సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య విభేదాల నేపథ్యంలో చాలాకాలం నుంచి రాజ్‌భవన్‌లో పెండింగ్ పడిన బిల్లుల వ్యవహారంలో కదలిక వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. మూడు సాధారణ బిల్లులపై ఆమోదముద్ర వేశారు. కీలకమైన యూనివర్సిటీల నియామక బోర్డు, అటవీ వర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన రెండు బిల్లులను రాష్ట్రపతికి నివేదించడం కోసం నిలిపివేశారు.
మరో రెండు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోసం తిప్పిపంపారు. మరింత పరిశీలన అవసరమంటూ ఇంకో రెండు బిల్లులను రాజ్‌భవన్‌లోనే అట్టిపెట్టుకున్నారు. మొత్తంగా గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఇటీవలి వరకు రాష్ట్ర శాసనసభ ఆమోదించిన పది బిల్లులకు సంబంధించి.. రాజ్‌భవన్ ఇచ్చిన వివరాలను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సోమవారం సుప్రీంకోర్టుకు అందజేశారు.
ఆ బిల్లులపై మరింత జాప్యమే..
కీలకమైన తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు, తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయం బిల్లులను రాష్ట్రపతి పరిశీలన, ఆమోదం కోసం పంపాలన్న నిర్ణయం నేపథ్యంలో.. వీటి ఆమోదానికి మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. గతేడాది సెప్టెంబర్ 13 నుంచి ఈ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఉమ్మడి నియామకాల బోర్డు బిల్లుకు ఆమోదముద్ర లభిస్తే.. యూనివర్సిటీల్లో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. బోధన సిబ్బంది లేక యూనివర్సిటీల్లో విద్యార్థులు నష్టపోతున్నారని అధికారవర్గాలు అంటున్నాయి.
ఆజామాబాద్ బిల్లుపై సందిగ్ధం
2022 సెప్టెంబర్ 13న రాష్ట్ర శాసనసభ, శాసనమండలి ఆమోదించిన ఆజామాబాద్ పారిశ్రామిక ప్రాంత (లీజుల నియంత్రణ, రద్దు) చట్ట సవరణ బిల్లు–2022పై కాస్త సందిగ్ధం నెలకొంది. ఆ బిల్లును అదే రోజున గవర్నర్ ఆమోదముద్ర కోసం రాజ్‌భవన్‌కు పంపినట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటుండగా.. ఇప్పటివరకు న్యాయశాఖ నుంచి రాజ్‌భవన్‌కు అందలేదని గవర్నర్ కార్యదర్శి తాజాగా పేర్కొనడం గమనార్హం.
అయితే సుప్రీంకోర్టుకు సొలిసిటర్ జనరల్ సమర్పించిన వివరాల మేరకు.. ఆజామాబాద్ బిల్లుకు సంబంధించి న్యాయశాఖ నుంచి స్పందన రావాల్సి ఉందని గవర్నర్ కార్యాలయం పేర్కొంది. కాగా.. ఈ బిల్లుల వ్యవహారంలో తాజా పరిణామాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా అధికారికంగా ఎలాంటి స్పందన వెలువడలేదు.
గవర్నర్ ఆమోదించిన 3 బిల్లులివీ..
– తెలంగాణ మోటారు వాహన పన్నుల చట్ట సవరణ బిల్లు–2022
ఇంతకుముందు మోటార్ వాహనాల చట్టంలో వాహనాల ధరకు సంబంధించి సరైన నిర్వచనం లేకపోవడంతో పన్నుల విధింపులో సమస్యలు ఎదురయ్యాయి. దీనితో డిస్కౌంట్లతో సంబంధం లేకుండా ఎక్స్‌షో రూమ్ ధర ఆధారంగా పన్ను విధించేలా ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది.
– తెలంగాణ మున్సిపాలిటీల చట్ట సవరణ బిల్లు–2023
ఆసిఫాబాద్, జనకాపూర్, గోదవెల్లి గ్రామాల కలయికతో కొత్తగా ఆసిఫాబాద్ మున్సిపాలిటీ ఏర్పాటు.. కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి నుంచి బోయపల్లి, తాళ్లనరసింహాపూరం గ్రామాలను తొలగింపు కోసం ప్రభుత్వం ఈ బిల్లును తెచ్చింది.
– ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం చట్ట సవరణ బిల్లు–2023
ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలకు అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) ఇచ్చే అధికారాన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయానికి కల్పించడంతోపాటు బీఎస్సీ(హోమ్‌సైన్స్) కోర్సు పేరును బీఎస్సీ (కమ్యూనిటీ సైన్స్)గా మార్చడానికి ఈ బిల్లును తెచ్చింది.
రాష్ట్రపతి పరిశీలన కోసం నిలిచిపోయిన బిల్లులివీ..
– తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయం బిల్లు–2022
హైదరాబాద్‌లోని అటవీ కళాశాల, పరిశోధన సంస్థను విశ్వవిద్యాలయంగా నవీకరించి.. ప్రపంచ స్థాయి అటవీ విద్య, పరిశోధన అందించడానికి ఈ బిల్లును తీసుకొచ్చింది.
– తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు–2022
తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డును ఏర్పాటు చేసి.. ఉన్నత విద్య, వ్యవసాయ, పశుసంవర్థక, మత్స్యశాఖల పరిపాలన నియంత్రణలో వర్సిటీల్లోని బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి ఈ బిల్లును తెచ్చింది.
ఇంకా గవర్నర్ పరిశీలనలో ఉన్న బిల్లులివీ..
– తెలంగాణ ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు–2022
రాష్ట్రంలో కొత్తగా మరో ఐదు ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు వీలుగా ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది.
– తెలంగాణ మున్సిపాలిటీల చట్ట సవరణ బిల్లు–2022
మున్సిపల్ చైర్‌పర్సన్/ వైస్ చైర్‌పర్సన్లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే కనీస కాలవ్యవధి ప్రస్తుతమున్న మూడేళ్ల నుంచి నాలుగేళ్లకు పెంపు.. మున్సిపాలిటీల్లో కో–ఆప్షన్ సభ్యుల సంఖ్య పెంపు, ములుగు మున్సిపాలిటీ ఏర్పాటు, కేతనపల్లి మున్సిపాలిటీ పేరును రామకృష్ణాపూర్‌గా మార్పు కోసం ఈ బిల్లును తెచ్చింది.
– తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ (రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపర్ యాన్యుయేషన్) చట్ట సవరణ బిల్లు–2022
వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును 61 నుంచి 65 ఏళ్లకు పొడిగించేందుకు ప్రభుత్వం ఈ బిల్లును తెచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోసం తిప్పి పంపినవి..
– తెలంగాణ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు–2023 :
పాలన వికేంద్రీకరణలో భాగంగా భద్రాచలంను మూడు గ్రామ పంచాయతీలుగా, సారపాకను రెండు గ్రామ పంచాయతీలుగా విభజించడానికి, రాజంపేటను కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసేందుకు ఈ బిల్లును తెచ్చింది.
– ఆజామాబాద్ పారిశ్రామిక ప్రాంత (లీజుల నియంత్రణ, రద్దు) చట్ట సవరణ బిల్లు–2022
హైదరాబాద్ నగరంలో ఆజామాబాద్ పారిశ్రామిక ప్రాంతంలోని భూములను విక్రయించడానికి ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది.
మూడు బిల్లులకు ఓకే
Published Tue, Apr 11 2023 1:27 AM | Last Updated on Tue, Apr 11 2023 2:47 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment