సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు ఫిబ్రవరి రెండోవారం గడుస్తున్నా ఇంకా జీతాలు అందలేదు. గత నెల 12న వేతనం చేతికి అందింది. ఈ నెల మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సి వస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీ వద్ద జీతాల కోసం రూ.20 కోట్లు మాత్రమే ఉన్నట్లు సమాచారం. కావాల్సిన మిగతా రూ.100 కోట్లు ఆర్థిక శాఖ నుంచి రావాల్సి ఉంది. బడ్జెట్‌లో ప్రభుత్వం ఆర్టీసీకి కేటాయించిన మొత్తంలోంచి జీతాలకు నిధులు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈసారి ఆ నిధులు ఆర్థిక శాఖ నుంచి ఇంకా అందలేదని తెలుస్తోంది. ఇప్పటికే వాటిని విడుదల చేయాల్సిందిగా అధికారులు ఆర్థిక శాఖను కోరారు. గతంతో పోలిస్తే ఇటీవల ఆర్టీసీలో ఆక్యుపెన్సీ రేషియో కొంత మెరుగుపడింది. రోజు వారీ ఆదాయం రూ.12 కోట్లను దాటింది.
రోజువారీ టికెట్ ఆదాయం పెరిగినందున ఖర్చులు పోను రూ.20 కోట్లను ఆర్టీసీ జీతాల పద్దుకు సిద్ధం చేసుకుంది. గత నెల ఇలాగే కొంతే డబ్బు ఉండటంతో.. ఉన్నంత మేర కొంతమందికి జీతాలు చెల్లించి, మిగతావారికి ప్రభుత్వం నుంచి డబ్బు వచ్చాక చెల్లించారు. దీంతో కొంత గందరగోళం నెలకొంది. ఈసారి అలా కాకుండా అందరికీ ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించారు. కావాల్సినన్ని డబ్బులు లేక రెండోవారంలో కూడా చెల్లించలేదు. సోమవారం నాటికి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసేందుకు యత్నిస్తున్నారు. గత 11 రోజుల్లో ఆర్టీసీకి రూ.118 కోట్ల ఆదాయం సమకూరినా.. ఉద్యోగులకు రెండోవారం నాటికి జీతాలు చెల్లించకపోవటం దారుణమని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు విమర్శించారు.
వేతన సవరణ చేయాలి..
మరోవైపు ఆర్టీసీలో కార్మిక సంఘాల ఆందోళనలు క్రమంగా పెరుగుతున్నాయి. వేతన సవరణ విషయంలో అనుమానాలు తలెత్తుతున్నాయని పేర్కొంటూ కొద్ది రోజులుగా సంఘాలు అధికారులపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఇటీవలే టీఎంయూ, ఈయూ సమావేశాలు పెట్టి విమర్శలు గుప్పించాయి. తాజాగా దీనిపై చర్చించేందుకు టీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఈనెల 20న రాష్ట్ర సదస్సు నిర్వహిస్తుందని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాంచందర్, వీఎస్‌రావు తెలిపారు. అలాగే ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో 22న కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షప్రధాన కార్యదర్శులు బాబు, రాజిరెడ్డి తెలిపారు. కార్మిక సంఘాలకు మళ్లీ ఆర్టీసీలో అవకాశం కల్పిస్తూ వెంటనే ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో 26న చలో బస్‌భవన్ చేపడుతున్నట్టు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి హనుమంతు తెలిపారు.
చదవండి:
మొదటి జీతం.. పేదలకు అంకితం
సింగరేణిలో భారీగా ఉద్యోగాలు!
Comments
Please login to add a commentAdd a comment