సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలపైనే దృష్టి సారించిన కొత్త ప్రభుత్వం రాజధాని నగరంలో కీలకమైన జీహెచ్‌ఎంసీలోనూ బదిలీలు చేపట్టింది. అడిషనల్ కమిషనర్‌గా పని చేస్తున్న జె.శంకరయ్యను ఇప్పటికే టీఎస్‌టీఎస్ ఎండీగా పంపించిన సర్కారు... తాజాగా కీలక స్థానాల్లో ఉన్న ఇద్దరు జోనల్ కమిషనర్లను బదిలీ చేసింది. వారి స్థానంలో ఇద్దరు మహిళా ఐఏఎస్ అధికారులను నియమించింది. దీంతో గ్రేటర్‌లోని ఆరు జోన్లకుగాను మూడు జోన్లలో ముగ్గురు జోనల్ కమిషనర్లు మహిళలే కావడం గమనార్హం.
ఎన్నాళ్లకు.. ఎట్టకేలకు..
ఇప్పటి వరకు తాను కోరుకున్న ప్రాంతాల్లో తప్ప ఎక్కడికీ కదలబోననే విధంగా వ్యవహరించిన కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ వి.మమతను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐయూఎం)కు బదిలీ చేశారు. ఆమె స్థానంలో ఇటీవల జీహెచ్‌ఎంసీకి బదిలీపై వచి్చన అభిలాష అభినవ్‌ను కూకట్‌పల్లి జోనల్ కమిషనర్‌గా నియమించారు. మరో ఐఏఎస్ అధికారి జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ (రెవెన్యూ,ఐటీ)గా ఉన్న స్నేహ శబరీ ను శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా మార్చారు. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా జీహెచ్‌ఎంసీలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న బి.శ్రీనివాసరెడ్డిని ఆయన మాతృసంస్థ అయిన హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్‌కు బదిలీ చేశారు.
► వీరితో పాటు వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్సార్‌డీపీ)లో ఎస్‌ఈగా ఉన్న వెంకటరమణను మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎంఆర్‌డీసీ)కు బదిలీ చేశారు. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. ఊహించినట్లుగానే దీర్ఘకాలికంగా జీహెచ్‌ఎంసీలో కొనసాగుతున్న వారిని, డిప్యుటేషన్‌పై వచ్చి కీలక స్థానాల్లో ఉన్నవారిని ప్రభుత్వం బదిలీ చేసింది. వీరి ని పంపించేందుకు సమయం పట్టవచ్చనే అభిప్రాయాలు వెలువడినప్పటికీ జాప్యం లేకుండా బదిలీలు చేసింది. త్వరలోనే మరికొన్ని బదిలీలు జరిగే అవకాశం ఉంది.
అంతర్గత బదిలీలు సైతం
ఎన్నికల స్పెషలాఫీసర్‌గా పని చేస్తున్న డిప్యూటీ కలెక్టర్ వై. శ్రీనివాసరెడ్డిని ఫలక్‌నుమా డిప్యూటీ కమిషనర్ (డీసీ)గా నియమించారు. అక్కడ డీసీగా ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న లావణ్యను ఫలక్‌నుమా ఏఎంసీగా అక్కడే ఉంచారు. సంతోష్ నగర్ డీసీగా ఉన్న వి.నరసింహను కుత్బుల్లాపూర్ డీసీగా బదిలీ చేశారు. కుత్బుల్లాపూర్ డీసీ ఎ. నాగమణిని సంతోష్ నగర్ డీసీగా బదిలీ చేశారు. డీసీ (ఫైనాన్స్)గా ఉన్న ఎల్.శ్రీలతను చారి్మనార్ డీసీగా బదిలీ చేశారు. చారి్మనార్ డీసీగా ఉన్న ఢాకు నాయక్‌ను కమిషనర్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు.
మరిన్ని మార్పులు..
ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీలో త్వరలోనే పలు మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. అధికారుల బదిలీలతో పాటు పనుల్లోనూ మార్పులు చోటు చేసుకునే వీలుంది. ప్రభుత్వ ప్రాధాన్యతలేమిటో స్పష్టత వచ్చాక ఆమేరకు మార్పులు జరగనున్నాయి. మున్సిపల్ పరిపాలన శాఖను స్వయంగా తానే పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. మూసీపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. నగరానికి సంబందించి మొదటి సమీక్ష సమావేశాన్ని ఈ నది గురించే నిర్వహించడం.. ఆ తర్వాత నిర్వహించిన సమీక్షలోనూ మూసీని ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment