సివిల్స్‌లో తెలుగు మెరుపులు | Telugu Students Secure Top Ranks In UPSC Civils | Sakshi
Sakshi News home page

 తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 40 మంది అభ్యర్థులకు ఉత్తమ ర్యాంకులు

Published Tue, May 31 2022 4:00 AM | Last Updated on Tue, May 31 2022 8:58 AM

Telugu Students Secure Top Ranks In UPSC Civils - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/నెట్‌వర్క్‌: సివిల్‌ సర్వీసెస్‌లో ఉత్తమ ర్యాంకులతో తెలుగువారు సత్తా చాటారు. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సివిల్స్‌–2021 తుది ఫలితాలను సోమవారం విడుదల చేసింది. జాతీయ స్థాయిలో 685 మందిని సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపిక చేసినట్టు ప్రకటించింది. ఇందులో 40 మంది వరకు తెలంగాణ, ఏపీల నుంచి సివిల్స్‌కు హాజరైనవారే ఉన్నట్టు ప్రాథమిక అంచనా. ముఖ్యంగా టాప్‌–100 ర్యాంకర్లలో 11 మంది ఇక్కడి వారే నిలిచారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తెలుగు రాష్ట్రాల్లో స్థిరపడిన కొందరు అభ్యర్థులు కూడా రాష్ట్రం తరఫున ఎంపికైనవారి జాబితాలో ఉన్నారు.

హైదరాబాద్‌ నుంచే ఎక్కువగా..
హైదరాబాద్‌లో కోచింగ్‌ తీసుకుని.. ఇక్కడి నుంచి సివిల్స్‌ పరీక్షలకు హాజరైనవారు కూడా పెద్ద సంఖ్యలోనే ర్యాంకులు సాధించారు. జాతీయ స్థాయిలో 9, 16, 37, 51, 56, 62, 69 తదితర ర్యాంకులు సా«ధించిన అభ్యర్థులకు హైదరాబాద్‌తో సంబంధం ఉండటం గమనార్హం. ఇక రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు చెందిన అభ్యర్థులూ మంచి ర్యాంకులు సాధించారు. వ్యవసాయం చేసేవారు, హౌజ్‌ కీపింగ్‌ వంటి చిన్న ఉద్యోగం చేసే వారి పిల్లలకు ఉత్తమ ర్యాంకులు రావడంతో వారి కుటుంబాల్లో ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. 

ర్యాంకర్ల మనోగతం

అసలు ఊహించలేదు.. 
సివిల్స్‌లో ఇంటర్వ్యూ పూర్తయ్యాక మంచి ర్యాంక్‌ వస్తుందనుకున్నా.. కానీ జాతీయస్థాయిలో 15వ ర్యాంకు వస్తుందని ఊహించలేదు. సరైన ప్రణాళిక, నిరంతర కృషి ఉంటే అసాధ్యమనే పదానికి తావే ఉండదు.’’అని సివిల్స్‌లో 15వ ర్యాంకు సాధించిన చల్లపల్లె యశ్వంత్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఏపీలోని కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం కలుగోట్లపల్లె గ్రామానికి చెందిన యశ్వంత్‌ తండ్రి పుల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. అమ్మ లక్ష్మీదేవి గృహిణి. ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 పరీక్షల్లో మూడో ర్యాంకు సాధించి, కర్నూలులో సీటీవోగా పనిచేస్తూ సివిల్స్‌కు సిద్ధమయ్యారు. 2020 సివిల్స్‌లో 93వ ర్యాంక్‌ సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. దానికి శిక్షణ తీసుకుంటూనే.. మరోసారి సివిల్స్‌ రాసి 15వ ర్యాంకు సొంతం చేసుకున్నారు. 

రైతుల ఆత్మహత్యలు కదిలించాయి 
హైదరాబాద్‌లోని మలక్‌పేటకు చెందిన వి.సంజన సింహ సివిల్స్‌ ఫలితాల్లో 37వ ర్యాంకు సాధించారు. గతేడాది సివిల్స్‌లో 207వ ర్యాంకు సాధించి ఐఆర్‌ఎస్‌కు ఎంపికైన ఆమె.. ఆదాయపన్ను శాఖలో అసిస్టెంట్‌ కమిషనర్‌గా శిక్షణ తీసుకుంటూనే మళ్లీ సివిల్స్‌ రాశారు. అఫీషియల్‌ ట్రిప్‌లో భాగంగా హిమాలయాల్లో ట్రెక్కింగ్‌ చేస్తున్న ఆమె.. ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడారు. ‘‘దేశంలో ఎంతో మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అందులో తెలుగు రాష్ట్రాలు టాప్‌–5లో ఉండటం కదిలించింది. ఐఏఎస్‌ అధికారిగా రైతుల ఆత్మహత్యలను నిరోధించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటా’’ అని చెప్పారు. 

రెండేళ్లు పాపకు దూరంగా ఉండి.. 
‘‘ఓ వైపు ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు సివిల్స్‌ కోసం సిద్ధమయ్యాను. అప్పటికే ఉద్యోగం ఉండి, స్థిరపడ్డ జీవితంలో.. చిన్న పాపకు, కుటుంబానికి దూరంగా ఉండటం ఏమిటన్న ప్రశ్నలు అనేక మంది నుంచి ఎదురయ్యాయి. ఎంతో బాధ అనిపించింది. కానీ నా భర్త ఎంతగానో ప్రోత్సహించారు’’ అని సివిల్స్‌ 56వ ర్యాంకర్‌ కొప్పిశెట్టి కిరణ్మయి చెప్పారు. ఆమె భర్త విజయ్‌కుమార్‌ చౌహాన్‌ హైదరాబాద్‌లో సీటీఓగా పనిచేస్తున్నారు. 2019లో సివిల్స్‌ 613వ ర్యాంకు రాగా డానిక్స్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా చేరిన ఆమె.. మరోసారి సివిల్స్‌ రాసి 56వ ర్యాంకు సాధించారు. 

ఐపీఎస్‌ కావాలని ఉంది 
‘‘నాకు ఐపీఎస్‌ కావాలని కోరిక. ర్యాంకును బట్టి ఐఏఎస్‌ వచ్చినా స్వీకరిస్తా. అటు ఉద్యోగం చేస్తూనే.. రోజూ ఎనిమిది గంటల పాటు సివిల్స్‌కు ప్రిపేరై మంచి ర్యాంకు సాధించా’’ అని 161వ ర్యాంకర్‌ బొక్క చైతన్యరెడ్డి తెలిపారు. హనుమకొండకు చెందిన ఆమె తండ్రి సంజీవరెడ్డి వరంగల్‌ జిల్లా సహకార అధికారిగా, తల్లి వినోద సంస్కృత లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. వరంగల్‌ నిట్‌లో బీటెక్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన చైతన్య.. 2016లో రాష్ట్రంలో నీటిపారుదల శాఖ ఏఈగా ఎంపికైంది. ఉద్యోగం చేస్తూనే ఆరోసారి సివిల్స్‌ రాసి మంచి ర్యాంకు సాధించింది. 

మంచి పోస్టింగ్‌ కోసం పట్టుదలతో.. 
‘‘2017 నుంచి వరుసగా సివిల్స్‌ రాసి ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. 2019లో ఐఆర్‌ఎస్‌కు ఎంపికయ్యాను. ప్రస్తుతం గుజరాత్‌లోని వదోదరలో శిక్షణలో ఉన్నాను. మంచి పోస్టింగ్‌ సాధించాలనే పట్టుదలతో మళ్లీ ప్రిపేర్‌ అయి 488 ర్యాంక్‌ సాధించాను. ఈ దిశగా నా తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహించారు’’ అని నాగర్‌కర్నూల్‌ జిల్లా ఊర్కొండ మండలం రాచాలపల్లికి చెందిన సంతోష్‌కుమార్‌రెడ్డి చెప్పారు. 

స్వీపర్‌ బిడ్డ కాబోయే కలెక్టర్‌ 
తండ్రి ఐలయ్య వ్యవసాయకూలీ, తల్లి సులోచన సింగరేణి సంస్థలో ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో స్వీపర్‌గా పనిచేస్తున్నారు. ఇద్దరి సంపాదన కలిపినా ఇల్లు సరిగా గడవని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో పట్టుదలగా చదివి సివిల్స్‌లో 117వ ర్యాంకు సాధించాడు భూపాలపల్లికి చెందిన ఆకునూరి నరేశ్‌. ఇంటర్‌ వరకు ప్రభుత్వ స్కూలు, కాలేజీలోనే చదివిన నరేశ్‌ మద్రాస్‌ ఐఐటీలో బీటెక్‌ పూర్తిచేశాడు. చెన్నైలోనే మూడేళ్లు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేసి.. తర్వాత సివిల్స్‌కు ప్రిపేరవడం మొదలుపెట్టాడు. 2019లో 782వ ర్యాంకుతో ఇండియన్‌ రైల్వే పర్సనల్‌ సర్వీస్‌కు ఎంపికయ్యాడు. గుజరాత్‌లోని వదోదరాలో ట్రైనింగ్‌ పొందుతూ.. మళ్లీ సివిల్స్‌ రాసి మెరుగైన ర్యాంకు సాధించాడు. నరేశ్‌ సివిల్స్‌లో మంచి ర్యాంకు సాధించడంతో సంబురంలో మునిగిన తండ్రి ఐలయ్య.. కుమారుడిని తన టీవీఎస్‌ ఎక్సెల్‌ బండిపై ఎక్కించుకొని కాలనీ అంతా తిరుగుతూ తన కుమారుడు ఐఏఎస్‌ సాధించాడంటూ మురిసిపోయాడు. 

మహిళా సాధికారత కోసం కృషి చేస్తా.. 
మాది నిజామాబాద్‌ జిల్లా. నిర్దేశించుకున్న లక్ష్యంపై పట్టువదలకుండా కృషి చేసి నాలుగో ప్రయత్నంలో సివిల్స్‌లో 136వ ర్యాంకు సాధించా. అమ్మ పద్మ కామారెడ్డి కలెక్టరేట్‌లో పేఅండ్‌ అకౌంట్స్‌ విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. చిన్నప్పుడే నా తండ్రి చనిపోయారు. అమ్మ చాలా కష్టపడి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఆమె ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధించాను. మహిళా సాధికారతపై ప్రధానంగా దృష్టి సారిస్తా.. 
– అరుగుల స్నేహ, 136వ ర్యాంకర్‌ 

తల్లిదండ్రుల స్ఫూర్తితో.. 
మాది జగిత్యాల బీర్‌పూర్‌ మండలం చర్లపల్లి. తండ్రి బాషానాయక్‌ వ్యవసాయం చేస్తూ.. కష్టపడి నన్ను చదివించారు. తల్లి యమున మినీ అంగన్‌వాడీ కేంద్రంలో టీచర్‌గా పనిచేస్తున్నారు. వారి స్ఫూర్తితో ఐఏఎస్‌ సాధించాలన్న లక్ష్యంతో కçష్టపడి చదివాను. 
– గుగ్లావత్‌ శరత్‌నాయక్, 374వ ర్యాంకు 

ప్రణాళిక బద్ధంగా చదివి.. 
నేను బీటెక్‌ పూర్తి చేసి ఐటీ కంపెనీలో కొంతకాలం ఉద్యోగం చేశాను. సివిల్స్‌ సాధించాలనే తపనతో ప్రణాళికాబద్ధంగా చదివి.. నాలుగో ప్రయత్నంలో మంచి ర్యాంకు సాధించాను. 
– ఉప్పులూరి చైతన్య, 470వ ర్యాంకర్‌ 

పరిశోధనలు కావాలి 
దేశానికి శాస్త్రవేత్తలు కూడా అవసరం. చాలా మంది సివిల్స్, ఇతర ఉద్యోగాల వైపు మొగ్గు చూపుతున్నారు. శాస్త్రవేత్తలు, ఇంజనీర్లను పరిశోధనల వైపు ప్రోత్సహిస్తాను.
– గడ్డం సుధీర్‌కుమార్, 69వ ర్యాంకర్‌ 

పేదలకు సేవ చేయాలనే లక్ష్యంతో.. 
‘‘పేదలకు సేవ చేయాలనే లక్ష్యంతో సివిల్స్‌కు సిద్ధమయ్యాను. మా ఇంట్లో అందరూ మంచి స్థానాల్లో ఉన్నారు. వారి స్ఫూర్తితో నేను సివిల్స్‌ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. నాలుగో ప్రయత్నంలో అనుకున్నది సాధించాను. 
– అనన్యప్రియ, 544వ ర్యాంకర్, హైదరాబాద్‌ 

ఎంతో సంతోషంగా ఉంది.. 
ఐఏఎస్‌ లక్ష్యంగా గట్టిగా కృషి చేశా. నాకు వచ్చిన ర్యాంకును బట్టి ఐపీఎస్, ఐఆర్‌ఎస్‌ వచ్చే అవకాశముంది. ఏదొచ్చినా పేద ప్రజలకు సేవ చేయాలన్నదే లక్ష్యం. ఐపీఎస్‌ వస్తే నేరాలను అరికట్టేందుకు కృషి చేస్తా.. తల్లిదండ్రుల ప్రోత్సాహం తోనే ర్యాంకు సాధించా.
– ముత్యపు పవిత్ర, 608 ర్యాంకర్‌  

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement