చెరువు శిఖం భూమిలో వెలిసిన నిర్మాణాలు
సాక్షి, సిద్దిపేట: చేర్యాల పట్టణంలోని కుడి చెరువు కళ్లెదుటే దర్జాగా కబ్జా అవుతోంది. బస్టాండ్ సమీపంలో ఉన్న ఈ చెరువు నీటిపారుదలశాఖ లెక్కల ప్రకారం 60.20 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. చెరువు పూర్తిగా నిండితే (ఎఫ్‌టీఎల్) విస్తీర్ణం 93 ఎకరాలుగా నిర్ధారించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చివరి సరిహద్దుగా ఉన్న చేర్యాల.. జిల్లాల విభజనలో సిద్దిపేట జిల్లాలో కలిసింది. దీంతో చేర్యాల.. పట్టణ రూపు సంతరించుకుని వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇది గుర్తించిన ప్రభుత్వం చేర్యాలకు నగర పంచాయతీ హోదాను ప్రకటించింది. కుడి చెరువు శిఖం ప్రాంతం చేర్యాల నుంచి హైదరాబాద్, సిద్దిపేట పట్టణాలకు వెళ్లే ప్రధాన రహదారి దుద్దెడ రోడ్డుకు ఆనుకుని ఉంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ చెరువు శిఖం ప్రాంతం చేర్యాల పట్టణంలో ప్రధాన వాణిజ్య కేంద్రం కానుంది. దీంతో దీనిపై కన్నేసిన ఆక్రమణదారులు చెరువుకు పక్కనే ఉన్న పట్టా భూముల్ని ఎరగా చూపి.. శిఖాన్ని మింగేస్తున్నారు. అందులో వర్తక వాణిజ్య భవనాలు నిర్మిస్తున్నారు. ఇలా కుడి చెరువు శిఖంలో 30 వరకు అక్రమ కట్టడాలు వెలిశాయి.
హద్దులు మీరుతున్న అధికారం
చెరువు హద్దులు దాటి ఆక్రమణదారులు నిర్మాణాలు చేపడుతున్నా ఇటు రెవెన్యూ, అటు గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదు. చెరువు సాధారణ విస్తీర్ణం వరకు ప్రభుత్వ సర్వే నంబర్లలో ఉండగా, ఎఫ్‌టీఎల్ ప్రాంతం ఉన్న సర్వే నంబర్లలో పట్టాదారులు ఉన్నారు. ఎఫ్‌టీఎల్ ప్రాంతంలోని భూముల్లో నీరు నిండుగా లేనప్పుడు మాత్రమే సాగు చేసుకోవాలని రెవెన్యూ చట్టం చెబుతోంది. అలాగే, ఎఫ్‌టీఎల్‌కు 30 మీటర్ల దూరాన్ని బఫర్ జోన్‌గా పరిగణిస్తారు. ఈ స్థలంలో నిర్మాణాలకు పంచాయతీ అధికారులు అనుమతి ఇవ్వకూడదు. కానీ అవేమీ పట్టనట్లు పలువురు చెరువులో కొంత భాగంతోపాటు, ఎఫ్‌టీఎల్ ప్రాంతంలో మట్టి నింపి మరీ నిర్మాణాలు చేపట్టారు.
హద్దురాళ్లు పారేసినా.. చర్యల్లేవ్
కబ్జాలపై గతంలో నీటిపారుదల శాఖ అధికారులు సర్వే చేయించి ఎఫ్‌టీఎల్ హద్దురాళ్లు పాతారు. అక్రమ నిర్మాణాలపై చర్యలకు రెవెన్యూ, పంచాయతీ అధికారులకు సిఫార్సు చేశారు. ఈ రెండు శాఖల అధికారులు ఒకరిద్దరికి నోటీసులు జారీచేసి చేతులు దులుపుకున్నారు. విలువైన భూమిలో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించకుండా ఉండేందుకు రెవెన్యూ, పంచాయతీ అధికారులకు భారీ మొత్తంలో ముడుపులు అందాయని, రాజకీయ నాయకులకూ వాటాలు ముట్టాయని, అందుకే ఎవరూ అటువైపు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలున్నాయి. దీంతో ఆక్రమణదారులు రెచ్చిపోయి ఇటీవల హద్దురాళ్లను సైతం తీసిపారేశారు. జిల్లా అధికారులు స్పందించి చేర్యాల కుడి చెరువును రక్షించాలని, విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
చెరువును కాపాడాలి
చేర్యాలలోని కుడి చెరువు శిఖం మొత్తం 60 ఎకరాలు ఉంటుంది. ఇందులో ఐదెకకరాల భూమి ఆక్రమణకు గురైంది. దీనిపై పూర్వపు వరంగల్ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పందించి చెరువు ఆక్రమణకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని చెరువును కాపాడాలి.
– అందె బీరన్న. చేర్యాల
కబ్జాదారులపై చర్యలు తీసుకుంటాం
చేర్యాల కుడి చెరువు ఎఫ్‌టీఎల్ పరిధి దాటి నిర్మాణాలు చేపట్టిన మాట వాస్తవమే. గతంలో మా శాఖ తరపున సర్వే చేయించి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, పంచాయతీ అధికారులను కోరాం. పలువురికి మా శాఖ తరపున నోటీసులు జారీ చేశాం. ఇటీవల ఎఫ్‌టీఎల్ రాళ్లను పలువురు తీసివేశారు. తిరిగి వాటిని ఏర్పాటు చేస్తాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. శిఖం భూమిలో నిర్మాణాలు చేపట్టిన వారెవరినీ వదలం.
– స్వామిదాసు, నీటిపారుదలశాఖ డీఈ
చెరువు ఉనికి కోల్పోతోంది
చేర్యాల కుడి చెరువు సర్వే నంబర్ 202, 203లలో విస్తరించి ఉంది. కబ్జాలతో చెరువు ఉనికి కోల్పోతోంది. చెరువులోకి నీరు రాకుండా మార్గాలు మూసివేసిన విషయమై అప్పటి వరంగల్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. ఎన్నో ధర్నాలు చేశాం. ఫలితం లేదు. ఇప్పుడు చేర్యాల సిద్దిపేట జిల్లాలో విలీనమయ్యాక ఫిర్యాదు చేస్తే ఇక్కడి అధికారులు ఎఫ్‌టీఎల్ హద్దులు ఏర్పాటు చేశారు కానీ, వాటిని కబ్జాదారులు కొద్దిరోజులకే తొలగించారు. అక్రమ నిర్మాణాలు కూల్చివేయలేదు.
– అనెబోయిన స్వామి, చేర్యాల
Comments
Please login to add a commentAdd a comment