ధ్వంసమైన కారు
సాక్షి, సిద్దిపేట, చేర్యాల: అధికార పార్టీ బీఆర్‌ఎస్‌కి చెందిన చేర్యాల జెడ్పీటీసీ సభ్యుడు మల్లేశంను హత్య చేయాల్సిన అవసరం ఎవరికుంది..? ఆస్తి వివాదాలా.. కుల సంబంధమైన పంచాయితీనా.. లేదా ఇతరత్రా ఏమైనా కారణాలున్నాయా అనే వాటిపై పోలీసులు లోతైన విచారణ చేపట్టారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం గుర్జకుంటలో కుల సంఘానికి చెందిన స్థలంలోని కొంత భాగాన్ని బీరప్ప గుడి కోసం వదిలి మిగిలిన భూమిని ఆరేళ్ల కిందట హైదరాబాద్‌కు చెందిన వారికి విక్రయించారు.
వచ్చిన డబ్బును కుల సభ్యులు పంచుకున్నారు. అదే భూమిని తిరిగి గ్రామంలో కులసంఘం పెద్దగా వ్యవహరిస్తున్న జెడ్పీటీసీ మల్లేశం మనుషులే కొనుగోలు చేశారనే ప్రచారం ఉంది. ఈ వ్యవహారంలో పెద్దమొత్తంలో డబ్బులు చేతులు మారాయంటూ ఆ గ్రామానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి ఆరోపణలు చేయడంతో గతంలో గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఆ ప్రజాప్రతినిధికి మరో విషయంలోనూ మల్లేశంతో వివాదం నడిచింది.
సదరు ప్రజాప్రతినిధికి, అన్నదమ్ముల ఆస్తి పంపకాల్లో గొడవలు జరుగుతున్నాయి. ఆస్తి వివాదం కోర్టులో కూడా ఉంది. అయినా ఎకరం పొలాన్ని సదరు ప్రజాప్రతినిధి సాగు చేస్తుండటంతో విషయాన్ని కుల పెద్ద మల్లేశం దృష్టికి అతని సోదరులు తీసుకెళ్లారు. భూ వివాదం కోర్టు పరిధిలో ఉన్నందున సాగు చేయొద్దంటూ ఆ ప్రజాప్రతినిధికి కుల పంచాయితీలో ఆదేశించారని తెలిసింది.
ఈ పరిణామాలతో సదరు ప్రజా ప్రతినిధి పగ పెంచుకున్నాడని అంటున్నారు. ఇదిలా ఉంటే మల్లేశం హయాంలో బీరప్ప దేవాలయ నిర్మాణ పనులు శర వేగంగా జరిపిస్తున్నారు. వచ్చే ఫిబ్రవరి 16వ తేదీన పండగ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పండగ వరకు మల్లేశం బతుకుతాడా... చంపేస్తాం అని పలు మార్లు సదరు ప్రజా ప్రతినిధి హెచ్చరించినట్టు విశ్వసనీయ సమాచారం.
గ్రామంలో ఆధిపత్య పోరునా?
ఇక గుర్జకుంట గ్రామ పంచాయతీలో అవకతవకలు జరిగాయని స్థానికులు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. ఆ దరఖాస్తు చేసిన యువకులు మల్లేశం అనుచరులనే అనుమానం సైతం గ్రామపంచాయతీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధుల్లో ఉంది. స.హ చట్టం ప్రకారం వివరాలు బయటకు వచ్చి తాము అవకతవకలకు పాల్పడినట్లు తేలితే చెక్‌పవర్ రద్దవుతుందనే భయంతో మల్లేశంపై కక్ష పెంచుకుని ఉంటారని గ్రామంలో చర్చ సాగుతోంది.
వాకింగ్‌కు వెళ్లింది ఎవరు ?
ప్రతి రోజూ ఉదయం వాకింగ్‌కు జెడ్పీటీసీ మల్లేశంతోపాటు ఎవరెవరు వెళ్తుంటారు అని పోలీసులు ఆరా తీస్తున్నారు. సోమవారం ఉదయం ఎవరెవరు వెళ్లారు అని వివరాలు తెలుసుకుంటున్నారు. కాగా హత్య చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత చెప్పారు.
ఉద్రిక్తంగా అంతిమ యాత్ర..
మల్లేశం అంతిమయాత్ర మంగళవారం ఉద్రిక్తతల నడుమ సాగింది. యాత్ర సాగుతుండగానే హత్యకు కారకులని అనుమానిస్తున్న గుర్జకుంట గ్రామంలోని పలువురు ఇళ్లపై మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు దాడి చేశారు. నంగి చంద్రకాంత్ ఇంటిపై దాడిచేసి అద్దాలు పగలగొట్టడంతో పాటు కారు, ట్రాక్టర్ ధ్వంసం చేశారు. నంగి అనిల్‌కు చెందిన కారును ధ్వంసం చేశారు. గ్రామ ఉపసర్పంచ్ నంగి సత్తయ్య ఇంటిపై దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అంతిమ యాత్రలో మెదక్ ఎంపీ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ రోజాశర్మ, జనగామ ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment