సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రవాణా శాఖ గతంలో ఎన్నడూ లేనంత భారీ ఆదాయాన్ని సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చి 17వ తేదీ నాటికి రూ.6,055 కోట్ల రెవెన్యూతో కొత్త రికార్డు సృష్టించింది. మార్చి నెలాఖరుకు ఈ మొత్తం రూ.6,285 కోట్లకు చేరుతుందని రవాణా శాఖ అంచనా వేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.4,953 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకోగా, దానికి మించి రూ.వెయ్యి కోట్ల కంటే ఎక్కువ ఆదాయం సమకూరింది.
గతేడాది ఈ మొత్తం రూ.3,971 మాత్రమే కావటం గమనార్హం. ఖజానాను నింపే శాఖలపై ఇటీవల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఆదాయాన్ని పెంచేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. సంక్షేమ పథకాల అమలుకు కావాల్సిన ఆదాయాన్ని సమకూర్చుకునే క్రమంలో ప్రభుత్వం, మంత్రుల కమిటీని కూడా ఏర్పాటు చేసి వరుస సమీక్షలతో అధికారులను పరుగెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో, రవాణా శాఖ యంత్రాంగం ప్రత్యేక డ్రైవ్ సహా కొన్ని ట్యాక్స్‌లను పెంచి మరీ ప్రభుత్వ ఖజానాకు మెరుగైన మొత్తాన్ని ఇచ్చేందుకు చర్యలు తీసుకుంది.
కోవిడ్ నేపథ్యంలో గత రెండేళ్లుగా ట్రాన్స్‌పోర్టు వాహనాల యజమానులు పన్నులు సరిగా కట్టడం లేదు. ప్రస్తుతం అలాంటి వారిని గుర్తించి బకాయి పడ్డ పన్నులు సహా పెనాల్టీలను వసూలు చేసేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు రూ.54.21 కోట్ల పన్ను బకాయిలు, రూ.9.37 కోట్ల పెనాలీ్టలు వసూలు చేశారు. కొన్నేళ్లుగా రాష్ట్రంలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఆ సంఖ్య 1.53 కోట్లకు చేరుకుంది. విలాసవంతమైన వాహనాల సంఖ్య కూడా బాగా పెరిగింది. వాహనాల లైఫ్ ట్యాక్స్ రూపంలో ఆదాయం భారీగా పెరిగింది.
ఇక ఫ్యాన్సీ నంబర్ల వేలాన్ని కూడా రవాణాశాఖ పోత్సహిస్తోంది. లైఫ్ ట్యాక్స్ రూపంలో రూ.4,401.75 కోట్లు, త్రైమాసిక పన్ను రూపంలో రూ.825.28 కోట్లు, ఫీజుల రూపంలో రూ.527.78 కోట్లు, యూజర్ చార్జీల రూపంలో రూ.129.10 కోట్లు, డిటెక్షన్ పద్దు ద్వారా 171.09 కోట్లు సమకూరింది. శనివారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్.. రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, కమిషనర్ బుద్ధప్రకాశ్ జ్యోతి, జేటీసీలతో ఆదాయంపై సమీక్షించారు. లక్ష్యాన్ని మించి ఆదాయాన్ని సాధించిపెట్టినందుకు అధికారులను మంత్రి అభినందించారు.
చదవండి: 5.5 మీటర్ల పొడవు, 48 ఇంచుల వెడల్పు.. అంతర్జాతీయ వేదికపై మెరిసిన అగ్గిపెట్టె చీర
Comments
Please login to add a commentAdd a comment