సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలను విద్యుత్ అధికారులు పక్కదారి పట్టిస్తున్నారని తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, అడ్వకేట్ మద్దికుంట లింగం నాయీ ఆరోపించారు. నాయీ బ్రాహ్మణులు నిర్వహిస్తున్న క్షౌరశాలలకు ఉచితంగా విద్యుత్ పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇవ్వగా... అవగాహనలేమితో అధికారులు వ్యవహరిస్తున్నారని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఇతర కులాలు, మతాల వారు నడుపుతున్న క్షౌరశాలలు, బ్యూటీపార్‌లర్‌లను కూడా ఈ పథకం కింద నమోదు చేస్తున్నట్టు వెల్లడించారు.
దీనిపై అధికారులను ప్రశ్నించగా.. నాయీ బ్రాహ్మణులు నడుపుతున్న క్షౌరశాలలను మాత్రమే నమోదు చేయాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రత్యేక ఆదేశాలు అందలేదని జవాబిచ్చారని తెలిపారు. అధికారులు ఇలాగే వ్యవహరిస్తే క్షౌరవృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న క్షురకులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని నాయీ బ్రాహ్మణులు నడుపుతున్న క్షౌరశాలలను మాత్రమే ఉచిత విద్యుత్ పథకంలో చేర్చేలా ఆదేశాలు ఇవ్వాలని లింగం నాయీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment