తెలంగాణ బిడ్డకు మూడో ర్యాంకు.. | Third Rank For Telangana Student In NEET | Sakshi
Sakshi News home page

నీట్‌లో మెరిసిన స్నిఖిత

Published Sat, Oct 17 2020 2:00 AM | Last Updated on Sat, Oct 17 2020 10:50 AM

Third Rank For Telangana Student In NEET - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ వైద్య విద్య అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌–2020) ఫలితాలు శుక్రవారం విడుదల య్యాయి. హైదరాబాద్‌కు చెందిన తుమ్మల స్నిఖిత ఆలిండియా మూడో ర్యాంకు సాధించారు. రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించారు. కాగా, నీట్‌ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. టాప్‌ 15 జాతీయ ర్యాంకుల్లో రాష్ట్ర విద్యార్థులు ముగ్గురు ఉండగా, టాప్‌ 50 ర్యాంకుల్లో ఏకంగా ఏడుగురు ఉన్నారు. ఆలిండియా ర్యాంకుల్లో బాలురు అగ్రస్థానంలో నిలిచారు. తొలి 50 ర్యాంకుల్లో 31 ర్యాంకులను బాలురే దక్కించుకున్నారు. రాష్ట్రం నుంచి నీట్‌లో అనంత పరాక్రమ (11వ ర్యాంకు), బారెడ్డి సాయి త్రిషా రెడ్డి (14వ ర్యాంకు), శ్రీరామ్‌ సాయి శాంతవర్ధన్‌ (27వ ర్యాంకు ), ఆర్షశ్‌ అగర్వాల్‌ (30వ ర్యాంకు), మల్లేడి రుషిత్‌ (33వ ర్యాంకు), ఆవుల సుభాంగ్‌ (38వ ర్యాంకు) సాధించారు. బాలికల విభాగంలో తొలి 20 ర్యాంకుల్లో రాష్ట్రానికి చెందిన నిత్య దినేష్‌ (ఆలిండియా 58వ ర్యాంకు) 17వ స్థానాన్ని పొందారు. ఎయిమ్స్, జిప్‌మర్‌ సహా అన్ని ప్రముఖ మెడికల్‌ కాలేజీల్లోనూ ఈ ఏడాది నుంచి నీట్‌ ర్యాంకుల ప్రాతిపదికనే సీట్లను భర్తీ చేయనున్నారు.

ఆలిండియా కోటాకు 467 సీట్లు..
తెలంగాణ నుంచి ఆలిండియా కోటాకు 467 ఎంబీబీఎస్‌ సీట్లు ఇస్తారు. ఆలిండియా కోటాలో రెండు విడతల ప్రవేశ ప్రక్రియల అనంతరం మిగిలిన సీట్లను రాష్ట్రాలకు ఇస్తారు. రాష్ట్ర ప్రవేశాలకు, అఖిల భారత వైద్యవిద్య సీట్ల కూటమి ప్రవేశాలకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్రస్థాయిలో నిర్వహించే కన్వీనర్, మేనేజ్‌మెంట్, ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్ల ప్రవేశాలను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో భర్తీ చేస్తారు.

గతేడాది కంటే పెరిగిన మార్కులు..
గతేడాది కంటే మార్కులు పెరిగాయి. గతేడాది 500 మార్కులు వస్తే ఆలిండియా స్థాయిలో 35 వేల నుంచి 40 వేల ర్యాంకులు వచ్చాయి. ఈసారి అదే మార్కులకు 90 వేల వరకు ర్యాంకు వెళ్లింది. గతేడాది ఆలిండియా స్థాయిలో 40 వేలు ఉన్నవారికి కన్వీనర్‌ కోటాలో సీట్లు వచ్చాయి. ఈసారి 70 వేలకు పైగా ఆలిండియా ర్యాంకు ఉన్నవారికి కూడా కన్వీనర్‌ కోటా సీటు వస్తుంది. ఆలిండియా స్థాయిలో 70 వేల ర్యాంకు అయితే, రాష్ట్ర స్థాయిలో 2 వేల లోపు ర్యాంకు వస్తుందని అంచనా వేస్తున్నారు. గతేడాది జనరల్‌లో కటాఫ్‌ మార్క్‌ 134 ఉంటే, ఈసారి 147 కటాఫ్‌ అర్హత మార్కు వచ్చింది. రిజర్వేషన్‌లో గతేడాది 107.. ఈసారి 113 కటాఫ్‌ మార్క్‌ ఉంది. గతేడాది టాప్‌ ర్యాంకు మార్కు 701 ఉండగా, ఇప్పుడు 700పైన 100 మంది ర్యాంకులు సాధించిన వారున్నారు. మూడు నెలలు సమయం దొరకడం వల్ల చదువుకోవడానికి వీలు కలిగింది. అయితే పరీక్ష జరగదన్న భావనతో కొందరు విద్యార్థులు ఉండటమే తక్కువ మంది అర్హత సాధించడానికి ప్రధాన కారణమని శ్రీచైతన్య జూనియర్‌ కాలేజీ డీన్‌ శంకర్‌రావు అభిప్రాయపడ్డారు.

ఆలిండియా స్థాయిలో 15,97,435 మంది విద్యార్థులు నీట్‌ పరీక్షకు రిజిస్టర్‌ చేసుకోగా, వీరిలో 13,66,945 (85.57 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు.
మొత్తం 11 భాషల్లో నిర్వహించిన పరీక్షకు ఇంగ్లిష్‌లో 12,63,273 (79.08 శాతం) మంది రాయగా, తెలుగులో 1,624 (0.10 శాతం) మంది రాశారు. 
తెలంగాణలో 54,872 మంది నమోదు చేసుకోగా, 50,392 మంది హాజరయ్యా రు. వీరిలో 24,767 (49.15 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాది 67.44 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
అత్యధికంగా చండీగఢ్‌లో 75.64 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, అత్యల్పంగా నాగాలాండ్‌లో 40.50 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

ప్రజలకు సేవ చేస్తా..
ఢిల్లీ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్‌ చదువుతాను. నాన్న డాక్టర్‌ సదానందరెడ్డి, కార్డియాలజిస్ట్, అమ్మ డాక్టర్‌ లక్ష్మి, గైనకాలజిస్టు. మా సొంతూరు నిజామాబాద్‌ జిల్లా పోచంపాడు దగ్గర వెల్కలూరు గ్రామం. మూడో ర్యాంకు రావడంపై చాలా సంతోషంగా ఉంది. మెడికల్‌ కోర్సు చేశాక ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నానని తెలిపారు. 
– తుమ్మల స్నిఖిత (3వ ర్యాంకు)

ఎయిమ్స్‌లో చదువుతా..
నాన్న డాక్టర్‌ నారాయణ, అమ్మ ఆర్యా నారాయణ. వీరిద్దరే నాకు ఆదర్శం. జాతీయ స్థాయిలో 11వ ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్‌ చదువుతాను. న్యూరాలజీలో స్పెషాలిటీ చేయాలనుకుంటున్నా. 
– బి.అనంతపరాక్రమ(11వ ర్యాంకు), బోడుప్పల్‌ 

న్యూరోసర్జన్‌ అవుతా..
అమ్మానాన్న బీఆర్‌ఎన్‌రెడ్డి, అనంతలక్ష్మి. జాతీయ స్థాయిలో 14వ ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరుతాను. న్యూరోసర్జన్‌గా సేవలు అందించాలనేదే నా లక్ష్యం. 
– బి.సాయి త్రిషారెడ్డి (14వ ర్యాంక్‌), బీరంగూడ 

పేదలకు సేవలందిస్తా..
నాన్న ఆవుల తేజోవర్ధన్, అమ్మ సంగీత, ఢిల్లీ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసి, పేదలకు వైద్య సేవలు అందించాలన్నదే నా ధ్యేయం.
– సుభాంగ్‌ యాదవ్‌ (38వ ర్యాంకు) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement