సాక్షి, హైదరాబాద్: తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వివరించింది. దీని ప్రభావంతో రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో తూర్పు, దక్షిణ ప్రాంత జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది.
రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత నల్లగొండ జిల్లా దామెరచర్లలో 45.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. శుక్రవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 42.5 డిగ్రీల చొప్పున నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 25.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. రాష్ట్రానికి వాయవ్య దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
వడదెబ్బకు ముగ్గురు మృతి..
అశ్వారావుపేట రూరల్: ఒకే గ్రామ పరిధిలో వడదెబ్బకు గురై ముగ్గురు వ్యక్తులు శుక్రవారం మృతి చెందారు. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురం కాలనీ గ్రామానికి చెందిన అచ్చె రామారావు (75) ఎండవేడితో తీవ్ర అస్వస్థతకు గురికాగా కుటుంబసభ్యులు ఆస్పత్రి తీసుకెళ్లేలోగానే మృతి చెందాడు. వినాయకపురం గ్రామానికి చెందిన బేతం చిన్ని (58), తన్నీరు మనోహర్ (48) కూడా వడదెబ్బతో మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment