సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇప్పటికే పలు ట్విస్టులు చోటుచేసుకున్నాయి. చివరకు ఈ కేసును హైకోర్టు.. సీబీఐ విచారణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో, ఈ కేసులో సీబీఐ స్పీడ్ పెంచింది. ఈ కేసులో ప్రభుత్వం తమకు సహకరించకపోతే ఏం చేయాలో ప్లాన్ చేస్తోంది.
ఇందులో భాగంగానే ప్రభుత్వం కేసు వివరాలు ఇవ్వకపోతే సీబీఐ ఇలా చేసే అవకాశం ఉంది. 91 సీఆర్‌పీసీ కింద ప్రభుత్వానికి సీబీఐ నోటీసులు ఇవ్వనుంది. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే 93 ప్రకారం.. కోర్టు వారెంట్ ద్వారా సీబీఐ డాక్యుమెంట్లను సీజ్ చేయనుంది. లేదంటే హైకోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉంది. మరోవైపు.. కేసు వివరాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి సీబీఐ మరోసారి లేఖ రాయనుంది. కాగా, ఈ కేసులో భాగంగా ఇప్పటి వరకు ఆరుసార్లు ప్రభుత్వానికి సీబీఐ లేఖ రాసింది.
అయితే, ఈ లేఖల్లో మొయినాబాద్ ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, సంబంధిత పత్రాలు తమకు సమర్పించాలని సీబీఐ కోరింది. కాగా, ఈ లేఖపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేదు. ఇదిలా ఉండగా.. ఈ కేసు విషయమై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఫిబ్రవరి 17వ తేదీన విచారణ చేపట్టనుంది. ఇక, తెలంగాణ హైకోర్టు తీర్పుతో ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment