
నాగర్ కర్నూల్, సాక్షి: SLBC టన్నెల్ ప్రమాదంలో సహాయక చర్యలు చివరి అంకానికి చేరుకున్నాయి. ప్రమాదం జరిగిన.. కార్మికులు చిక్కుకుపోయారని భావిస్తున్న ప్రాంతానికి సహాయక బృందాలు చేరుకున్నాయి. ‘‘ఎవరైనా ఉన్నారా?’’ అంటూ శబ్ధాలు చేస్తూ కార్మికుల జాడ కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు బయటకు వచ్చాయి.
నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో సొరంగం 14 కిలోమీటర్ వద్ద ఈ నెల 22వ తేదీన ప్రమాదం జరిగింది. టన్నెల్ బోరింగ్ మెషీన్‌తో పనులు ప్రారంభించగానే.. ఒక్కసారిగా భూకంపం వచ్చినట్లు సొరంగమంతా ఊగిపోయింది. పైభాగం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.


ఈ ప్రమాదం నుంచి 40 మంది కార్మికులు సురక్షితంగా బయటపడగా.. మరో ఎనిమిది మంది లోపలే చిక్కుపోయారు. అప్పటి నుంచి సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేస్తూనే ఉన్నాయి. ఉబికి వచ్చిన నీటితో మట్టి తడిసి ఉండడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
అయితే ఐదు రోజులు గడిచినా.. ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో ప్రమాదవశాత్తు చిక్కుకుపోయిన 8 మంది జాడ ఇప్పటికీ తెలియలేదు. నీరుందని, పూడిక చాలా ఎత్తులో పేరుకుపోయిందని, శిథిలాలు తొలగిస్తే మళ్లీ సొరంగం కుప్పకూలే ప్రమాదం పొంచి ఉందని అత్యంత జాగ్రత్తగా సహాయక చర్యల్ని చేపడుతూ వచ్చారు.

ఈ క్రమంలో సొరంగంలో పేరుకుపోయిన మట్టిని, నీటిని తొలగిస్తూ వచ్చారు. సహాయక చర్యలకు అడ్డుగా ఉన్న బోరింగ్ మెషిన్, ఇతర పరికరాలను ఢ్రిల్లింగ్ చేసి తొలగించి ముందుకు సాగారు. అయితే భారీగా బురద పేరుకుపోవడంతో సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతూ వచ్చాయి. మరోవైపు.. టన్నెల్ మొత్తం కుప్పకూలే ప్రమాదం ఉండడంతో ప్రత్యామ్నాయ ప్రయత్నాలను సహాయక బృందాలు విరమించుకున్నాయి. ఈ క్రమంలో..

మంగళవారం రాత్రి ఘటనాస్థలానికి 15 మీటర్ల వరకు సహాయక బృందాలు(Rescue Teams) చేరుకున్నాయి. అక్కడంతా బురద, మట్టి పెల్లలతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్మీ, ఎన్డీఎఫ్, ఎస్డీఎఫ్ టీమ్‌లతో పాటు వెళ్లిన కార్మికులు ఆక్సిజన్ అందకపోవడంతో హుటాహుటిన వెనక్కి వచ్చేశారు.

ఈ ఉదయం ఆక్సిజన్ సాయంతో ఘటనా స్థలానికి మరింత చేరువగా వెళ్లారు. దాదాపు ఐదు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది గురువారం నాటికి జీరో పాయింట్‌కు చేరుకోగలిగారు. అయితే కార్మికుల ఇంకా తెలియకపోవడంతో వాళ్ల కుటుంబ సభ్యుల్లో ఆందోళన కొనసాగుతూనే ఉంది. ప్రసుత్తం ప్రమాద స్థలంలో భారీగా బురద పేరుకుపోవడంతో దానిని తొలగించే పనులు కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment