శనివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్న వాణీదేవి
సాక్షి, హైదరాబాద్: హోరాహోరీగా సాగిన శాసనమండలి పట్టభద్రుల కోటా ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి రెండు స్థానాల్లోనూ జయకేతనం ఎగురవేసింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది మొదలు ప్రత్యర్థులపై ఆధిక్యత కనబరుస్తూ వచ్చిన టీఆర్‌ఎస్ అభ్యర్థులు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనూ పైచేయి సాధించి విజేతలుగా నిలిచారు. దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ప్రతికూలతను చవిచూసిన టీఆర్‌ఎస్‌కు ప్రస్తుత ఎన్నికల్లో పోటీచేసిన రెండు చోట్లా పట్టభద్రులు పట్టం కట్టారు. గత ఏడాది అక్టోబర్‌లో ప్రారంభమైన పట్టభద్ర ఓటర్ల నమోదు మొదలుకుని అభ్యర్థుల ఎంపిక, ప్రచారంలో దూకుడు, పార్టీ యంత్రాంగం నడుమ సమన్వయం.. తదితరాల్లో టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అనుసరించిన బహుముఖ వ్యూహం పార్టీ అభ్యర్థుల విజయానికి బాటలు వేసింది.
అధికార పార్టీకి ప్రత్యామ్నాయం తామేనంటూ... రాష్ట్రంలో రాజకీయంగా ఇరకాటంలోకి నెడుతున్న బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని టీఆర్‌ఎస్ కైవసం చేసుకోగా, మరోచోట ఆ పార్టీ అభ్యర్థి నాలుగో స్థానంలో నిలవడం టీఆర్‌ఎస్‌కు నూతన ఉత్తేజాన్ని ఇస్తోంది. మరోవైపు కేసీఆర్‌తో విభేదిస్తూ రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసిన వారితో పాటు సోషల్ మీడియా వేదికగా టీఆర్‌ఎస్ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్న వారు కూడా ఓటమి చెందడం తమ శ్రేణుల్లో నైతిక స్థైర్యం పెంచుతుందని పార్టీ భావిస్తోంది. కాగా పట్టభద్రుల ఎన్నికల ఫలితమిచ్చిన ఊపుతో త్వరలో జరిగే నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నికలోనూ గెలుపు సాధించాలని టీఆర్‌ఎస్ భావిస్తోంది.
నల్లగొండలో విజయ సంకేతం చూపిస్తున్న పల్లా
Comments
Please login to add a commentAdd a comment