సంక్రాంతికి కొత్త సచివాలయం సిద్ధం | Telangana: New Secretariat Likely To Be Ready By Sankranti | Sakshi
Sakshi News home page

సంక్రాంతికి కొత్త సచివాలయం సిద్ధం

Published Wed, Nov 9 2022 12:26 AM | Last Updated on Wed, Nov 9 2022 12:26 AM

Telangana: New Secretariat Likely To Be Ready By Sankranti - Sakshi

రాజస్తాన్‌ ధోల్‌పూర్‌ ఎర్ర రాతి ఫలకాలతో నిర్మిస్తున్న ఫౌంటెయిన్లు  

సాక్షి, హైదరాబాద్‌: సంక్రాంతి నాటికి కొత్త సచివాలయ భవనం సిద్ధం కాబోతోంది. డిసెంబర్‌ 31 నాటికి పనులు పూర్తి కావాలన్న సీఎం ఆదేశాల మేరకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఇప్పటి­వరకు 90 శాతం నిర్మాణం పూర్తయింది. ఎనిమిది అంతస్తుల కాంక్రీట్‌ పనులు పూర్తయ్యాయి. కీలకమైన భారీ గుమ్మటాల నిర్మాణం.. సమాంతరంగా భవనం లోపలి ఫినిషింగ్‌ పనులు వేగంగా జరుగుతు­న్నాయి. చుట్టూ రహదారులు, ఫుట్‌పా­త్‌లు, డ్రెయిన్లు, పచ్చికబయళ్లు పూర్తి కావాల్సి ఉంది.

వేగంగా లోపలి పనులు
కొత్త సచివాలయం లోపల ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు, సిబ్బంది కార్యా­ల­యాల్లో ఫ్లోరింగ్‌ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం వాల్‌ ప్యానలింగ్, ఫాల్స్‌ సీలింగ్, ఎయిర్‌ కండిషనింగ్, ఎలక్ట్రికల్‌ వైరింగ్, అగ్నిమాపక వ్యవస్థ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ఫర్నిచర్‌ సిద్ధంగా ఉంది. రాజస్తాన్‌లోని ధోల్పూర్‌ గనుల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ఎర్ర రాయి, లేత గోధుమ రంగు రాయిని ప్రధాన నిర్మాణం దిగువ, పైభాగంలో వెలుపలి వైపు అమరుస్తున్నారు. సచివాలయానికి నైరుతి భాగంలో దేవాలయం నిర్మిస్తున్నారు. ప్రధాన నిర్మాణం పూర్తికాగా పైన గోపురం నిర్మించాల్సి ఉంది. వెనుకభాగంలో నిర్మిస్తున్న మసీదు గుమ్మటం పనులు చేపట్టాల్సి ఉంది. దానికి పక్కనే నిర్మిస్తున్న చర్చి శ్లాబ్‌ పనులు మొదలవుతున్నాయి.

ఆరో అంతస్తులో సీఎం ఆఫీసు
భవనం ఎనిమిది అంతస్తులతో ఉంటుంది. ఇందులో లోయర్‌ గ్రౌండ్, గ్రౌండ్‌ ఫ్లోర్‌తోపాటు పైన ఆరు అంతస్తులు ఉంటాయి. గ్రౌండ్‌ ఫ్లోర్‌ మొదలు ప్రతి అంతస్తులో మంత్రుల కోసం నాలుగు చాంబర్లు ఉంటాయి. మంత్రులు, కేబినెట్‌ స్థాయిలో ఉండే వారికి వాటిని కేటా­యిస్తారు. మంత్రి చాంబర్‌ను ఆనుకునే ఆ శాఖ కార్యదర్శి, ఇతర అధికారుల చాంబర్లు ఉంటాయి.

సచివాలయంలో సీఎం కార్యాలయాన్ని ఆరో అంతస్తులో సిద్ధం చేస్తున్నారు. ఆయన తన కార్యాలయానికి వచ్చేందుకు వీలుగా ప్రధాన ద్వారం నుంచి కాకుండా నైరుతి భాగంలో రెండు లిఫ్టులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా భవన సముదాయంలో మరో 22 లిఫ్టులు ఏర్పాటు చేశారు. సీఎం కార్యాలయాన్ని బుల్లెట్‌ ప్రూఫ్‌తో సిద్ధం చేస్తున్నారు.

బుల్లెట్‌ ప్రూఫ్‌ బిగించాల్సిందిగా ఇటీవలే అధికారులు ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ ప్రతినిధులకు లేఖ రాశారు. త్వరలో ఆ పనులు మొదలు­కాబోతున్నాయి. కొత్త సచివాలయంలో రెండు భారీ ఫౌంటెయిన్లు నిర్మిస్తున్నారు. పార్లమెంటు ఫౌంటెయిన్‌ తరహాలో వీటిని రాజస్తాన్‌ ధోల్‌పూర్‌ ఎర్ర రాతి ఫలకాలతో సిద్ధం చేస్తున్నారు. ఈ పనులు తుది దశలో ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement