ఫాంహౌస్ సీఎం అని విమర్శిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. నోరుందని కొందరు ఏది పడితే అది మాట్లాడుతున్నారని.. సీఎం వయసు, స్థాయికి విలువ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారని దుయ్యబట్టారు. ‘మాకు కూడా మస్తు మాట్లాడొచ్చు. కానీ బాధ్యతలున్నాయి’అన్నారు.
రైతు కుటుంబంలో పుట్టి వ్యవసాయం అంటే ఏంటో తెలిసినవాడు కాబట్టే రైతులకు సీఎం మేలు చేస్తున్నారని చెప్పారు. దుర్భిక్ష ప్రాంతాలైన సిరిసిల్ల, దుబ్బాక, సిద్దిపేట లాంటి ప్రాంతాలకు కాళేశ్వరం ద్వారా నీరు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. ఎగువ మానేరు ఎప్పుడన్నా ఏప్రిల్, మే నెలల్లో పొంగి పొర్లిందా అని ప్రశ్నించారు. మానేరు నది మొత్తం జీవనదిలా మారిందన్నారు.
మానేరుతో అనుబంధం
‘ఎగువ మానేరు నిర్మాణంతో నానమ్మ వాళ్ల భూములు ముంపునకు గురైతే మిడ్ మానేరు నిర్మాణంతో అమ్మమ్మ ఊరు కొదురుపాక మునిగింది. అమ్మమ్మ వాళ్ల భూముల మునిగాయి. మా చిన్న అమ్మమ్మ వాళ్లది వచ్చునూరు. దిగువ మానేరులో వాళ్ల ఊరు మునిగింది. మానేరు నదితో మా కుటుంబానికి ఏదో తెలియని అనుబంధం ఉంది’అని కేటీఆర్ వివరించారు.
అమ్మమ్మ ఊరిలోనూ బడి కట్టిస్తా
పేదలకు మంచి విద్య అందించాలన్న లక్ష్యంతో ‘మన ఊరు–మన బడి’కి సీఎం శ్రీకారం చుట్టారని, కార్యక్రమం కింద 26 వేల పాఠశాలల అభివృద్ధికి రూ.7,300 కోట్లు ఖర్చు చేయనున్నామని కేటీఆర్ వివరించారు. కామారెడ్డికి మెడికల్ కాలేజీ వస్తోందని, బీబీపేటలో జూనియర్ కాలేజీ త్వరలోనే ఏర్పాటవుతుందని చెప్పారు. సిరిసిల్ల జిల్లాలోని తన అమ్మమ్మ ఊరు కొదురుపాకలోనూ అమ్మమ్మ పేరుతో పాఠశాల కట్టిస్తానని కేటీఆర్ ప్రకటించారు.
అర్హులకు ఆసరా పెన్షన్లిస్తాం
సిరిసిల్ల: రాష్ట్రంలోని అర్హులైన వారికి కొత్తగా ఆసరా పెన్షన్లు ఇస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రైతుల రూ.50 వేల లోపు పంట రుణాలను మాఫీ చేస్తామన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రూ. 20 వేల కోట్లతో 2.70 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లను 560 చదరపు అడు గులతో నిర్మించామని.. పైసా లంచం లేకుండా లబ్ధిదారులకు అందించామని చెప్పారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమెరికా తలసరి ఆదాయం 60 వేల డాలర్లని (సుమారు రూ. 60 లక్షలు), మన దేశ తలసరి ఆదాయం రూ.1,800 ఉందని చెప్పారు. అచ్చే దిన్ అంటూ సిలిండర్, పెట్రోల్ ధరలను కేం ద్రం పెంచుతోందని.. మతాల మధ్య చిచ్చు పెడుతోందని ఆరోపించారు. ఎల్‌ఐసీ వంటి సంస్థలను అమ్మేస్తున్నారన్నారు. సిరిసిల్ల రాజీవ్ నగర్ రోడ్డులో మినీ స్టేడియం ప్రారంభోత్సవం సందర్భంగా జనం తోపులాట గా కేటీఆర్‌ను నెట్టడంతో ఆయన అసహనానికి గురయ్యారు. మున్సిపల్, పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేడియం లోకి రాకుండానే వెనుదిరిగారు.
కేటీఆర్‌కు కేసీఆర్ ఫోన్
కోనాపూర్‌లో తిరుగుతూ నానమ్మ వాళ్ల పాత ఇంటి వద్దకు చేరుకున్నప్పుడు సీఎం కేసీఆర్ నుంచి ఫోన్ వచ్చింది. ఎక్కడున్నావని సీఎం అడిగారని, నానమ్మ ఇంటి ముందు నిలబడ్డానని చెబితే మురిసిపోయారని కేటీఆర్ చెప్పారు. గ్రామస్తులు అడిగినవాటికి భరోసా ఇవ్వాలని కూడా చెప్పారని, వినతిపత్రంలో పేర్కొన్న వాటిని కలెక్టర్ పరిశీలించి నివేదికను తనకు ఇస్తే సీఎంతో మాట్లాడి శాంక్షన్ చేయిస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీ బీబీ పాటిల్, జెడ్పీ చైర్మన్ శోభ, ఎమ్మెల్సీ వీజీగౌడ్, జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment