హిజ్రాల పెళ్లి వేడుక ఏడుపుతో ఎందుకు ముగుస్తుంది? ఇదేమైనా సంప్రదాయమా? | Transgender Do Marriage But Become Bride For Only One Night Why - Sakshi
Sakshi News home page

Transgender Marriage: హిజ్రాల పెళ్లి వేడుక ఏడుపుతో ఎందుకు ముగుస్తుంది?

Published Mon, Sep 11 2023 12:35 PM | Last Updated on Mon, Sep 11 2023 2:52 PM

Transgender do Marriage but Become Bride for Only one Night Why - Sakshi

హిజ్రాల జీవితాల్లో ఎన్నో రహస్యాలు దాగివుంటాయి. అందుకే వారి జీవితం ఎలా సాగుతుంది? వారికి వివాహాలు జరుగుతాయా? వారు జంటగా ఉన్నప్పుడు స్త్రీ, పురుష పాత్రలను పోషిస్తారా అనే ప్రశ్న చాలామందిలో తలెత్తుతుంది. నిజానికి ప్రతీ హిజ్రా తన జీవితంలో ఖచ్చితంగా వివాహం చేసుకుంటారు. అయితేవారు ఒక రాత్రికి మాత్రమే వధువుగా మారుతారు. ఇదేమీ విచిత్రం కాదు. వారి సమాజంలో ఇది ఒక సంప్రదాయంగా కొనసాగుతుంది. 

పురాతన గ్రంథాలలో హిజ్రాలను యక్షులు, గంధర్వులతో సమానంగా పరిగణించారు. మహాభారతం నుండి యక్ష పురాణం వరకు శిఖండి, మోహిని లాంటి పాత్రలు కనిపిస్తాయి. అయితే మన సమాజంలో హిజ్రాలను ప్రత్యేకంగా చూస్తుంటారు. అందుకే హిజ్రాలు తమకంటూ ఒక సమాజాన్ని సృష్టించుకుంటారు. వారి అంత్యక్రియలు, వివాహాలు వారి సంప్రదాయాలు, నమ్మకాల ఆధారంగా కొనసాగుతాయి. 

దక్షిణ భారతదేశంలో ప్రతి సంవత్సరం జరిగే హిజ్రాల ఉత్సవాన్ని కూవగం జాతర అని అంటారు. ఈ సంవత్సరం ఈ ఉత్సవం ఏప్రిల్ 18న ప్రారంభమై మే 03 వరకు జరిగింది. ఇందులో మే 02, 03 తేదీల్లో హిజ్రాల వివాహాలు జరిగాయి. ఈ జాతర తమిళనాడులోని కూవగం అనే గ్రామంలో జరుగుతుంది ఈ జాతర 18 రోజుల పాటు కొనసాగుతుంది. దేశం నలుమూలల నుండి హిజ్రాలు ఇక్కడికి వస్తుంటారు. ఈ ప్రదేశం తమిళనాడులోని విల్లుపురం జిల్లాకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిజ్రాల దేవుడిగా భావించే అరవాన్ దేవతకు వారు ఆరోజుల్లో పూజలు చేస్తారు.

జాతరలో హిజ్రాల కళ్యాణం ఒక్కరోజు మాత్రమే జరుగుతుంది. దీని వెనుక ఓ పురాణ కథ ఉంది. మహాభారతంలో అరవన్ అనే దేవుని పేరు ప్రస్తావనకు వస్తుంది. అతను.. అర్జునుడు- యువరాణి ఉలూపి కుమారుడు. మహాభారత కథ ప్రకారం యుద్ధ సమయంలో కాళీ దేవిని ప్రసన్నం చేసుకునేందుకు అరవన్‌ తనను తాను త్యాగం చేసుకునేందుకు సిద్ధమవుతాడు. అయితే పెళ్లి కాకుండా చనిపోవడం ఇందుకు అనువైనది కాదనేది షరతు. అటువంటి పరిస్థితిలో శ్రీ కృష్ణుడు మోహిని రూపాన్ని ధరించి అరవన్‌ను వివాహం చేసుకుంటాడు. అరవన్‌ మరణించిన మరుసటి రోజు ఉదయం మోహిని రూపంలో ఉన్న శ్రీ కృష్ణుడు వితంతువులా రోదించాడని చెబుతారు. 

ఈ కథను ఆధారంగా చేసుకుని హిజ్రాలు అరవన్‌ను ఒక రోజు వివాహం చేసుకుంటారు. మరుసటి రోజు వారు వితంతువులుగా మారి పెద్దపెట్టున విలపిస్తారు. పెళ్లి రోజన హిజ్రాలు అరవన్‌ను తమ భర్తగా భావించి, తమను తాము నవ వధువులా అలంకరించుకుంటారు. ఆలయ పూజారులు వారికి మంగళసూత్రం ధరించేలా ఏర్పాట్లు చేస్తారు. మరుసటి రోజు వారు అరవన్ చనిపోయినట్లు భావించి, వితంతువులు అవుతారు. అప్పుడు హిజ్రాలు తమ అలంకరణను తొలగించుకుని పెద్ద పెట్టున రోదిస్తారు. 

హిజ్రాల పరిస్థితి భారత్‌లోనే కాదు పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాలలో కూడా దారుణంగా ఉంది. స్త్రీల వేషధారణలో ఉంటూ, వారు సమాజానికి దూరంగా ఉంటున్నారు. పలు పాశ్చాత్య దేశాలలో హిజ్రాలు సామాన్య ప్రజల మధ్యనే ఉంటారు. వారు కూడా వివాహం  చేసుకుని బిడ్డను దత్తత తీసుకుంటుంటారు. ఛాందసవాద సమాజం వారిని ప్రధాన స్రవంతి నుండి వేరు చేస్తున్నదనే వాదనలు వినిపిస్తుంటాయ.   
ఇది కూడా చదవండి: 4 కళ్ల నల్లని చారల చేప... చూసేందుకు జనం పరుగులు!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement