సాక్షి, హైదరాబాద్: లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ బాషాకు కోర్టు 14రోజులు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో జానీ బాషాను చంచల్‌గూడా జైలుకు తరలించారు పోలీసులు. ఇక, జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. కేసులో జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
జానీ బాషా లైంగిక వేధింపులకు పాల్పడిన విషయంలో తన నేరాన్ని ఒప్పుకున్నట్టు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. అలాగే, దురుద్దేశంతోనే ఆమెను తన అసిస్టెంట్‌గా చేర్చుకున్నాడు. 2019 నుంచే జానీతో బాధితురాలికి పరిచయం ఉన్నట్లు రిపోర్ట్‌లో తెలిపారు. 2020లో ముంబైలోని ఒక హోటల్‌లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. లైంగిక దాడి జరిగిన సమయానికి ఆమె వయసు 16 ఏళ్లు మాత్రమే. వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి సుమారు నాలుగేళ్లు దాటుతుంది.
షూటింగ్ సమయంలో కూడా వ్యాన్‌లోనే ఆమెను లైంగిక వేధింపులకు గురిచేశాడు. అందుకు ఆమె నిరాకరిస్తే జుట్టు పట్టుకుని బాధితురాలి తలను అద్దానికేసి కొట్టాడు. మత మార్పిడి సైతం చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి చేశాడు. ఈ విషయాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని బెదిరింపులకు దిగాడు. తనకున్న పలుకుబడి ఉపయోగించి ఆ యువతికి అవకాశాలు కూడా రాకుండా చేశాడు. జానీ మాస్టర్ భార్య కూడా ఆ యువతిని బెదిరించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలంటూ..
మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలంటూ జానీ మాస్టర్ బాధితురాలిని బలవంతం పెట్టాడు. ఒక రోజు జానీ మాస్టర్ బాధితురాలికి ఫోన్ చేసి షూటింగ్‌కు రావాలని సూచించాడు. దీంతో తన తల్లి ఇంట్లో లేదని, ఆరోగ్యం బాలేక ఇంట్లో ఉన్నానని తెలిపింది. దీన్ని ఆసరా చేసుకున్న నిందితుడు బాధితురాలి ఇంటికి వెళ్లి బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. జానీ తన భార్య సుమలత అలియాస్ ఆయేషాతో కలిసి బాధితురాలికి ఇంటికి వెళ్లి ఆమెను భయభ్రాంతులకు గురి చేశాడు. చిత్ర పరిశ్రమలో జానీకి ఉన్న పరిచయాల కారణంగా బాధితురాలికి ఎక్కడా పని దొరకుండా ఇబ్బందులకు గురి చేశాడు.
ఈ క్రమంలో బాధితురాలు ఇంట్లో లేని సమయం చూసి ఓ రోజు ఆమె ఇంటికి వెళ్లి బాధితురాలితో ఉన్న శారీరక సంబంధం గురించి ఆమె తల్లికి వెల్లడించాడు. ఇక, చిట్టచివరికి బాధితురాలు జానీ అసిస్టెంట్ మోయిన్‌కు ఈ విషయాలు తెలిపింది. అతని సూచన మేరకు బాధితురాలు తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ (టీఎఫ్‌టీడీడీఏ) సంఘం అధ్యక్షుడికి ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న జానీ వెంటనే సంఘం డ్రైవర్ రాజేశ్వర్ రెడ్డిని తీసుకొని గోవాకు పరారయ్యాడు. కాగా, కోర్టు వద్ద జానీ మాస్టర్ భార్యను ఈ విషయమై ప్రశ్నించగా అంతా కోర్టులో తేలుతుందని సమాధానం ఇచ్చారు.
ఇదిలా ఉండగా.. జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. జానీ మాస్టర్ భార్య సుమలత(అలియాస్ ఆయేషా)పై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమైనట్టు సమాచారం. బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించారన్న కారణంగా సుమలతపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: అభయ్ నోటిదురుసు వల్ల అందరికీ నష్టం.. అర్ధరాత్రి బిగ్‌బాస్ వార్నింగ్
Comments
Please login to add a commentAdd a comment