సాక్షి, హైదరాబాద్: జన్వాడలోని ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ వ్యవహారం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. రేవ్ పార్టీ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు రాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దీంతో, స్పందించిన రాజ్ పాకాల.. విచారణకు హాజరయ్యేందుకు రెండు రోజులు సమయం కావాలని కోరారు.
జన్వాడ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి రాజ్ పాకాలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. బీఎన్‌ఎస్‌ఎస్ 35(3) సెక్షన్ ప్రకారం మోకిల పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేవ్ పార్టీ కేసుకు సంబంధించి విచారించాల్సి ఉందని.. నేడు విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. విచారణకు రాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రాజ్ పాకాల..అడ్రస్ ఫ్రూఫ్, కేసుకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని సూచించారు. అయితే, రాజ్ పాకాల.. పోలీసులకు అందుబాటులోకి రాకపోవడంతో మోకిల ఇన్‌స్పెక్టర్ పేరుతో ఉన్న నోటీసులను రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్‌లో ఆయన నివాసానికి అతికించారు. ఇక, పోలీసుల నోటీసుల నేపథ్యంలో హైకోర్టును రాజ్ పాకాల ఆశ్రయించారు. అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు అక్రమంగా ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో ఆయన కోరారు. మరోవైపు.. పోలీస్ విచారణకు హాజరు అవ్వడానికి రెండు రోజులు గడువు కావాలని న్యాయవాది ద్వారా మోకిల పోలీసులకు ఆయన లేఖ పంపారు.
Comments
Please login to add a commentAdd a comment