ఇంటి ముందు కూర్చున్న నారాయణమ్మ
గద్వాల అర్బన్: ముగ్గురు కుమారులు పుట్టారని ఆ తల్లి సంతోషపడింది.. వారికి విద్యాబుద్ధులు నేర్పించి పెద్ద చేసింది.. ఆస్తులు పంచి ఉంచి ఓ ఇంటివారిని చేసింది. ఇన్ని చేసిన అమ్మను కుమారులు మరిచారు. రెక్కలొచ్చిన పక్షుల్లా వారు పెళ్లాం, పిల్లలతో పట్టణాలకు వెళ్లి స్థిరపడ్డారు. 3రోజులుగా ఆమెకు బువ్వ పెట్టకుండా ఇళ్లకు తాళం వేసుకుని వెళ్లారు. ఈ సంఘటన సోవారం వెలుగులోకి వచ్చింది. సఖీ కేంద్రం నిర్వాహకులు, న్యాయవాది రమాదేవి, ప్రిన్స్ స్వచ్ఛంద అధ్యక్షుడు గిరిబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గట్టు మండలం చాగదోణకు చెందిన గిడ్డయ్యకు నారాయణమ్మ, సుశీలమ్మలు ఇద్దరు భార్యలు. నారాయణమ్మకు పూజారి ప్రతాప్, పూజారి వెంకటేశ్వర్లు, కేశవులు కుమారులు. మరో భార్య సుశీలమ్మకు విజయ్, క్రిష్ణ, సుధాకర్, శ్రీను, శివలు కొడుకులు ఉన్నారు. 10ఏళ్ల కిందట భర్త గిడ్డయ్య అనారోగ్యంతో మరణించడంతో నారాయణమ్మ(75) పట్టణంలోని తెలుగుపేటలో నివస్తున్న కుమారుల దగ్గరకు చేరుకుంది.
ఆస్తులు పంచుకున్నా..
నారాయణమ్మ భర్త గిడ్డయ్యపేరుపై చాగదోణ శివారులో ఉన్న 24 ఎకరాలు వ్యవసాయ పొలం, గద్వాల మండల చెనుగోనిపల్లి శివారులో ఉన్న 5 ఎకరాల దేవుని మాన్యం ఉంది. నారాయణమ్మ ముగ్గురు కుమారులు, సుశీలమ్మ ఐదుగురు కుమారులు 2017లో ఆస్తులు పంచుకున్నారు. ఆస్తులు పంచుకున్న తర్వాత గిడ్డయ్య రెండో భార్య సుశీలమ్మ మరణించింది. నారాయణమ్మ పోషణ బాధ్యత మేము కాదు మీరేనంటూ ఇరువురు కుటుంబసభ్యులు ఘర్షణ పడ్డారు. మా తల్లి సుశీలమ్మ చనిపోయింది. మా పెద్దమ్మతో మాకేంటి సంబంధం అని రెండో భార్య కుమారులు చేతులెత్తేశారు. కొంతకాలంగా నారాయణమ్మ పోషణను ఆమె ముగ్గురు కుమారులు చూసుకుంటున్నారు. ఏడాదికి ఒకరు చొప్పున వంతులు కేటాయించుకున్నారు. ఆ తర్వాత ఏడాది నుంచి 3నెలలకు కుదించుకున్నారు. ఈ క్రమంలో మొదటి, రెండో కుమారులు చనిపోయారు. కరోనా సమయంలో ఈమె వృద్ధాప్యం అందరికీ భారమైంది. మూడో కుమారుడి ఇంటికి వెళ్లు అంటూ రెండో కోడలు 3రోజుల క్రితం ఇంటికి తాళం వేసి బయటకు దొబ్బింది. ఆమె ముగ్గురు కుమారుల్లో పెద్ద కుమారుడు ప్రభుత్వ ఉద్యోగి. ఆయన మరణాంతరం కుమారుడికి ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం పీజేపీలో విధులు నిర్వర్తిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment