కరీంనగర్-తిరుపతి రైలు: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌ | Tirupati Train Will Travel For Four Days From Karimnagar | Sakshi
Sakshi News home page

కరీంనగర్-తిరుపతి రైలు: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌

Published Fri, Dec 22 2023 3:14 PM | Last Updated on Fri, Dec 22 2023 5:27 PM

Tirupati Train Will Travel For Four Days From Karimnagar - Sakshi

సాక్షి, ఢిల్లీ: కరీంనగర్ జిల్లా నుంచి తిరుపతికి వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త. కరీంనగర్ నుండి తిరుపతి వెళ్లే రైలు ఇకపై వారానికి నాలుగు రోజులపాటు నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. ప్రస్తుతం ఆదివారం, గురువారం మాత్రమే నడిచే ఈ రైలు ఇకపై వారంలో నాలుగు రోజులపాటు నడవనుంది. కాగా, బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ చొరవతో ఇది సాధ్యమైంది. 

అయితే, బండి సంజయ్ ఈరోజు ఢిల్లీలో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి రైల్వే పెండింగ్ పనులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కరీంనగర్ నుండి తిరుపతి వెళ్లే రైలు ప్రయాణీకులతో విపరీతమైన రద్దీ ఏర్పడినందున వారానికి నాలుగు రోజులపాటు పొడిగించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆది, గురువారాల్లో మాత్రమే నడుస్తున్న ఈ రైలును మరో రెండ్రోజులు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశాలను సమీక్షించిన అనంతరం రెండు, మూడు రోజుల్లో ఏయే రోజు రైలును నడపాలనే దానిపై ప్రకటన చేయనున్నట్లు అధికారులు తెలిపారు.  

కరీంనగర్-హసన్‌పర్తి రైల్వేలైన్‌..
ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల ప్రజల ఆకాంక్ష మేరకు కరీంనగర్-హసన్‌పర్తి కొత్త రైల్వేలైన్‌ కోసం ఫైనల్ లొకేషన్ సర్వే పనులు వెంటనే పూర్తి చేసి కొత్త రైల్వేలైన్‌ పనులను మంజూరు చేయాలని ఈ సందర్భంగా బండి సంజయ్ రైల్వే మంత్రిని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. 

జమ్మికుంటలో ఆగనున్న ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు!
ఇక, రాష్ట్రం నలుమూలలతోపాటు ఇతర రాష్ట్రాల నుండి సైతం వ్యాపారులు, సామాన్య ప్రజలు నిత్యం జమ్మికుంటకు రాకపోకలు కొనసాగిస్తుంటారని, వారి సౌకర్యార్థం పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను జమ్మికుంట స్టేషన్‌లో ఆపే (హాల్ట్) విధంగా చర్యలు తీసుకోవాలని కూడా సంజయ్‌ కోరారు. అందులో భాగంగా సికింద్రాబాద్ నుండి వెళ్లే గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్(12590-89), యశ్వంతపూర్ నుండి గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (12592-91 ), హైదరాబాద్ నుండి న్యూఢిల్లీ వెళ్లే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ (12723-23), సికింద్రాబాద్ నుండి పాట్నా వెళ్లే దానాపూర్ ఎక్స్‌ప్రెస్ (12791-92), చెన్నై నుండి అహ్మదాబాద్ వెళ్లే నవజీవన్ ఎక్స్‌ప్రెస్ (12656-55) రైళ్లను జమ్మికుంట స్టేషన్‌లో నిలిపేలా చర్యలు తీసుకోవాలని విజ్ఝప్తి చేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఆయా రైళ్లను జమ్మికుంటలో నిలిపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement