సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లా ముప్పారం గ్రామంలోని కాకతీయుల కాలం నాటి త్రికూట ఆలయాన్ని పరిరక్షించేందుకు పునరుద్ధరణ పనులను చేపట్టాలని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కోరారు. రామాయణానికి సంబంధించిన అందమైన కుడ్య చిత్రాలు ఈ ఆలయ పైకప్పుపై చెక్కబడి ఉన్నాయని, శిథిలమైన స్థితిలో ఆలయం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆలయం పునరుద్ధరణ పనులను సమన్వయం చేసుకోవాలని పురావస్తు శాఖకు సూచించాలని విదేశాంగ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్‌కు రాసిన లేఖలో గవర్నర్ అభ్యర్థించారు.
ప్రధాని మోదీని ఆదర్శంగా తీసుకోవాలి
నిరుపేదలు, ఇతర అణగారిన వర్గాలకు నిస్వార్థ సేవలను అందించడమే గొప్ప కార్యమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నా రు. నిస్వార్థ సేవ కోసం తమ జీవితాన్ని అంకితం చేసే వారు గొప్ప వ్యక్తులు అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా గవర్నర్ స్వచ్ఛంద సేవలు అందిస్తున్న ప్రొ. శాంతా సిన్హా (ఎంవీ ఫౌండేషన్), డా. మమతా రఘువీర్ (తారుని సంస్థ), సునీతా కృష్ణన్ (ప్రజ్వల ఫౌండేషన్), డా. అనిత (గాంధీ హాస్పిటల్), డా. విజయ్‌కుమార్ గౌడ్ (వికలాంగ ఫౌండేషన్ ట్రస్ట్, రవి హీలియోస్ హాస్పిటల్)ను ఆన్‌లైన్ ద్వారా సన్మానించారు. ప్రధాని మోదీ సేవా గుణాన్ని ఆదర్శంగా తీసుకొని దేశానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment