
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లక్షణాలు లేని కరోనా కేసులు ఏకంగా లక్షకు పైగా నమోదయ్యాయి. తెలంగాణలో సోమవారం నాటికి 1,45,163 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, అందులో ఎటువంటి లక్షణాలు లేని కేసులు 1,00,162 (69%) ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు మంగళవారం ఉదయం బులెటిన్ విడుదల చేశారు. లక్షణాలుండి నమోదైన కరోనా కేసులు 45,001 (31%) ఉన్నట్లు పేర్కొన్నారు. ఇదిలావుండగా ఇప్పటివరకు రాష్ట్రంలో 18,27,905 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. సోమవారం 60,923 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,392 కేసులు నమోదయ్యాయి.
ఒక్కరోజే కరోనాతో 11 మంది మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 906కి చేరింది. కాగా, కరోనా బారి నుంచి ఒక్క రోజే 2,346 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,12,587కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 31,670కి చేరిందని శ్రీనివాసరావు తెలిపారు. అందులో 24,579 మంది ఇళ్లు లేదా ఇతరత్రా సంస్థల ఐసోలేషన్లలో ఉన్నారు. ఒక్కరోజులో నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 304 ఉండగా.. రంగారెడ్డి జిల్లాలో 191, కరీంనగర్‌లో 157, మేడ్చల్‌లో 132, ఖమ్మంలో 116, నల్లగొండలో 105, నిజామాబాద్‌లో 102, సూర్యాపేటలో 101 నమోదయ్యాయి.