
కొందరు ఉన్మాదులు తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారు: కేటీఆర్
హెచ్‌ఎండీఏ చేసే ప్రతి పనికి ప్రభుత్వ అనుమతులు అవసరం లేదు
టీఓటీ విధానంలో ఓఆర్‌ఆర్ లీజు.. ఆ డబ్బులతో రుణమాఫీ చేశాం
లీజుపై గతంలో రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలపై హెచ్‌ఎండీఏ కేసు కూడా పెట్టిందని స్పషీ్టకరణ
రేవంత్ సొంత శాఖ అధికారులతో దర్యాప్తు చేస్తే నిజాలు తెలుస్తాయా? అని ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: ‘ఫార్ములా–ఈ’కార్ల రేసు విషయంలో అణాపైసా అవినీతి జరగలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు. హెచ్‌ఎండీఏ చేపట్టే పనులకు ప్రభుత్వ అనుమతులు అవసరం లేదని... హైదరాబాద్ నగర అభివృద్ధికి దోహదం చేసే ఏ కార్యక్రమం కోసమైనా ఖర్చు చేసే స్వాతంత్య్రం హెచ్‌ఎండీఏకు ఉందని చెప్పారు.
ఫార్ములా–ఈ రేస్‌లో ఎలాంటి అవినీతి జరగలేదనే అంశం మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలతో బయటపడిందని... ఈ అంశంపై కొందరు ఉన్మాదులు తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేటీఆర్ శుక్రవారం శాసనసభ లాబీల్లో మీడియాతో చిట్‌చాట్ చేశారు.
ఔటర్ రింగ్ రోడ్డు లీజు విషయంలో కూడా ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు. దేశంలో ఇప్పటికే అమల్లో ఉన్న ‘టీఓటీ’విధానంలోనే ఔటర్ రింగ్ రోడ్డు లీజు ద్వారా నిధులు సేకరించామని.. ఆ నిధులను రైతుల రుణమాఫీ కోసం వినియోగించామని తెలిపారు.
కేబినెట్ సబ్ కమిటీ సూచనలతోనే..
‘‘ఆర్థిక వనరుల సమీకరణపై బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం అనేక సూచనలు చేసింది. అందులో భాగంగానే ఓఆర్‌ఆర్ లీజు కూడా ఉంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) కూడా ఇదే విధానంలో జాతీయ రహదారుల నుంచి డబ్బులు సేకరిస్తోంది.
ప్రైవేటు కంపెనీకి లబ్ధి జరిగిందని ఆరోపిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. లీజు ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయడం లేదు? ఓఆర్‌ఆర్ లీజులో రూ.లక్ష కోట్లు అవినీతి జరిగిందని ప్రతిపక్షంలో ఉన్నపుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దీంతో హెచ్‌ఎండీఏ రేవంత్‌రెడ్డిపై వేసిన పరువు నష్టం కేసు ఇంకా కొనసాగుతోంది..’’అని కేటీఆర్ చెప్పారు.
ఓఆర్‌ఆర్ లీజుపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలి
మున్సిపల్, హోం శాఖలను నిర్వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి... తన కింద పనిచేసే అధికారులతో ప్రత్యేక విచారణ బృందం (సిట్) వేసి దర్యాప్తు చేస్తే వాస్తవాలు ఎలా బయటకు వస్తాయని కేటీఆర్ ప్రశ్నించారు. ఓఆర్‌ఆర్ లీజును రద్దు చేసి, సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జితో నిష్పక్షపాత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
న్యాయమూర్తి నేతృత్వంలో ఏర్పాటయ్యే విచారణ సంస్థతో జాతీయ రహదారుల లీజు విధానాలను అధ్యయనం చేయించాలన్నారు. లేని పక్షంలో ఇది మరో రాజకీయ కక్ష సాధింపు చర్యేనని ప్రజలు భావిస్తారని పేర్కొన్నారు. కోకాపేటలోని విలువై న ప్రభుత్వ భూమిని టీజీఐఐసీకి విక్రయించి రూ.10 వేల కోట్లు సేకరించే ప్రక్రియను ప్రభు త్వం నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
ఇటీవల రెండు రోజుల పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు శిక్షణ ఇచ్చారని.. అది స్పీకర్‌పై, ప్రతిపక్ష సభ్యులపై వాటర్ బాటిళ్లు విసరడంలో శిక్షణ ఇచ్చారా? అని విమర్శించారు. స్పీకర్‌ను పదే పదే దళితుడు అంటూ ఆయన గౌరవాన్ని అధికార పక్షం తక్కువ చేస్తోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment