సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అవసరాలకు అనుగుణంగా వెంటనే ఎరువులు సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖమంత్రి మన్‌సుఖ్ మాండవీయకు వ్యవసాయమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మంగళవారం లేఖ రాశారు. యాసంగిలో 20.5 లక్షల మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులను కేంద్రం కేటాయించిందని తెలిపారు. నెలవారీగా కావాల్సిన ఎరువుల కోసం సెప్టెంబర్ లో కేంద్రానికి తాను లేఖ రాశానని చెప్పారు.
అక్టోబర్, నవంబర్‌కు 6.4 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులకుగాను, 3.67 లక్షల మెట్రిక్ టన్నులే కేంద్రం కేటాయించిందన్నారు. అందులోనూ ఇప్పటి వరకు 1.55 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులే కేంద్రం సరఫరా చేసిందని తెలిపారు. కేంద్ర కేటాయింపుల ప్రకారమే 2.12 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు ఇంకా రావాల్సి ఉందన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన ఓడల నుంచి ఎరువులను కేటాయించాలని నిరంజన్‌రెడ్డి కోరారు.
గంగవరం పోర్టులోని ఐపీఎల్ కంపెనీ నౌక నుంచి 23 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. కాకినాడ, విశాఖ పోర్టుల్లో ఆర్‌సీఎఫ్, చంబల్, ఐపీఎల్ ఫెర్టిలైజర్స్‌కు చెందిన ఓడల నుంచి 30వేల మెట్రిక్ టన్నుల డీఏపీ కేటాయించాలన్నారు. అలాగే క్రిబ్కో కంపెనీ నుంచి 2 అదనపు రేక్‌ల యూరియా కేటా యించాలని కోరారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో తక్కువగా సరఫరా చేసిన ఎరువులను డిసెంబర్ నుంచి సరఫరాలో పెంచి భర్తీ చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment