మాట్లాడుతున్న మంత్రి తలసాని
మణికొండ: సినీ రంగానికి చెందిన కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ భరోసానిచ్చారు. గురువారం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని డాక్టర్ ఎం పభ్రాకర్‌రెడ్డి చిత్రపురి కాలనీలో 1176 ఎంఐజీ గృహాలు , 180 హెచ్‌ఐజీ డ్యూప్లెక్స్ విల్లాలకు సంబంధించి లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. లబ్ధిదారులు సామూహిక గృహా ప్రవేశాలను నిర్వహించారు.
ఈ సందర్భంగా జరిగిన సభకి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ చిత్రపరిశ్రమకి చెందిన 24 విభాగాలలో ఉపాధి పొందుతున్న వేలాది మంది కార్మికుల సొంత ఇంటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో సీనియర్ నటులు దివంగత ప్రభాకర్‌రెడ్డి కృషితో ప్రభుత్వం ఇక్కడ స్థలం కేటాయించిందన్నారు. ఈ కాలనీలో ఇప్పటికే రూ. 20కోట్లతో రోడ్లను వేశామనీ, ఇక్కడి ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు సినీ పరిశ్రమ పెద్దలతో కలిసి కృషి చేస్తామని చెప్పారు. ఇప్పటికే బస్తీ దవాఖాన మంజూరు చేశామన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా గృహ నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించిన కమిటీని మంత్రిఅభినందించారు.
పరిశ్రమకు నేను పెద్దను కాదు: చిరంజీవి
సినీ పరిశ్రమకు తాను పెద్దను కానని, కొందరు తమ వయసును తగ్గించుకునేందుకు తనను అలా అంటున్నారనిపిస్తోందని మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు. తను పరిశ్రమలో ఒకనిగా ఎదిగానని, ఎక్కడా పెద్దరికం చేయలేదన్నారు.
సినీ పరిశ్రమ తాను అనుకున్న దానికన్నా అధికంగానే ఇచ్చిందని, ఇక నుంచి నావంతుగా సినీ కార్మికులకు సహాయం చేస్తానని చిరంజీవి హామీనిచ్చారు. సొసైటీ లోటు బడ్జెట్‌తో ఉన్నా.. ఎన్నో ఇబ్బందులు వచ్చినా పరిశ్రమ, ప్రభుత్వ పెద్దలు అండగా ఉండటంతోనే గృహనిర్మాణాలు పూర్తి చేయగలిగామని చిత్రపురి హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు అనిల్‌కుమార్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment