అఖిల, రూపేశ్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సమాజంలో వివక్షను ఎదుర్కొంటున్న వారిలో ట్రాన్స్‌జెండర్ల వర్గమొకటి. ఈ వర్గంవారు ఎక్కువగా భిక్షాటన, ఇతర వృత్తుల్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి వారిపై ఆదరణ చూపేవారికన్నా చీదరించుకునే వారే అధికంగా ఉంటారు. ఇలాంటివారికి పెళ్లి భాగ్యం తక్కువే.
సాధారణంగా ఇలాంటి వారిని పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకు రారు. కానీ ఇటీవల ట్రాన్స్‌జెండర్లను సైతం కొందరు యువకులు ప్రేమించిపెళ్లి చేసుకుంటున్నారు. కన్నవారిని, సమాజ కట్టుబాట్లను సైతం ఎదురిస్తూ ఇష్టపడిన వారిని మనువాడుతున్నారు. ప్రేమ అంటే పైకి కనిపించే శరీరం కాదని.. అది మనసుకు సంబంధించిన విషయమని అంటున్నాయి ఈ రకపుప్రేమ జంటలు.
మూడేళ్లపాటు ప్రేమించి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం అనంతతోగుకు చెందిన ట్రాన్స్‌జెండర్ అఖిల, భూపాలపల్లికి చెందిన రూపేశ్ మూడేళ్లపాటు ప్రేమించుకున్నారు. అయితే తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో వారిని ఎదురించి గత మార్చిలో ఇల్లెందులో హిందూ సంప్రదాయం ప్రకారం ఒక్కటయ్యారు. ప్రస్తుతం వారిద్దరూ కలసి ఉంటున్నారు. తమకు ప్రభుత్వం సాయం అందించాలని కోరుతున్నారు.
ఒకరినొకరు ఇష్టపడి..
కరీంనగర్ జిల్లా వీణవంకకు చెందిన ట్రాన్స్‌జెండర్ దివ్యను జగిత్యాలకు చెందిన అర్షద్ పెళ్లిచేసుకున్నారు. మొదట కొంతకాలం ఇద్దరూ కలిసే ఉన్నారు. ప్రేమలో ఉండి సహజీవనం చేశారు. చివరకు అర్షద్ తన ఇంట్లో వాళ్లను ఎదిరించి గతేడాది డిసెంబర్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం దివ్యను వివాహం చేసుకున్నారు. తమకు ప్రభుత్వం ఏదైనా ఉపాధి కల్పించాలని కోరుతున్నారు.
జాతరలో పరిచయమై..
2019లో హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు వరంగల్ జిల్లాకు చెందిన ఓ ట్రాన్స్‌జెండర్‌ను ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకున్నాడు. మేడారం జాతరలో చిగురించిన వీరి ప్రేమ చివరకు పెళ్లికి దారి తీసింది. గతంలో కుటుంబాల్లో కట్టుబాట్లకారణంగా ఎక్కువగా బయటకురాని ఈ తరహా జంటలు.. ఇప్పుడు స్వేచ్ఛా సమాజం కారణంగా తమ విషయాలను ధైర్యంగా చెప్పగలుగుతున్నారు.
చట్టబద్ధత కోసం పోరాటం
దేశంలో తొలిసారిగా కేరళలో ఓ ఎల్‌జీబీటీ పెళ్లి జరిగింది. ఆ దంపతులు తమ పెళ్లిని రిజిస్టర్ చేసి చట్టబద్ధత కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ట్రాన్స్‌జెండర్ల పెళ్లిళ్లపై చర్చ మొదలైంది. ఎల్‌జీబీటీ హక్కుల చట్టంలో పెళ్లితో సహా, మరికొన్ని అంశాలు చేర్చాలనే పిటిషన్లు సుప్రీంలో విచారణలో ఉన్నాయి. తమకు అన్ని హక్కులు కల్పించాలని ట్రాన్స్‌జెండర్ల డిమాండ్.
Comments
Please login to add a commentAdd a comment