
పురుగులమందు తాగి భువనగిరిలో ఉంటున్న స్నేహితులకు ఫోన్ చేసి..
సాక్షి, హైదరాబాద్ : తమ ప్రేమను పెద్దలు అంగీకరించరనే భయంలో ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కడవేర్గులో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడవేర్గుకు చెందిన తౌట స్వాతి, కోడూరి నవీన్‌లు గత కొద్ది రోజులుగా ప్రేమించుకుటున్నారు. తమ ప్రేమను కుటుంబ పెద్దలు అంగీకరించరనే భయంలో శనివారం ఉదయం ఇంటి నుంచి పారిపోయారు.
రాత్రంతా యాదాద్రి జిల్లా భువనగిరి గుట్టపై గడిపారు. ఆదివారం ఉదయం ఇద్దరు పురుగులమందు తాగి భువనగిరిలో ఉంటున్న స్నేహితులకు ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పారు. దీంతో కంగారుపడ్డ నవీన్ స్నేహితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని స్వాతి, నవీన్‌లను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.