ఆర్టీసీ అధికారుల ‘ప్రివిలేజి’ దోపిడీ | RTC officials 'privilege' robbery | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ అధికారుల ‘ప్రివిలేజి’ దోపిడీ

Published Thu, Jul 9 2015 1:52 AM | Last Updated on Sun, Sep 3 2017 5:08 AM

ఆర్టీసీ అధికారుల ‘ప్రివిలేజి’ దోపిడీ

ఆర్టీసీ అధికారుల ‘ప్రివిలేజి’ దోపిడీ

సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రతీ విషయంలో ప్రభుత్వమే ఆదుకోవాలంటే ఎట్లా. సంస్థ అంతర్గత సామర్థ్యం పెంచి ఆదాయాన్ని పెంచుకోండి. ఈరోజు నుంచే కార్యోన్ముఖులు కండి’’ టీఎస్‌ఆర్టీసీ సిబ్బందికి 44 శాతం ఫిట్‌మెంట్ ప్రకకటన వేళ సీఎం చంద్రశేఖరరావు ఆర్టీసీ అధికారులకు సూచించిన మాట. అంతర్గత సామర్థ్యం పెంపునకు కార్యోన్ముఖులయ్యే మాట అటుంచితే ఆర్టీసీ ఖజానాకే వారు కన్నం పెట్టేస్తున్నారు. రాయితీ ప్రయాణాల(బస్‌పాస్)ల వల్ల సంస్థ తీవ్రంగా నష్టపోతోందని, ఆ మొత్తాన్ని రీయింబర్స్ చేయాల్సిన ప్రభుత్వం సరిగా స్పందించటం లేదని ఆరోపించే అధికారులు... అదే ‘రాయితీ’ని దుర్వినియోగం చేస్తున్నారు.
 
ఇదీ సంగతి...
ఆర్టీసీలో పనిచేసే ఉన్నతాధికారుల మొదలు సాధారణ సిబ్బంది వరకు ‘ప్రివిలేజ్ పాస్’ వెసులుబాటు ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేసినప్పుడు దీన్ని వినియోగించుకోవాలి. ఏడాదిలో మూడు పర్యాయాలు వాడుకోవచ్చు. సాధారణ సిబ్బందికి ఆ మూడు పర్యాయాలు ఆర్టీసీ బస్సుల్లో కుటుంబీకులతో కలిసి ఉచితంగా ప్రయాణించొచ్చు. అధికారులకు మాత్రం ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలనే నిబంధన నుంచి సడలింపు ఉంది.

ప్రైవేటు వాహనాలు, రైలు, విమానంలో ప్రయాణించినప్పటికీ దీన్ని వినియోగించుకోవచ్చు. ఒక్కో పర్యాయానికి రూ.12 వేల వరకు గరిష్టంగా ప్రయాణ ఖర్చును రీయింబర్స్ చేసుకోవచ్చు. ఏటా మూడు పర్యాయాలు కలిపి రూ.36 వేలు పొందొచ్చు. అయితే ఉద్యోగి భార్య/భర్త ప్రభుత్వ ఉద్యోగి అయితే వారికి ఇది వర్తించదు. వారు పనిచేస్తున్న ప్రభుత్వ విభాగం నుంచి ఈ తరహా వెసులుబాటు పొందడం లేదని డిక్లరేషన్ సమర్పిస్తే ప్రివిలేజ్ పాస్ పొందొచ్చు. అధికులు అధికారుల భార్య/భర్తలు ప్రభుత్వ ఉద్యోగులైనప్పటికీ డిక్లరేషన్లు సమర్పించడం లేదు.

వీరు అటు తాము పనిచేస్తున్న ప్రభుత్వ విభాగాలు, ఇటు ఆర్టీసీ... రెండు వైపుల నుంచి ప్రయాణ ఖర్చును రీయింబర్స్ చేసుకుంటున్నారు. ఇలా ఎంతమంది దుర్వినియోగం చేస్తున్నారో గుర్తించే వ్యవస్థ లేకపోవటంతో యథేచ్ఛగా ఈ వ్యవహారం సాగుతోంది. ఏ అధికారి భార్య/భర్త ప్రభుత్వ ఉద్యోగో కూడా తెలియని దాఖలాలున్నాయి. అధికారులు గోప్యంగా ఉంచినా... గుర్తించే విధానం లేదు. కొంతమంది నిజాయితీగా వివరాలు పొందుపరుస్తున్నప్పటికీ అధికులు సమర్పించకుండా ప్రివిలేజ్ పాస్ నిధులు కొల్లగొడుతున్నారు.

అటు వారి భార్య/భర్త పనిచేసే ప్రభుత్వ కార్యాలయంలోనూ ఈ విషయాన్ని దాచి  ఉంచి అక్కడి నుంచి అక్కడి వెసులుబాటును పొందుతున్నారు. ఇలా నిబంధనకు తూట్లు పొడుస్తూ ఇటు ఆర్టీసీ, అటు ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెడుతున్నారు. ఇలాంటివారు వందల్లో ఉన్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. అంతర్గత ఆడి ట్ జరుగుతున్నా... దీన్ని పట్టించుకోవటం లేదు. నాలుగేళ్లకోమారు కలిపి దీన్ని వినియోగించుకునే వెసులుబాటు ఉంది. ఏడాదికి రూ.36 వేలు చొప్పున నాలుగేళ్లమొత్తం కలిపి రూ.1.44 లక్షలు  ఒకేసారి పొందుతున్నారు. దీంతో హాయిగా  విదేశీ ప్రయాణాలు జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement