చేర్యాల (సిద్దిపేట): అధికార బీఆర్‌ఎస్‌కు చెందిన సిద్దిపేట జిల్లా చేర్యాల జెడ్పీటీసీ సభ్యు డు శెట్టె మల్లేశం (43) దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. చేర్యాల మండలంలోని స్వగ్రామమైన గుర్జకుంటలో మల్లేశం సోమవారం ఉదయం 6 గంటలకు రోజు మాదిరిగా మార్నింగ్ వాకింగ్‌కు బయలుదేరారు. గుర్జకుంట క్రాస్ రోడ్డు వైపునకు వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయగా, తలకు తీవ్ర గాయాలై కింద పడిపోయారు.
గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్సులో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన వైద్యులు తదుపరి చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని చెప్పగా, సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగా మల్లేశం మృతి చెందారు. ఆయనకు ఏదైనా ప్రమాదంలో గాయాలయ్యాయా? లేదా ఎవరైనా దాడి చేశారా? అన్న అనుమానాలు తొలుత వ్యక్తమయ్యాయి.
తర్వాత పోలీసులు హత్యగా నిర్ధారించారు. మల్లేశంపై దాడికి కారణమైన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దాడి విషయం తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేర్యాల పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఘటనపై ఆరా తీశారు. మృతదేహాన్ని త్వరగా గ్రామానికి తెచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత.. అడిషనల్ డీసీపీ మహేందర్, హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, చేర్యాల సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డితో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించామని 24 గంటల్లోపు నిందితులను పట్టుకుని హత్యకు గల కారణాలను వెల్లడిస్తామని చెప్పారు. మల్లేశానికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
మంత్రి, ఎమ్మెల్యే దిగ్భ్రాంతి
ప్రజాసేవ కోసం పరితపించే శెట్టె మల్లేశం మృతి చాలా బాధాకరమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు. మృతికి కారణ మైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గజ్వేల్ ఆస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment