తెలంగాణలో నాణ్యమైన బియ్యానికి.. చెల్లిన 'నూకలు' | Telangana: Poor Quality Rice Given To Ration Card Holders | Sakshi
Sakshi News home page

తెలంగాణలో నాణ్యమైన బియ్యానికి.. చెల్లిన 'నూకలు'

Published Mon, Mar 22 2021 4:15 AM | Last Updated on Mon, Mar 22 2021 9:25 AM

Telangana: Poor Quality Rice Given To Ration Card Holders - Sakshi

మెదక్‌ జిల్లా : బియ్యంలో నూకలు ఏరుకుంటున్న యాదమ్మ

►కింద ఫొటోలో బియ్యం చెరుగుతున్న మహిళ పేరు కవిత. మెదక్‌ జిల్లా రేగోడ్‌ మండలం సంగమేశ్వర తండాకు చెందిన ఆమె కుటుంబానికి నెలకు 12 కిలోల రేషన్‌ బియ్యం వస్తాయి. ఈసారి కూడా ఎప్పట్లాగే డీలర్‌ వద్దకు వెళ్లి బియ్యం తెచ్చుకుంది. కానీ సంచి విప్పితే సగం దాకా నూకలే. జల్లెడ పట్టి చూస్తే.. 12 కిలోల బియ్యంలో నాలుగున్నర కిలోల నూకలు వచ్చాయి. 


►ఇదే జిల్లా చిన్నశంకరం పేట మండలం రుద్రారానికి చెందిన శివలింగం లింగయ్య కుటుంబానికి ప్రతి నెలా 30 కిలోల రేషన్‌ వస్తుంది. ఈ నెల వచ్చిన బియ్యాన్ని జల్లెడ పడితే పది కిలోల దాకా నూకలు వచ్చాయి. 

రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి. బియ్యంలో గరిష్టంగా 20–25 శాతం వరకు నూకలు ఉండొచ్చు. కానీ పేదలకు అందుతున్న రేషన్‌ బియ్యంలో ఏకంగా 40–45 శాతం వరకు నూకలు ఉంటున్నాయి. 

సాక్షి, మెదక్‌(ఆదిలాబాద్‌/మహబూబ్‌నగర్‌) : రూపాయికే కిలో బియ్యం.. నాణ్యమైన బియ్యం.. రాష్ట్రంలో నిరుపేదల కడుపు నింపేందుకు అమలవుతున్న ప్రతిష్టాత్మక పథకం. లక్ష్యం అదుర్స్‌! కానీ పథకం అమల్లోనే పందికొక్కులు చొరబడ్డాయి. ప్రజలకు చేరాల్సిన మేలు రకం (ఫైన్‌ వెరైటీ) బియ్యం దారితప్పి విదేశాలు, పక్క రాష్ట్రాలకు తరలుతుండగా.. నిరుపేదలకేమో 40–45 శాతం వరకు నూకలే ఉన్న బియ్యం సరఫరా అవుతున్నాయి. కొన్ని నెలలుగా ఇలా నూకల బియ్యం నిరుపేదలకు సరఫరా అవుతున్న వైనంపై ‘సాక్షి’పరిశోధన చేపట్టింది. మార్చి నెలలో రేషన్‌ షాపుల ద్వారా మెదక్, ఆదిలాబాద్, జోగులాంబ, నారాయణపేట జిల్లాల్లో సరఫరా చేసిన బియ్యాన్ని పరిశీలించింది. ఇటీవల పలువురు లబ్ధిదారులు రేషన్‌ షాపుల నుంచి తెచ్చుకున్న బియ్యాన్ని కొలత వేయించి, జల్లెడ పట్టించి.. నూకలను వేరుచేసి చూసింది. దాదాపు అన్నిచోట్ల కూడా ప్రభుత్వం గరిష్టంగా నిర్దేశించిన 25శాతం (కిలోకు పావు కిలో) కంటే మించి.. ఏకంగా నలభై, నలభై ఐదు శాతం వరకు నూకలు ఉన్నట్టు గుర్తించింది. 

దీనికి కారణమెవరు? 
కొందరు మిల్లర్లు, అధికారులు కుమ్మక్కై నిరుపేదలకు నాణ్యతలేని, నూకల బియ్యం అంటగడుతున్నట్టు ‘సాక్షి’పరిశీలనలో వెల్లడైంది. వాస్తవానికి మిల్లర్లు ఎఫ్‌సీఐ/పౌర సరఫరాల శాఖ పంపిన ధాన్యాన్నే మిల్లింగ్‌ చేసి అలా వచ్చిన బియ్యాన్ని తిరిగి ఇవ్వాలి. కానీ కొందరు మిల్లర్లు మంచి ధాన్యాన్ని తాము వాడేసుకుంటున్నారు. తాము బయట నేరుగా తక్కువ ధరకు కొన్న తడిసిన, నాణ్యతలేని ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి పౌరసరఫరాల శాఖకు పంపుతున్నారు. అందుకే బియ్యంలో నాణ్యత తక్కువగా, నూకలు ఎక్కువగా ఉంటున్నట్టు వెల్లడైంది. 

అక్రమాలకు తోడ్పడుతున్నదెవరు? 
మిల్లర్లకు ధాన్యాన్ని పంపి.. తిరిగి బియ్యాన్ని తీసుకోవడాన్ని ‘కస్టమ్‌ మిల్లింగ్‌’అంటారు. ఇందుకు ప్రభుత్వం మిల్లర్లకు చార్జీలు చెల్లిస్తుంది. ఇలా ధాన్యాన్ని పంపి, మిల్లింగ్‌ అయ్యాక బియ్యాన్ని తిరిగి తీసుకునే క్రమంలో.. అధికారులు నాలుగు స్టేజీల్లో నాణ్యతను పరిశీలించాలి. కానీ కొందరు ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల అధికారులు డబ్బులకు కక్కుర్తిపడి మిల్లర్లకు సహకరిస్తున్నారు. ప్రతి స్టేజీలో ఓ రేటు మాట్లాడుకుని వదిలేస్తున్నారు. దీంతో నాణ్యత లేని బియ్యం గోదాములకు, అక్కడి నుంచి రేష¯Œ షాపులకు చేరుతున్నాయి. 

మంచి బియ్యం ఎక్కడికి పోతున్నాయి? 
నాణ్యతలేని, నూకల బియ్యాన్ని ప్రభుత్వానికి అంటగడుతున్న మిల్లర్లు.. ఎఫ్‌సీఐ నుంచి వచ్చిన మంచి ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి నాణ్యమైన బియ్యాన్ని ఇతర రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఫైన్‌  క్వాలిటీ బియ్యాన్ని క్వింటాల్‌ రూ.2,500 నుంచి రూ.2,600 రేటుతో.. ఏపీలోని పెద్దాపురం, కాకినాడ కేంద్రంగా చైనా, వియత్నాం, దుబాయ్, థాయ్‌లాండ్, పలు ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తున్నట్టు తెలిసింది. ఈ సీజన్‌లో ఇప్పటికే పది లక్షల టన్నుల బియ్యం ఇతర రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి అయినట్టు అంచనా. ఇందులో చాలావరకు కస్టమ్‌ మిల్లింగ్‌ కోసం ఎఫ్‌సీఐ పంపిన ధాన్యం నుంచి వచ్చిన బియ్యమే ఉండటం గమనార్హం. 


కాకినాడ పోర్టులో షిప్పులోకి బియ్యం లోడింగ్‌ (ఫైల్‌)

కస్టమ్‌ మిల్లింగ్‌ ధాన్యం మాయం..  బియ్యం ఇవ్వలేదు.. 

శనివారం పెద్దపల్లి జిల్లాలోని ఒక రైస్‌మిల్లులో బియ్యం మిల్లింగ్‌ 

రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఖరీఫ్, యాసంగి సీజన్లలో ఐకేపీ, పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైతుల నుంచి ధాన్యం కొంటుంది. ఆ ధాన్యాన్ని సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) కింద మిల్లర్లకు ఇస్తుంది. మిల్లర్లు ధాన్యాన్ని మర ఆడించి.. ముడి బియ్యం అయితే 67 కిలోలు, బాయిల్డ్‌ రైస్‌ అయితే 68 కిలోల చొప్పున తిరిగి అందజేయాలి. ఇందుకు ప్రభుత్వం మిల్లర్లకు క్వింటాల్‌ బాయిల్డ్‌ రైస్‌కు రూ.50 చొప్పున, ముడి బియ్యానికి రూ.30 చొప్పున చార్జీలు చెల్లిస్తుంది. పారాబాయిల్డ్‌ బియ్యమైతే గరిష్టంగా నూకలు 16 శాతం, డిస్‌కలర్‌ (రంగుమారిన) 5 శాతం, డ్యామేజ్‌ 4 శాతంలోపు ఉండాలి. ముడి బియ్యమైతే గరిష్టంగా నూకలు 25 శాతం, డిస్‌కలర్‌ 5, డ్యామేజ్‌ 5 శాతంలోపు ఉండాలి. వానాకాలం ధాన్యాన్ని ఏటా మార్చి 31 లోపు.. యాసంగి ధాన్యాన్ని సెప్టెంబర్‌ 31లోపు మర ఆడించి బియ్యం తిరిగివ్వాలి.

కానీ మిల్లర్లు ఓ సీజన్‌కు సంబంధించిన బియ్యాన్ని మరో సీజన్‌లో ఇస్తున్నారు. ఈ గ్యాప్‌లోనే అక్రమాలకు పాల్పడుతున్నారు. వరంగల్, పెద్దపల్లి, కరీంనగర్, మిర్యాలగూడ, నిజామాబాద్‌ జిల్లాల్లో ఈ దందా భారీ స్థాయిలోనే నడుస్తోంది. ఇప్పుడు కూడా ఈ వ్యవహారం కొనసాగుతూనే ఉంది. పలు జిల్లాల్లో మిల్లర్లు గత వేసవిలో తీసుకున్న ధాన్యానికి సంబంధించిన సీఎంఆర్‌ బియ్యాన్ని ఇంకా సర్కారుకు ఇవ్వలేదు. అంటే ముడి ధాన్యంగానీ, బియ్యంగానీ రైస్‌ మిల్లులు, గోదాముల్లోనే ఉండాలి. కానీ ఆయా ప్రాంతాల్లోని రైస్‌ మిల్లులు, గోదాములను ‘సాక్షి’పరిశీలించగా.. ఎక్కడా సీఎంఆర్‌ ధాన్యంగానీ, బియ్యం నిల్వలు గానీ లేవు. అంటే మిల్లర్లు ఇప్పటికే అమ్ముకుని సొమ్ము చేసుకున్నట్టు అర్థమవుతోంది.

చాలా చోట్ల ఇదే తీరు.. 
►జోగులాంబ గద్వాల జిల్లా రాజోలికి చెందిన రాములమ్మ కుటుంబానికి నెలకు 24 కిలోల రేషన్‌ బియ్యం వస్తుంది. ఇటీవల వచ్చిన బియ్యాన్ని జల్లెడ పడితే ఆరు కిలోలపైన నూకలు వచ్చాయి. 
►ఆదిలాబాద్‌ జిల్లా తాంసి మండల కేంద్రంలో నివసించే శాతల నాగమ్మ కుటుంబానికి ప్రతినెలా 35 కిలోల రేషన్‌ బియ్యం అందుతుంది. ఈ నెల తీసుకున్న బియ్యం చెరిగితే ఎనిమిది కిలోల దాకా నూకలు వచ్చాయి. 
►మెదక్‌ జిల్లా తూప్రాన్‌ పట్టణానికి చెందిన సర్గం మల్లమ్మ తనకు వచ్చిన 12 కిలోల బియ్యాన్ని చెరిగితే నాలుగు కిలోలకుపైగా నూకలు వచ్చాయి. ఇలాగైతే ఎలా అని ఆమె వాపోయింది. 
►మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలం గూడూరుకు చెందిన పాలకుల లక్ష్మి రేషన్‌ బియ్యం తీరుపై మండిపడింది. ‘గత నెలలో వచ్చిన బియ్యం ముక్కవాసన వచ్చాయి. ఈసారి వచ్చిన బియ్యంలో నూకలే ఎక్కువగా ఉన్నాయి’అని వాపోయింది. 

సగం నూకలే.. అన్నం ముద్ద అవుతోంది 
రేషన్‌ షాపులో మంచి బియ్యం ఇస్తున్నారని సంతోషించినం. బియ్యం జల్లెడ పట్టి చూశాక ఉన్న సంతోషం పోయింది. సగం నూకలే ఉన్నాయి. వండిన అన్నం మెత్తగా ముద్దగా అవుతోంది. దొడ్డు బియ్యమే నయం అనిపిస్తున్నది. డీలర్‌ను అడిగితే గోదాం నుంచే బియ్యం అట్లా వస్తున్నయని చెప్తున్నడు. – స్వరూప, రేషన్‌ లబ్ధిదారు, చిలప్‌చెడ్, మెదక్‌ 

ఒక్కోసారి సగానికి సగం నూకలే.. 
3 నెలల నుంచి బియ్యం ఒక్కో సంచిలో ఒక్కో రకం వస్తున్నాయి. ఒక్కోసారి సగానికి సగం నూకలు వస్తున్నాయి. ఈ మధ్య వస్తున్న బియ్యంలో మరీ ఎక్కువగా ఉంటున్నాయి. లబ్ధిదారులు గొడవ పడుతున్నారు. సముదాయించలేక తలపట్టుకోవాల్సి వస్తోంది.     
– నర్సింహులు, డీలర్, రుద్రారం, చిన్నశంకరంపేట, మెదక్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement