cherial
-
ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి మరోసారి షాకిచ్చిన కూతురు భవానీ రెడ్డి
సాక్షి, జనగామ: జనగామ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డి, కూతురు తుల్జా భవానీ రెడ్డి మధ్య భూవివాదం మరోసారి హైలైట్ అయ్యింది. ఈ క్రమంలో ముత్తిరెడ్డిపై కూతురు భవానీ రెడ్డి మరోసారి సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయామే చేర్యాల చేరుకున్న తుల్జా భవానీ రెడ్డి.. తన పేరుపై ఉన్న భూమి చుట్టూ ఉన్న ప్రహరీ గోడను కూల్చేశారు. దీంతో, ఈ అంశం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. వివరాల ప్రకారం.. తుల్జా భవానీ రెడ్డి ఆదివారం ఉదయం చేర్యాల చేరుకున్నారు. అనంతరం.. తన పేరుపై ఉన్న భూమి చుట్టూ ఉన్న ప్రహరీ గోడను కూల్చేశారు. తన తండ్రి ప్రభుత్వ భూమిని కబ్జా చేసి తన పేరున రిజిస్ట్రేషన్ చేశారనీ.. ఆ భూమి తనకు వద్దని ఆమె తెలిపారు. ఈ క్రమంలోనే ఆ భూమిని మున్సిపాలిటికి అప్పగిస్తానని స్పష్టం చేశారు. గ్రామ స్థలాన్ని తన తండ్రి తన పేరు పైన రిజిస్ట్రేషన్ చేసినందుకు క్షమించాలని గ్రామస్థులను కోరారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు మత్తడి వద్ద 1270 గజాల స్థలాన్ని నాపేరు మీద రాశారు. అక్రమంగా తండ్రి సంపాదించిన 1402సర్వే నెంబర్లో ఉన్న 1270గజాల స్థలాన్ని మున్సిపాలిటికి రిజిస్ట్రేషన్ చేస్తున్నాను. ఈ స్థలం మళ్లీ ఎవరి పేరు మీదకు అక్రమ రిజిస్ట్రేషన్ కాకుండా కోర్టు ద్వారా చేర్యాల మున్సిపాలిటీకి అప్పగిస్తాను. ఎమ్మెల్యే అయి ఉండి ఇటువంటి అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకోవడం తప్పు. నా తండ్రి ముత్తిరెడ్డికి ఎమ్మెల్యే అవకముందే వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. నెలకు కోటిన్నర రూపాయల రెంట్లు వస్తాయి. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి పనులు చేయడం తప్పు. దీనిపై చేర్యాల ప్రజలు క్షమించండి అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: బండ్ల గణేష్ పొలిటికల్ ట్వీట్.. రాజకీయాల్లోకి రీఎంట్రీ! -
చేర్యాల జెడ్పీటీసీ హత్య: భూముల అమ్మకాలా.. బీరప్పగుడి వ్యవహారమా?
సాక్షి, సిద్దిపేట, చేర్యాల: అధికార పార్టీ బీఆర్ఎస్కి చెందిన చేర్యాల జెడ్పీటీసీ సభ్యుడు మల్లేశంను హత్య చేయాల్సిన అవసరం ఎవరికుంది..? ఆస్తి వివాదాలా.. కుల సంబంధమైన పంచాయితీనా.. లేదా ఇతరత్రా ఏమైనా కారణాలున్నాయా అనే వాటిపై పోలీసులు లోతైన విచారణ చేపట్టారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం గుర్జకుంటలో కుల సంఘానికి చెందిన స్థలంలోని కొంత భాగాన్ని బీరప్ప గుడి కోసం వదిలి మిగిలిన భూమిని ఆరేళ్ల కిందట హైదరాబాద్‌కు చెందిన వారికి విక్రయించారు. వచ్చిన డబ్బును కుల సభ్యులు పంచుకున్నారు. అదే భూమిని తిరిగి గ్రామంలో కులసంఘం పెద్దగా వ్యవహరిస్తున్న జెడ్పీటీసీ మల్లేశం మనుషులే కొనుగోలు చేశారనే ప్రచారం ఉంది. ఈ వ్యవహారంలో పెద్దమొత్తంలో డబ్బులు చేతులు మారాయంటూ ఆ గ్రామానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి ఆరోపణలు చేయడంతో గతంలో గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఆ ప్రజాప్రతినిధికి మరో విషయంలోనూ మల్లేశంతో వివాదం నడిచింది. సదరు ప్రజాప్రతినిధికి, అన్నదమ్ముల ఆస్తి పంపకాల్లో గొడవలు జరుగుతున్నాయి. ఆస్తి వివాదం కోర్టులో కూడా ఉంది. అయినా ఎకరం పొలాన్ని సదరు ప్రజాప్రతినిధి సాగు చేస్తుండటంతో విషయాన్ని కుల పెద్ద మల్లేశం దృష్టికి అతని సోదరులు తీసుకెళ్లారు. భూ వివాదం కోర్టు పరిధిలో ఉన్నందున సాగు చేయొద్దంటూ ఆ ప్రజాప్రతినిధికి కుల పంచాయితీలో ఆదేశించారని తెలిసింది. ఈ పరిణామాలతో సదరు ప్రజా ప్రతినిధి పగ పెంచుకున్నాడని అంటున్నారు. ఇదిలా ఉంటే మల్లేశం హయాంలో బీరప్ప దేవాలయ నిర్మాణ పనులు శర వేగంగా జరిపిస్తున్నారు. వచ్చే ఫిబ్రవరి 16వ తేదీన పండగ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పండగ వరకు మల్లేశం బతుకుతాడా... చంపేస్తాం అని పలు మార్లు సదరు ప్రజా ప్రతినిధి హెచ్చరించినట్టు విశ్వసనీయ సమాచారం. గ్రామంలో ఆధిపత్య పోరునా? ఇక గుర్జకుంట గ్రామ పంచాయతీలో అవకతవకలు జరిగాయని స్థానికులు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. ఆ దరఖాస్తు చేసిన యువకులు మల్లేశం అనుచరులనే అనుమానం సైతం గ్రామపంచాయతీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధుల్లో ఉంది. స.హ చట్టం ప్రకారం వివరాలు బయటకు వచ్చి తాము అవకతవకలకు పాల్పడినట్లు తేలితే చెక్‌పవర్ రద్దవుతుందనే భయంతో మల్లేశంపై కక్ష పెంచుకుని ఉంటారని గ్రామంలో చర్చ సాగుతోంది. వాకింగ్‌కు వెళ్లింది ఎవరు ? ప్రతి రోజూ ఉదయం వాకింగ్‌కు జెడ్పీటీసీ మల్లేశంతోపాటు ఎవరెవరు వెళ్తుంటారు అని పోలీసులు ఆరా తీస్తున్నారు. సోమవారం ఉదయం ఎవరెవరు వెళ్లారు అని వివరాలు తెలుసుకుంటున్నారు. కాగా హత్య చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత చెప్పారు. ఉద్రిక్తంగా అంతిమ యాత్ర.. మల్లేశం అంతిమయాత్ర మంగళవారం ఉద్రిక్తతల నడుమ సాగింది. యాత్ర సాగుతుండగానే హత్యకు కారకులని అనుమానిస్తున్న గుర్జకుంట గ్రామంలోని పలువురు ఇళ్లపై మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు దాడి చేశారు. నంగి చంద్రకాంత్ ఇంటిపై దాడిచేసి అద్దాలు పగలగొట్టడంతో పాటు కారు, ట్రాక్టర్ ధ్వంసం చేశారు. నంగి అనిల్‌కు చెందిన కారును ధ్వంసం చేశారు. గ్రామ ఉపసర్పంచ్ నంగి సత్తయ్య ఇంటిపై దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అంతిమ యాత్రలో మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజాశర్మ, జనగామ ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
వాకింగ్‌కు వెళ్లిన చేర్యాల జెడ్పీటీసీ దారుణ హత్య
చేర్యాల (సిద్దిపేట): అధికార బీఆర్ఎస్కు చెందిన సిద్దిపేట జిల్లా చేర్యాల జెడ్పీటీసీ సభ్యు డు శెట్టె మల్లేశం (43) దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. చేర్యాల మండలంలోని స్వగ్రామమైన గుర్జకుంటలో మల్లేశం సోమవారం ఉదయం 6 గంటలకు రోజు మాదిరిగా మార్నింగ్ వాకింగ్‌కు బయలుదేరారు. గుర్జకుంట క్రాస్ రోడ్డు వైపునకు వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయగా, తలకు తీవ్ర గాయాలై కింద పడిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్సులో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన వైద్యులు తదుపరి చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని చెప్పగా, సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగా మల్లేశం మృతి చెందారు. ఆయనకు ఏదైనా ప్రమాదంలో గాయాలయ్యాయా? లేదా ఎవరైనా దాడి చేశారా? అన్న అనుమానాలు తొలుత వ్యక్తమయ్యాయి. తర్వాత పోలీసులు హత్యగా నిర్ధారించారు. మల్లేశంపై దాడికి కారణమైన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దాడి విషయం తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేర్యాల పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఘటనపై ఆరా తీశారు. మృతదేహాన్ని త్వరగా గ్రామానికి తెచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత.. అడిషనల్ డీసీపీ మహేందర్, హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, చేర్యాల సీఐ శ్రీనివాస్, ఎస్ఐ భాస్కర్‌రెడ్డితో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించామని 24 గంటల్లోపు నిందితులను పట్టుకుని హత్యకు గల కారణాలను వెల్లడిస్తామని చెప్పారు. మల్లేశానికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మంత్రి, ఎమ్మెల్యే దిగ్భ్రాంతి ప్రజాసేవ కోసం పరితపించే శెట్టె మల్లేశం మృతి చాలా బాధాకరమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు. మృతికి కారణ మైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గజ్వేల్ ఆస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. -
చేర్యాలలో లజ్జా గౌరీ శిల్పం
సాక్షి,హైదరాబాద్: అమ్మతనానికి ప్రతీకగా భావించే లజ్జా గౌరీ (అమ్మ దేవత) పురాతన శిల్పం చేర్యాల మండల కేంద్రం శివారులో బయల్పడింది. ఎనిమిది అడుగుల ఎత్తున్న గుండుకు చెక్కిన ఈ శిల్పాన్ని ఔత్సాహిక పరిశోధకులు రత్నాకరరెడ్డి ఆదివారం పరిశీలించారు. ఓ వ్యవసాయ పొలంలో ఉన్న ఈ గుండుకు ఓవైపు భైరవుడి రూపం ఉంది. మరోవైపు సన్నగా, విస్తృత కటి భాగంతో నగ్నంగా కూర్చున్నట్లు ఉండే ఈ శిల్పం ప్రసవస్థితిలో ఉన్నట్టుగా ఉంది. లజ్జా గౌరీ రూపం నగ్నంగా ఉంటున్నందున శిరస్సు స్థానంలో పద్మం ఆకృతిని చెక్కుతారు. వివిధ ప్రాంతాల్లో వెలుగు చూసిన శిల్పాలు కూడా ఇదేవిషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. కానీ చేర్యాలలో గుండుకు చెక్కిన రూపంలో పద్మం బదులుగా తలభాగం ఉండటం విశేషం. సాధారణంగా లజ్జా గౌరీ ఆరాధన మనోవికారాన్ని నివారించటంతోపాటు మోహ, ఆధ్యాత్మిక భావనలు కలిగిస్తుందంటారు చరిత్రకారులు. గతంలో లజ్జా గౌరీ ఆరాధన విస్తృతంగా ఉండేదని, కాలక్రమంలో తగ్గిపోయిందని రత్నాకరరెడ్డి తెలిపారు. చేర్యాలలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర విగ్రహాలు కూడా బయల్పడ్డాయి. చదవండి: కరోనా: బూస్టర్ డోస్‌లతో వేరియెంట్లకు చెక్ -
పెద్దలు తమ ప్రేమను అంగీకరించలేదని..
సాక్షి, హైదరాబాద్ : తమ ప్రేమను పెద్దలు అంగీకరించరనే భయంలో ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కడవేర్గులో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడవేర్గుకు చెందిన తౌట స్వాతి, కోడూరి నవీన్‌లు గత కొద్ది రోజులుగా ప్రేమించుకుటున్నారు. తమ ప్రేమను కుటుంబ పెద్దలు అంగీకరించరనే భయంలో శనివారం ఉదయం ఇంటి నుంచి పారిపోయారు. రాత్రంతా యాదాద్రి జిల్లా భువనగిరి గుట్టపై గడిపారు. ఆదివారం ఉదయం ఇద్దరు పురుగులమందు తాగి భువనగిరిలో ఉంటున్న స్నేహితులకు ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పారు. దీంతో కంగారుపడ్డ నవీన్ స్నేహితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని స్వాతి, నవీన్‌లను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
కుడి ఎడమల దగా
సాక్షి, సిద్దిపేట: చేర్యాల పట్టణంలోని కుడి చెరువు కళ్లెదుటే దర్జాగా కబ్జా అవుతోంది. బస్టాండ్ సమీపంలో ఉన్న ఈ చెరువు నీటిపారుదలశాఖ లెక్కల ప్రకారం 60.20 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. చెరువు పూర్తిగా నిండితే (ఎఫ్టీఎల్) విస్తీర్ణం 93 ఎకరాలుగా నిర్ధారించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చివరి సరిహద్దుగా ఉన్న చేర్యాల.. జిల్లాల విభజనలో సిద్దిపేట జిల్లాలో కలిసింది. దీంతో చేర్యాల.. పట్టణ రూపు సంతరించుకుని వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇది గుర్తించిన ప్రభుత్వం చేర్యాలకు నగర పంచాయతీ హోదాను ప్రకటించింది. కుడి చెరువు శిఖం ప్రాంతం చేర్యాల నుంచి హైదరాబాద్, సిద్దిపేట పట్టణాలకు వెళ్లే ప్రధాన రహదారి దుద్దెడ రోడ్డుకు ఆనుకుని ఉంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ చెరువు శిఖం ప్రాంతం చేర్యాల పట్టణంలో ప్రధాన వాణిజ్య కేంద్రం కానుంది. దీంతో దీనిపై కన్నేసిన ఆక్రమణదారులు చెరువుకు పక్కనే ఉన్న పట్టా భూముల్ని ఎరగా చూపి.. శిఖాన్ని మింగేస్తున్నారు. అందులో వర్తక వాణిజ్య భవనాలు నిర్మిస్తున్నారు. ఇలా కుడి చెరువు శిఖంలో 30 వరకు అక్రమ కట్టడాలు వెలిశాయి. హద్దులు మీరుతున్న అధికారం చెరువు హద్దులు దాటి ఆక్రమణదారులు నిర్మాణాలు చేపడుతున్నా ఇటు రెవెన్యూ, అటు గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదు. చెరువు సాధారణ విస్తీర్ణం వరకు ప్రభుత్వ సర్వే నంబర్లలో ఉండగా, ఎఫ్టీఎల్ ప్రాంతం ఉన్న సర్వే నంబర్లలో పట్టాదారులు ఉన్నారు. ఎఫ్టీఎల్ ప్రాంతంలోని భూముల్లో నీరు నిండుగా లేనప్పుడు మాత్రమే సాగు చేసుకోవాలని రెవెన్యూ చట్టం చెబుతోంది. అలాగే, ఎఫ్టీఎల్కు 30 మీటర్ల దూరాన్ని బఫర్ జోన్‌గా పరిగణిస్తారు. ఈ స్థలంలో నిర్మాణాలకు పంచాయతీ అధికారులు అనుమతి ఇవ్వకూడదు. కానీ అవేమీ పట్టనట్లు పలువురు చెరువులో కొంత భాగంతోపాటు, ఎఫ్టీఎల్ ప్రాంతంలో మట్టి నింపి మరీ నిర్మాణాలు చేపట్టారు. హద్దురాళ్లు పారేసినా.. చర్యల్లేవ్ కబ్జాలపై గతంలో నీటిపారుదల శాఖ అధికారులు సర్వే చేయించి ఎఫ్టీఎల్ హద్దురాళ్లు పాతారు. అక్రమ నిర్మాణాలపై చర్యలకు రెవెన్యూ, పంచాయతీ అధికారులకు సిఫార్సు చేశారు. ఈ రెండు శాఖల అధికారులు ఒకరిద్దరికి నోటీసులు జారీచేసి చేతులు దులుపుకున్నారు. విలువైన