అడెల్లు, మంగులు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపల్లి జిల్లా పర్యటన రూట్‌మ్యాప్ ఆకస్మికంగా మారడానికి మావోయిస్టుల కదలికల సమాచారమే కారణమని తెలుస్తోంది. రాష్ట్రంలోకి మావోయిస్టులు ప్రవేశించారన్న సమాచారంతో ముందుజాగ్రత్త చర్యగా సీఎంను రోడ్డుమార్గాన వద్దని.. హెలికాప్టర్‌లో రావాలని పోలీసులు సూచించి నట్లు తెలిసింది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం వారం రోజులుగా రాష్ట్రంలో మావోలు సంచరిస్తున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మంథని, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం తదితర గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వారు సంచరించినట్లు పోలీసుల వద్ద పక్కా సమాచారం ఉంది. తెలంగాణలో కార్యకలాపాలు ముమ్మరం చేయాలన్న మావోయిస్టు సారథి, కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఆదేశాల మేరకు మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్, పాండు అలియాస్ మంగులు తదితరుల దళాలు మహా రాష్ట్ర, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ల మీదుగా తెలంగాణలోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.
పర్యటనలో ఆకస్మిక మార్పులు..
వాస్తవానికి సీఎం కేసీఆర్ పెద్దపల్లి కలెక్టరేట్ భవ నాన్ని ప్రారంభించేందుకు రెండు రోజుల ముందే కరీంనగర్‌కు చేరుకుంటారని పోలీసులకు సమాచా రం ఉంది. దాని ప్రకారం ఆయన కరీంనగర్ తీగలగుట్టపల్లిలోని తన నివాసం నుంచి పెద్దపల్లి సభకు బయల్దేరాలి. కానీ ఆదివారం రాత్రి వరకూ ఎలాంటి సమాచారం రాలేదు. సోమవారం మధ్యాహ్నం వరకు ఈ ఉత్కంఠ కొనసాగింది.
పెద్దపల్లి జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాలకు మావోయిస్టులు వచ్చి ఉంటారన్న నిఘా వర్గాల హెచ్చరికలతో సీఎం ఆదివారం కరీంనగర్‌కు చేరుకోలేదని సమాచారం.ఉమ్మడి కరీంనగర్‌కు చెందిన పలువురు టీఆర్‌ఎస్, బీజేపీ నేతలను మావోయిస్టులు లక్ష్యంగా చేసుకున్నా రన్న విషయాన్ని నిఘా వర్గాలు ముందే పసిగట్టి వారిని అప్రమత్తం చేశాయి.
ఈ నేపథ్యంలో సీఎం భద్రతకు మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేశా యి. ఒకప్పుడు పెద్దపల్లి జిల్లాలో కొత్త వారు, అను మానాస్పద వ్యక్తులను గుర్తించడం సులువుగా ఉండేది. కానీ జిల్లాలోని ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్, సింగరేణి, గ్రానైట్, క్రషర్, ఇటుక బట్టీల్లో పనిచేసేందుకు ఉత్తరాది రాష్ట్రాల నుంచి వేలాది మంది వలస వచ్చి జీవనం సాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సభకు వచ్చే వారిలో ఎవరు కార్మికులో, ఎవరు మావోయిస్టు సానుభూతిపరులో గుర్తించడం కష్టం అవుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం భద్రత విషయంలో రాజీపడరాదని డీజీపీ మహేందర్‌రెడ్డి నిర్ణయించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే రోడ్డుమార్గం వద్దని పోలీసు ఉన్నతాధికారులు సీఎంకు సూచించినట్లు సమాచారం.
భారీ వర్షంలోనూ టేకాఫ్..!
సాధారణంగా వాతావరణ మార్పులు, భారీ వర్షాల నేపథ్యంలో వీఐపీ నాయకులు హెలికాప్టర్ వద్దని.. రోడ్డు మార్గాన్నే ఎంచుకుంటారు. సోమ వారం పెద్దపల్లి జిల్లాలో ఉదయం నుంచి వర్షం కురుస్తుండటంతో అంతా సీఎం రోడ్డు మార్గానే వస్తారనుకున్నారు. మధ్యాహ్నం తరువాత పరిణా మాలు చకచకా మారిపోయాయి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పలువురు ఐపీఎస్‌ల నేతృత్వంలో భారీగా పోలీసులు మోహరించారు. అక్క డికే సీఎం హెలికాప్టర్ చేరుకుంది. ఆ తరువాత వేదికపై ప్రసంగిస్తుండగానే భారీ వర్షం కురిసింది. అంతటి వర్షంలోనూ సీఎంను పోలీసులు హెలికాప్టర్‌లోనే పంపి ఊపిరి పీల్చుకున్నారు.
రెండేళ్ల తరువాత రాష్ట్రానికి అడెల్లు..!
2020 జూలైలో లాక్‌డౌన్ ఎత్తివేత తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో మైలారపు అడెల్లు అలి యాస్ భాస్కర్ గిరిజన తండాల్లో రిక్రూట్ మెంట్ కోసం ప్రయత్నించారు. కానీ కదంబా ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందడం, మరోసారి జరిగిన ఎదురుకాల్పుల్లో అడెల్లు దళం తృటిలో తప్పించుకోవడంతో అతను తిరిగి మహారాష్ట్ర మీదుగా ఛత్తీస్‌గఢ్ వెళ్లి పోయాడు.
రెండేళ్ల తరువాత తిరిగి అడెల్లు రాష్ట్రంలో ప్రవేశించడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది. కొంతకాలంగా ఉమ్మడి జిల్లాలోని గ్రానైట్ పరిశ్రమలో పనిచేసే కొందరికి మావోలు ఆర్థికంగా, పేలుడు పదార్థాల విషయంలో సహకరించారు. అయితే మావో లతో లింకులున్న వారిని గుర్తించిన పోలీసులు వరుసగా అరెస్టులు చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయ నేతలను హతమార్చి నిధులు, ఉనికిని సాధించే ప్రణాళికను అమలు చేసేందుకే అడెల్లు, ఇతర దళాలు తెలంగాణలోకి వచ్చాయని అధికారులు భావిస్తున్నారు. కాగా,పాండు అలి యాస్ మంగులుపై రూ.5 లక్షలు, భాస్కర్‌పై 20 లక్షల రివార్డును పోలీసులు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment