సాక్షి, వరంగల్: తెలంగాణలో కురుస్తున్న కుండపోత వర్షాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి సైతం వరదనీరు పోటెత్తడంతో నదులు, వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లు, కాలనీలు, ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరిపోవడంతో ప్రజలు దిక్కుతోచని అయోమయ పరిస్థితులలో జీవిస్తున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరదల ప్రభావం మరీ దారుణంగా ఉంది. వర్షం, వరదలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరుగురు మృతి చెందగా.. 12 మంది గల్లంతయ్యారు. భూపాలపల్లి జిల్లాలో మోరంచ వాగులో సంజీవ్ అనే వ్యక్తి వరదలో కొట్టుకుపోయి మృతి చెందగా.. మరో నలుగురు గల్లంతయ్యారు. ములుగు జిల్లా మారేడుగొండ చెరువు కట్ట తెగి ఇల్లు కొట్టుకుపోయింది. ఈ క్రమంలో ఇంట్లో నివాసముండే సారయ్యతో పాటు ముగ్గురు గల్లంతయ్యారు. సారయ్య మృతదేహం లభ్యం. సారమ్మ, రాజమ్మ కోసం గాలిస్తున్నారు.
చదవండి: Telangana Rains: మరో 24 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఏటూరు నాగారం మండలం కొండాయి వద్ద జంపన్న వాగులో ఆరుగురు గల్లంతయ్యారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోచంపల్లి వద్ద అన్నదమ్ములు శ్రీనివాస్, యాకయ్య కొట్టుకుపోయి మృతిచెందారు. హనుమకొండలో ప్రేమ్ సాగర్ అనే వ్యక్తి కరెంట్ షాక్‌తో మృతిచెందారు. వేలేరు మండలం కన్నారం వద్ద వరద దాటుతూ బైకిస్టు మహేందర్ బైక్‌తో సహా కొట్టుకుపోయి మృతి చెందారు.
కాగా చిట్యాల మండలం నైన్ పాక వద్ద వరదల్లో చిక్కుకున్న కాంట్రాక్టు వర్క్ చేసే ఆరుగురిని ఆర్మీ హెలికాప్టర్ కాపాడింది. కాటారం మండలం గంగారం వద్ద మానేరు వాగులో చిక్కుకున్న 4 గురు రైతులను డ్రోన్ కెమెరాతో సెర్చ్ చేసి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడింది.
చదవండి: తెలంగాణ చరిత్రలోనే రికార్డు వర్షపాతం.. నీట మునిగిన మేడారం
Comments
Please login to add a commentAdd a comment