సాక్షి, హైదరాబాద్: జన్వాడ ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ తెలంగాణలో రాజకీయంగా సంచలనంగా మారింది. రేవ్ పార్టీలో కేటీఆర్ బావ మరిది ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు.. రేవ్ పార్టీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏ1గా కార్తిక్, ఏ2గా రాజ్ పాకాలను చేర్చారు.
జన్వాడ ఫామ్ హౌస్ రేవ్ పార్టీ తతంగంపై ఎక్సైజ్ పోలీసులు కూడా రంగం దిగారు. తాజాగా ఫామ్ హౌస్ మేనేజర్లు కార్తిక్, రాజేంద్ర ప్రసాద్ ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈవెంట్‌కి అనుమతి లేదని చెప్పారు. అలాగే, రేవ్ పార్టీ కోసం మహారాష్ట్ర, ఢిల్లీకి చెందిన అనుమతి లేని మద్యం తీసుకువచ్చినట్టు వెల్లడించారు. ఫామ్ హౌస్‌లో డ్యూటీ ఫ్రీ మద్యం లభ్యమైనట్టు చెప్పారు. దీంతో, ఎక్సైజ్ యాక్ట్ సెక్షన్ 34 కింద కేసును నమోదు చేశారు. అలాగే, ఈ పార్టీలో విదేశీ మద్యం కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలా ఉండగా.. రేవ్ పార్టీలో మొత్తం 35 మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. పాల్గొన్న వారిలో 21 మంది పురుషులు, 14 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేవ్ పార్టీలో విజయ్ మద్దూరి అనే వ్యక్తి కొకైన్ తీసుకున్నట్లు పోలీసుల పరీక్షల్లో నిర్ధారణ అయింది. కొకైన్ తీసుకున్నట్లు పరీక్షలో తేలడంతో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇక, మహిళలకు టెస్టులు చేసే సమయంలో పోలీసులకు వారికి సహాకరించలేదని సమాచారం. పోలీసులకు చుక్కలు చూపించినట్టు తెలిసింది. విజయ్ మద్దూరి కూడా పోలీసులను బెదిరించినట్టు సమాచారం.
అలాగే, రేవ్ పార్టీలో క్యాసినో పరికరాలు సైతం స్వాధీనం చేసుకోవడంతో క్యాసినో నిర్వహించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫామ్ హౌస్‌లో ప్లేయింగ్ కార్డ్స్, ప్లాస్టిక్ కైన్స్ వంటివి కూడా స్వాధీనం చేసుకున్నారు. కాగా, 30 ఎకరాల్లో రాజ్ పాకాల ఫామ్‌హౌస్ విస్తరించి ఉంది. రేవ్ పార్టీ, అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మించారనే ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని సీజ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment