TSRTC officials
-
రెండోవారం గడుస్తున్నా ఇంకా అందని జీతాలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు ఫిబ్రవరి రెండోవారం గడుస్తున్నా ఇంకా జీతాలు అందలేదు. గత నెల 12న వేతనం చేతికి అందింది. ఈ నెల మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సి వస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీ వద్ద జీతాల కోసం రూ.20 కోట్లు మాత్రమే ఉన్నట్లు సమాచారం. కావాల్సిన మిగతా రూ.100 కోట్లు ఆర్థిక శాఖ నుంచి రావాల్సి ఉంది. బడ్జెట్లో ప్రభుత్వం ఆర్టీసీకి కేటాయించిన మొత్తంలోంచి జీతాలకు నిధులు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈసారి ఆ నిధులు ఆర్థిక శాఖ నుంచి ఇంకా అందలేదని తెలుస్తోంది. ఇప్పటికే వాటిని విడుదల చేయాల్సిందిగా అధికారులు ఆర్థిక శాఖను కోరారు. గతంతో పోలిస్తే ఇటీవల ఆర్టీసీలో ఆక్యుపెన్సీ రేషియో కొంత మెరుగుపడింది. రోజు వారీ ఆదాయం రూ.12 కోట్లను దాటింది. రోజువారీ టికెట్ ఆదాయం పెరిగినందున ఖర్చులు పోను రూ.20 కోట్లను ఆర్టీసీ జీతాల పద్దుకు సిద్ధం చేసుకుంది. గత నెల ఇలాగే కొంతే డబ్బు ఉండటంతో.. ఉన్నంత మేర కొంతమందికి జీతాలు చెల్లించి, మిగతావారికి ప్రభుత్వం నుంచి డబ్బు వచ్చాక చెల్లించారు. దీంతో కొంత గందరగోళం నెలకొంది. ఈసారి అలా కాకుండా అందరికీ ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించారు. కావాల్సినన్ని డబ్బులు లేక రెండోవారంలో కూడా చెల్లించలేదు. సోమవారం నాటికి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసేందుకు యత్నిస్తున్నారు. గత 11 రోజుల్లో ఆర్టీసీకి రూ.118 కోట్ల ఆదాయం సమకూరినా.. ఉద్యోగులకు రెండోవారం నాటికి జీతాలు చెల్లించకపోవటం దారుణమని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు విమర్శించారు. వేతన సవరణ చేయాలి.. మరోవైపు ఆర్టీసీలో కార్మిక సంఘాల ఆందోళనలు క్రమంగా పెరుగుతున్నాయి. వేతన సవరణ విషయంలో అనుమానాలు తలెత్తుతున్నాయని పేర్కొంటూ కొద్ది రోజులుగా సంఘాలు అధికారులపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఇటీవలే టీఎంయూ, ఈయూ సమావేశాలు పెట్టి విమర్శలు గుప్పించాయి. తాజాగా దీనిపై చర్చించేందుకు టీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఈనెల 20న రాష్ట్ర సదస్సు నిర్వహిస్తుందని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాంచందర్, వీఎస్‌రావు తెలిపారు. అలాగే ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో 22న కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షప్రధాన కార్యదర్శులు బాబు, రాజిరెడ్డి తెలిపారు. కార్మిక సంఘాలకు మళ్లీ ఆర్టీసీలో అవకాశం కల్పిస్తూ వెంటనే ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో 26న చలో బస్‌భవన్ చేపడుతున్నట్టు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి హనుమంతు తెలిపారు. చదవండి: మొదటి జీతం.. పేదలకు అంకితం సింగరేణిలో భారీగా ఉద్యోగాలు! -
చార్జీలు పెంచకుంటే బస్సు గట్టెక్కదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఆర్థిక సహాయం అందించడం, బస్సు చార్జీలు పెంచడం వంటి చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గట్టెక్కే పరిస్థి తి లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు అధికారులు నివేదించారు. సీఎం గురువారం ప్రగతిభవన్‌లో ఆర్టీసీపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ ఆర్థిక పరిస్థితిని వివరించడంతో పాటు ప్రభుత్వ సాయం, చార్జీల పెంపు సంబంధిత ప్రతిపాదనలను అధికారులు ముఖ్యమంత్రి ముందుంచారు. పెను భారం భరించే స్థితిలో ఆర్టీసీ లేదు ‘చివరిసారిగా ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచినప్పుడు లీటర్ డీజిల్ ధర రూ.67 ఉండేది. కానీ చాలా స్వల్ప వ్యవధిలోనే ధర లీటర్‌కు రూ.15 పెరిగింది. ఇది ఆర్టీసీపై తీవ్ర ఆర్థిక భారం మోపింది. మరోవైపు కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్‌తో సంస్థ అపార నష్టాలను చవిచూసింది. వీటితో పాటు ఇప్పటికే పేరుకుపోయిన రుణ బకాయిలతో సంస్థ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లోనే ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు పెంచా ల్సి ఉంది. ఒకవేళ జీతాలు పెంచితే సంస్థపై పెనుభారం తప్పదు. అది భరించే స్థితిలో ఆర్టీ సీ లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద ఎత్తున ఆర్టీసీకి సహాయం అందించాలి. అలాగే బస్సు చార్జీలు పెంచాలి. ఈ రెండు చర్యలు తీసుకుంటే తప్ప ఆర్టీసీ కోలుకునే పరిస్థితి ఉండదు..’అని అధికారులు వివరించారు. చదవండి: (ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ షాక్..!) గతంతో పోలిస్తే పరిస్థితి మెరుగే.. ‘వాస్తవానికి గతంతో పోలిస్తే ఆర్టీసీ పరిస్థితి ఎంతో మెరుగైంది. ప్రభుత్వం అందించిన ఇతోధిక సహాయం, ఆర్టీసీలో తీసుకున్న నిర్ణయాల ఫలితంగా పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు బస్సులు తిప్పడం మంచి ఫలితాన్నిచ్చింది. 58 శాతానికి చేరుకున్న ఆక్యుపెన్సీ క్రమంగా పెరుగుతోంది. రోజుకు రూ.9 కోట్ల ఆదాయం వస్తోంది. భవిష్యత్తులో మరింత పుంజుకునే అవకాశం ఉన్నా.. డీజిల్ రేట్లు పెరుగుతుండడం నష్టదాయకంగా మారుతోంది..’అని వివరించారు. ‘కార్గో’తో మంచి ఆదాయం: సీఎం ఆర్టీసీ కార్గో సర్వీసులు విజయవంతం అయ్యాయని, ప్రజలకు గొప్ప సేవలు అందిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా అధికారులను అభినందించారు. కార్గో సేవల ద్వారా ఇప్పటికి 17.72 లక్షల పార్సిళ్లను గమ్యానికి చేరవేశారని, దీనివల్ల ఆర్టీసీకి రూ.22.61 కోట్ల ఆదా యం వచ్చిందని చెప్పారు. ప్రజలు కూడా కార్గో సేవలపై సంతృప్తితో ఉన్నారంటూ.. ఆర్టీసీ కార్గో సేవల స్పెషల్ ఆఫీసర్ కృష్ణకాంత్‌ను సీఎం ప్రశంసించారు. ఆర్టీసీ కార్గో ద్వారా పంపిన పార్సిళ్లు సకాలంలో, సురక్షితంగా గమ్యం చేరుకుంటాయనే నమ్మకం ప్రజల్లో ఏర్పడిందన్నారు. అటు మారుమూల ప్రాంతాలకు, ఇటు నగరంలోని ఇంటింటికీ డోర్ డెలివరీ చేయడం అభినందనీయమన్నారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, సీఎస్ సోమేశ్ కుమార్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ తదితరులు పాల్గొన్నారు. -
ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ షాక్..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు చార్జీలు మరోసారి మోత మోగనున్నాయి. 2019 డిసెంబరులో కిలోమీటరుకు 20 పైసలు చొప్పున పెంచిన ఆర్టీసీ.. ఏడాది తర్వాత మళ్లీ పెంపునకు సిద్ధమైంది. ఈసారి కి.మీ.కు 10 పైసల వరకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ధరలపై ముఖ్యమంత్రికి నివేదించి చర్చించాకే అమలులోకి తేనున్నట్లు సమాచారం. ఈ మేరకు గురువారం రాత్రి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జరిగిన సమావేశంలో ఆర్టీసీ చార్జీల పెంపు అంశం చర్చకు వచ్చింది. డీజిల్ ధరలు విపరీతంగా పెరగడం, లాక్డౌన్ కారణంగా ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి దిగజారడంతో చార్జీల పెంపు తప్పదనే కోణంలో చర్చించారు. మరోవైపు ఆర్టీసీ సిబ్బందికీ జీతాలు పెంచనున్నట్లు ఇప్పటికే సీఎం ప్రకటించారు. ప్రస్తుతం ఆర్టీసీ వ్యయంలో 52 శాతం జీతభత్యాల పద్దే ఆక్రమించింది. జీతాల భారం 50 శాతం దాటితే ఏ సంస్థ మనుగడ అయినా కష్టమనేది ఆర్థిక నిపుణుల మాట. అలాంటిది ఇప్పటికే సగానికి మించడం, మళ్లీ పెరగనుండడంతో తదనుగుణంగా ఆర్టీసీ ఆదాయాన్నీ పెంచుకోక తప్పదు. ప్రత్యామ్నాయ ఆదాయం ఇప్పటికిప్పుడు అసాధ్యం. కాబట్టి చార్జీల పెంపు తప్ప మరో మార్గం కనిపించటం లేదని తేల్చారు. లేదంటే బడ్జెట్ రూపంలో ఆర్టీసీకి ప్రభుత్వం కనీసం మరో రూ.వెయ్యి కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ఆర్టీసీ సిబ్బంది జీతాలకు ప్రస్తుతం ప్రభుత్వమే నిధులు ఇస్తున్నందున, ఇంకా పెంపు కష్టమని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక మిగిలింది చార్జీల పెంపు మాత్రమే కావటంతో ఆ కోణంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రజల్లో వ్యతిరేకత? ఏడాది కింద చార్జీల పెంపుతో జనంపై రూ.750 కోట్ల వార్షిక భారంపడింది. ఆర్డినరీలో కనీస చార్జి రూ.10, ఎక్స్‌ప్రెస్‌లో రూ.15 చేయడంతో సామాన్యులకు బస్సు ప్రయాణం భారమైందనే అభిప్రాయం ఉంది. చార్జీలు పెంచాక కేవలం మూడు నెలలు మాత్రమే పూర్తిస్థాయిలో బస్సులు నడిచాయి. మార్చి నుంచి లాక్డౌన్ మొదలవడంతో డిపోలకే పరిమితమయ్యాయి. మళ్లీ మే నుంచి దశల వారీ ప్రారంభమైనా ఇప్పటికీ పూర్తిస్థాయిలో తిరగడం లేదు. మరో వైపు కోవిడ్ వల్ల ప్రజల ఆర్థిక పరి స్థితీ దిగజారింది. ఈ సమయంలో చార్జీలు పెంచితే జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశముందని ప్రభుత్వం భావిస్తోంది. సిటీ సర్వీసులు 75 శాతానికి.. కోవిడ్ నేపథ్యంలో ఇప్పటికీ హైదరాబాద్‌లో సిటీ బస్సులు పూర్తిస్థాయిలో తిరగటం లేదు. తొలుత 25 శాతం, అనంతరం 50 శాతానికి అనుమతించారు. ఫిబ్రవరి 1నుంచి జిల్లా సర్వీసులు పూర్తిస్థాయిలో తిరగనున్నాయి. ఈ నేపథ్యంలో సిటీలో సర్వీసులను 75 శాతానికి పెంచుకునేందుకు గురువారం సమావేశంలో సీఎం అనుమతించారు. -
ఆర్టీసీ అధికారుల ‘ప్రివిలేజి’ దోపిడీ
సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రతీ విషయంలో ప్రభుత్వమే ఆదుకోవాలంటే ఎట్లా. సంస్థ అంతర్గత సామర్థ్యం పెంచి ఆదాయాన్ని పెంచుకోండి. ఈరోజు నుంచే కార్యోన్ముఖులు కండి’’ టీఎస్ఆర్టీసీ సిబ్బందికి 44 శాతం ఫిట్మెంట్ ప్రకకటన వేళ సీఎం చంద్రశేఖరరావు ఆర్టీసీ అధికారులకు సూచించిన మాట. అంతర్గత సామర్థ్యం పెంపునకు కార్యోన్ముఖులయ్యే మాట అటుంచితే ఆర్టీసీ ఖజానాకే వారు కన్నం పెట్టేస్తున్నారు. రాయితీ ప్రయాణాల(బస్‌పాస్)ల వల్ల సంస్థ తీవ్రంగా నష్టపోతోందని, ఆ మొత్తాన్ని రీయింబర్స్ చేయాల్సిన ప్రభుత్వం సరిగా స్పందించటం లేదని ఆరోపించే అధికారులు... అదే ‘రాయితీ’ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇదీ సంగతి... ఆర్టీసీలో పనిచేసే ఉన్నతాధికారుల మొదలు సాధారణ సిబ్బంది వరకు ‘ప్రివిలేజ్ పాస్’ వెసులుబాటు ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేసినప్పుడు దీన్ని వినియోగించుకోవాలి. ఏడాదిలో మూడు పర్యాయాలు వాడుకోవచ్చు. సాధారణ సిబ్బందికి ఆ మూడు పర్యాయాలు ఆర్టీసీ బస్సుల్లో కుటుంబీకులతో కలిసి ఉచితంగా ప్రయాణించొచ్చు. అధికారులకు మాత్రం ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలనే నిబంధన నుంచి సడలింపు ఉంది. ప్రైవేటు వాహనాలు, రైలు, విమానంలో ప్రయాణించినప్పటికీ దీన్ని వినియోగించుకోవచ్చు. ఒక్కో పర్యాయానికి రూ.12 వేల వరకు గరిష్టంగా ప్రయాణ ఖర్చును రీయింబర్స్ చేసుకోవచ్చు. ఏటా మూడు పర్యాయాలు కలిపి రూ.36 వేలు పొందొచ్చు. అయితే ఉద్యోగి భార్య/భర్త ప్రభుత్వ ఉద్యోగి అయితే వారికి ఇది వర్తించదు. వారు పనిచేస్తున్న ప్రభుత్వ విభాగం నుంచి ఈ తరహా వెసులుబాటు పొందడం లేదని డిక్లరేషన్ సమర్పిస్తే ప్రివిలేజ్ పాస్ పొందొచ్చు. అధికులు అధికారుల భార్య/భర్తలు ప్రభుత్వ ఉద్యోగులైనప్పటికీ డిక్లరేషన్లు సమర్పించడం లేదు. వీరు అటు తాము పనిచేస్తున్న ప్రభుత్వ విభాగాలు, ఇటు ఆర్టీసీ... రెండు వైపుల నుంచి ప్రయాణ ఖర్చును రీయింబర్స్ చేసుకుంటున్నారు. ఇలా ఎంతమంది దుర్వినియోగం చేస్తున్నారో గుర్తించే వ్యవస్థ లేకపోవటంతో యథేచ్ఛగా ఈ వ్యవహారం సాగుతోంది. ఏ అధికారి భార్య/భర్త ప్రభుత్వ ఉద్యోగో కూడా తెలియని దాఖలాలున్నాయి. అధికారులు గోప్యంగా ఉంచినా... గుర్తించే విధానం లేదు. కొంతమంది నిజాయితీగా వివరాలు పొందుపరుస్తున్నప్పటికీ అధికులు సమర్పించకుండా ప్రివిలేజ్ పాస్ నిధులు కొల్లగొడుతున్నారు. అటు వారి భార్య/భర్త పనిచేసే ప్రభుత్వ కార్యాలయంలోనూ ఈ విషయాన్ని దాచి ఉంచి అక్కడి నుంచి అక్కడి వెసులుబాటును పొందుతున్నారు. ఇలా నిబంధనకు తూట్లు పొడుస్తూ ఇటు ఆర్టీసీ, అటు ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెడుతున్నారు. ఇలాంటివారు వందల్లో ఉన్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. అంతర్గత ఆడి ట్ జరుగుతున్నా... దీన్ని పట్టించుకోవటం లేదు. నాలుగేళ్లకోమారు కలిపి దీన్ని వినియోగించుకునే వెసులుబాటు ఉంది. ఏడాదికి రూ.36 వేలు చొప్పున నాలుగేళ్లమొత్తం కలిపి రూ.1.44 లక్షలు ఒకేసారి పొందుతున్నారు. దీంతో హాయిగా విదేశీ ప్రయాణాలు జరుపుతున్నారు.