భూమిలో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించకుండా ఉండేందుకు రెవెన్యూ, పంచాయతీ అధికారులకు భారీ మొత్తంలో ముడుపులు అందాయని, రాజకీయ నాయకులకూ వాటాలు ముట్టాయని, అందుకే ఎవరూ అటువైపు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలున్నాయి. దీంతో ఆక్రమణదారులు రెచ్చిపోయి ఇటీవల హద్దురాళ్లను సైతం తీసిపారేశారు. జిల్లా అధికారులు స్పందించి చేర్యాల కుడి చెరువును రక్షించాలని, విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. చెరువును కాపాడాలి చేర్యాలలోని కుడి చెరువు శిఖం మొత్తం 60 ఎకరాలు ఉంటుంది. ఇందులో ఐదెకకరాల భూమి ఆక్రమణకు గురైంది. దీనిపై పూర్వపు వరంగల్ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పందించి చెరువు ఆక్రమణకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని చెరువును కాపాడాలి. – అందె బీరన్న. చేర్యాల కబ్జాదారులపై చర్యలు తీసుకుంటాం చేర్యాల కుడి చెరువు ఎఫ్టీఎల్ పరిధి దాటి నిర్మాణాలు చేపట్టిన మాట వాస్తవమే. గతంలో మా శాఖ తరపున సర్వే చేయించి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, పంచాయతీ అధికారులను కోరాం. పలువురికి మా శాఖ తరపున నోటీసులు జారీ చేశాం. ఇటీవల ఎఫ్టీఎల్ రాళ్లను పలువురు తీసివేశారు. తిరిగి వాటిని ఏర్పాటు చేస్తాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. శిఖం భూమిలో నిర్మాణాలు చేపట్టిన వారెవరినీ వదలం. – స్వామిదాసు, నీటిపారుదలశాఖ డీఈ చెరువు ఉనికి కోల్పోతోంది చేర్యాల కుడి చెరువు సర్వే నంబర్ 202, 203లలో విస్తరించి ఉంది. కబ్జాలతో చెరువు ఉనికి కోల్పోతోంది. చెరువులోకి నీరు రాకుండా మార్గాలు మూసివేసిన విషయమై అప్పటి వరంగల్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. ఎన్నో ధర్నాలు చేశాం. ఫలితం లేదు. ఇప్పుడు చేర్యాల సిద్దిపేట జిల్లాలో విలీనమయ్యాక ఫిర్యాదు చేస్తే ఇక్కడి అధికారులు ఎఫ్టీఎల్ హద్దులు ఏర్పాటు చేశారు కానీ, వాటిని కబ్జాదారులు కొద్దిరోజులకే తొలగించారు. అక్రమ నిర్మాణాలు కూల్చివేయలేదు. – అనెబోయిన స్వామి, చేర్యాల -
అడవి పంది దాడి: ముగ్గురికి గాయాలు
వరంగల్: వరంగల్ జిల్లా చేర్యాల మండల కేంద్రంలో శనివారం అడవిపంది హల్చల్ చేసింది. స్థానిక పాత వీరభద్ర సినిమాహాల్ సమీపంలో నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు పాదచారులపై అడవిపంది దాడి చేసింది. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం అడవిపందిని చంపేశారు. -
భారీగా రేషన్ బియ్యం పట్టివేత
కీసర : రంగారెడ్డి జిల్లా కీసర మండలం చీర్యాలలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి కమాన్ వద్ద పోలీసులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటోలో తరలిస్తున్న 9 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆటోతోపాటు ఎస్కార్ట్‌గా బైకుపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 2250 నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆటోతోపాటు బైకును సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆగంతకులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఈ తనిఖీలు నిర్వహించారు.