
బాలమల్లు (నిందితుడు)
దౌల్తాబాద్(దుబ్బాక): కన్నకొడుకే కాలయముడయ్యాడు. డబ్బులు ఇవ్వడం లేదని అక్కసు పెంచుకుని కన్నతల్లికి నిప్పంటించాడు ఓ ప్రబుద్ధుడు. అడ్డు వచ్చిన తండ్రిపై కర్రతో విచక్షణారహితంగా దాడిచేశాడు. ఈ విషాద సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్లాబాద్ మండలం గోవిందాపూర్‌లో చోటుచేసుకుంది. గోవిందాపూర్‌కి చెందిన మైసయ్య(65), పోశవ్వ(60) దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు.
గతంలోనే చిన్న కుమా రుడు ఓ ప్రమాదంలో చనిపోయాడు. వీరందరికీ వివాహాలయ్యాయి. పెద్దకొడుకు బాలమల్లు తల్లిదండ్రులతో కాకుండా విడిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో మైసయ్య తనకున్న 3 గుంటల భూమిని అమ్మగా, రెండు లక్షల రూపాయలు వచ్చాయి. ఈ డబ్బులో బాలమల్లుకు రూ.లక్ష ఇచ్చి తన వద్ద రూ.లక్ష ఉంచుకున్నాడు. ఆ డబ్బు కూడా ఇవ్వాలంటూ బాలమల్లు తల్లిదండ్రులతో శనివారం గొడవపడ్డాడు.
ఆరోగ్యం బాగాలేదని, ఆస్పత్రి ఖర్చులకు డబ్బు అవసరముందని మైసయ్య ఎంత చెప్పినా కొడుకు వినిపించుకోలేదు. ఆదివారం ఉదయం ఇంటికి వచ్చి తల్లిని తీవ్రంగా చితకబాది ఆమె దగ్గర ఉన్న డబ్బుల సంచిని లాక్కున్నాడు. అనంతరం బైక్‌లోంచి పెట్రోల్ తీసి తల్లిపై చల్లి నిప్పంటించాడు. తీవ్ర గాయాలకు గురైన పోశవ్వ కేకలు వేయడంతో మైసయ్య ఇంట్లో నుంచి పరుగున వచ్చి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించాడు.
బాలమల్లు కర్రతో తండ్రిపై కూడా దాడిచేసి గాయపరిచాడు. గ్రామస్తులు 108లో వారిని గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోశవ్వ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మైసయ్య ఫిర్యాదుతో పోలీసులు బాలమల్లుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment