
సాక్షి, హైదరాబాద్: ఇటు సిటీ, అటు ఊళ్లకు జీవనాడిగా ఉన్న ఆర్డినరీ బస్సులను భారీగా తగ్గించుకునేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. వాటి స్థానంలో దూరప్రాంతాలకు తిప్పే బస్సులను పెంచుకునే ప్రయత్నంలో ఉంది. సిటీ, పల్లె వెలుగు బస్సులే ప్రస్తుతం ఆర్టీసీ నష్టాలను భారీగా పెంచుతున్నాయి. దూరప్రాంతాలకు తిరిగే బస్సుల ద్వారా ఆదాయం ఎక్కువగా ఉండటంతో వాటిపైనే ఎక్కువగా దృష్టి సారించే దిశగా అడుగులేస్తున్నట్టు సమాచారం.
ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆర్టీసీ.. అప్పులు తెస్తే తప్ప ఎలాంటి పనులు చేయలేని దుస్థితికి చేరుకుంది. ప్రతినెలా ప్రభుత్వం నిధులు ఇస్తేగానీ సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే నష్టాలు భారీగా పెరిగి సంస్థను నిర్వహించే పరిస్థితి ఉండదన్న నిశ్చితాభిప్రాయానికి వచ్చింది. నష్టాలను తెచ్చిపెడుతున్న బస్సులను తగ్గించుకుంటూ రావాలనే నిర్ణయానికి వచ్చింది.
సిటీలో ట్రాఫిక్‌తో నష్టం
ప్రస్తుతం నగరంలో దాదాపు 3,600 సిటీ బస్సులున్నాయి. కోవిడ్ కంటే ముందు దాదాపు 35 లక్షల మంది ప్రయాణికులు నిత్యం వాటిల్లో రాకపోకలు సాగించేవారు. కొత్త కాలనీలు శరవేగంగా విస్తరిస్తున్నందున రోజురోజుకు బస్సుల సంఖ్య పెంచాల్సిన పరిస్థితి ఉంది. ఓ రకంగా చెప్పాలంటే ముంబైలో లోకల్ రైళ్లలాగా హైదరాబాద్‌లో సిటీ బస్సులు లైఫ్‌లైన్‌గా మారాయి. కానీ ట్రాఫిక్ వల్ల ఈ బస్సులతో నష్టం వస్తోంది. ఇటీవలి కాలంలో డీజిల్ ధరలు, సిబ్బంది జీతాలు భారీగా పెరగటంతో ఖర్చు బాగా పెరిగి నష్టాలు కూడా మరింత పెరిగాయి. దీనికితోడు నగరంలో మెట్రో రైలు సేవలను విస్తరిస్తుండటంతో సిటీ బస్సుల అవసరం కొంత తగ్గుతుందన్నది కూడా ఆర్టీసీ యోచన.
జీపులు, ఆటోలతో ముప్పు..
అటు పల్లె వెలుగు బస్సులకు ఆటోలు, జీపులతో పెద్ద ము ప్పు ఏర్పడింది. ఇది వరకు ఊరి ప్రయాణికులు బస్సు వచ్చే వరకు ఎదురు చూసేవారు. కొన్నేళ్లుగా స్వయం ఉపాధి పేరు తో ఊళ్లలో ఆటోలు, జీపులు బాగా పెరిగిపోయాయి. ఫలి తంగా జనం బస్సుల కోసం చూడకుండా ఆటోనో, జీపో ఎక్కి వెళ్లిపోతున్నారు. ఇవి కూడా ఆర్టీసీకి నష్టాలను పెంచా యి. ప్రతి కిలోమీటరుకు సగటున రూ.28 నుంచి రూ.30 వరకు ఆదాయం వస్తుంటే ఖర్చు రూ.50 వరకు ఉంటోంది. కి.మీ.కి రూ.20 నష్టం వస్తోంది. అడ్డూఅదుపూ లేని డీజిల్ ధరలతో భవిష్యత్తులో ఇంధన భారం సంస్థకు శరాఘా తంగా పరిణమిస్తుందని ఆర్టీసీ భావిస్తోంది. కోవిడ్ రాక ముందు వార్షిక నష్టాలు రూ.వేయి కోట్లను మించగా, ప్రస్తు త ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో రూ.900 కోట్లకు చేరుకున్నాయి. బ్యాంకు అప్పులు రూ.3 వేల కోట్ల వరకు ఉండగా, బకాయిలు రూ.2,500 కోట్లకు చేరుకున్నాయి.
మరింత పెరగనున్న ఆటోలు, క్యాబ్‌లు
కొంతకాలంగా రాష్ట్రంలో ఆటోలు, క్యాబ్‌లు బాగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆటోలు 4.42 లక్షలు, మోటార్ క్యాబ్‌లు 1.14 లక్షలుండగా, మ్యాక్సీ క్యాబ్‌లు 31 వేలు దాటాయి. ఇప్పటికీ అధికారులు యువతకు ఉపాధి పేరుతో ఆటోలు, క్యాబ్‌లను మంజూరు చేస్తున్నారు. కొత్తగా వస్తున్న పథకాలతో వీటి సంఖ్య మరింత పెరగనుంది. అప్పుడు కష్టాలు మరింత పెరుగుతాయన్న ఆందోళన ఆర్టీసీని వెంటాడుతోంది. ఈనేపథ్యంలో దూర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలకు తిరిగే గరుడ, సూపర్ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులను పెంచుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించింది.
ఇది జరగాలంటే ఇప్పటికిప్పుడు కొత్త బస్సులు కొనాల్సిందే. కానీ అంత ఆర్థిక స్తోమత ఆర్టీసీకి లేదు. ప్రభుత్వం గ్రాంటు ఇవ్వడమో, పూచీకత్తుతో మరిన్ని రుణాలను మంజూరు చేయడమో జరగాలి. ఇది ప్రభుత్వానికి కూడా భారమే. దీంతో అవసరమైతే దూరప్రాంత సర్వీసులను కూడా అద్దె ప్రాతిపదికన తీసుకోవాలని ఆర్టీసీ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment