సాక్షి, హైదరాబాద్: దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎదురైన ఫలితాల దృష్ట్యా ఈసారి అన్ని అస్త్రశస్త్రాలతో మునుగోడు బరిలోకి దిగిన గులాబీదళం.. గురి తప్పకుండా లక్ష్యాన్ని ఛేదించింది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పక్కా వ్యూహం రచించి అమలు చేయడంతోపాటు పార్టీ యంత్రాంగాన్ని ఏకతాటిపై నడిపించడంతో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని విజయం వరించింది. అయితే బీజేపీ ఆత్మస్థైర్యం దెబ్బతీయడం లక్ష్యంగా భారీ మెజారిటీ సాధనకు టీఆర్‌ఎస్ చెమటోడ్చినా ప్రతిపక్ష బీజేపీ గట్టి పోటీ ఇచ్చినట్లు రౌండ్లవారీ గణాంకాలు వెల్లడించాయి.
రాజగోపాల్‌రెడ్డి రాజీనామాకు ముందే అప్రమత్తం..
కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరతారని ముందే పసిగట్టిన టీఆర్‌ఎస్ అధినేత... ఉపఎన్నిక సన్నాహాలను ముందస్తుగా ప్రారంభించారు. ఈ ఏడాది ఆగస్టు తొలివారంలో రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగా జూన్ చివరి వారం నుంచే కేసీఆర్ తన వ్యూహాలకు పదునుపెట్టడం ప్రారంభించారు.
నియోజకవర్గంలోని పార్టీ నేతలను ఏకతాటిపైకి తేవడంతోపాటు అసమ్మతికి చెక్ పెట్టడంపై దృష్టి సారించారు. రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరికకు ఒక రోజు ముందే ఆగస్టు 20న మునుగోడులో బహిరంగ సభ నిర్వహించడం ద్వారా పార్టీ యంత్రాంగంలో కేసీఆర్ కదలిక తెచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ముందే ఖరారైనా కేసీఆర్ మాత్రం నామినేషన్ల సమయంలోనే మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు.
ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలకు మునుగోడులో మండలాలవారీగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించి ఆత్మీయ సమ్మేళనాల ద్వారా స్థానికంగా పార్టీలో సంస్థాగత లోపాలను సరిదిద్దారు. నిఘా వర్గాలు, సర్వేల నివేదికలను సమీక్షిస్తూ వ్యూహాన్ని స్వయంగా పర్యవేక్షించారు.
ప్రచారంలో కీలక నేతల మోహరింపు..
దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ అనుసరించిన వ్యూహంలోని లోపాలు పునరావృతం కాకుండా మునుగోడులో కేసీఆర్ కొత్త ప్రయత్నం చేశారు. గట్టుప్పల్‌ను మండలంగా ప్రకటించడం, నియోజకవర్గంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి వారి సాయంపై వేగంగా నిర్ణయాలు తీసుకున్నారు.
ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్‌రావులతోపాటు స్వయంగా గ్రామ స్థాయిలో బాధ్యత తీసుకున్నారు. రాష్ట్ర మంత్రులు, 70కిపైగా మంది ఎమ్మెల్యేలు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లతోపాటు సుమారు 3 వేల మంది క్రియాశీల నాయకులను గ్రామ, బూత్ స్థాయిలో మోహరించారు. ప్రతి 100 మంది ఓటర్లకు ఒకరు చొప్పున పార్టీ నేతలకు ప్రచార బాధ్యతలు అప్పగించడం ద్వారా సూక్ష్మస్థాయిలో ఎన్నికల వ్యూహాన్ని పక్కాగా అమలయ్యేలా చూశారు.
పకడ్బందీగా చేరికలు..
రాజగోపాల్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ యంత్రాంగం గంప గుత్తగా బీజేపీలో చేరకుండా 4 నెలలుగా చేరికల వ్యూహాన్ని టీఆర్‌ఎస్ నిరంతరాయంగా అమలు చేసింది. పార్టీలో అసమ్మతిని చక్కదిద్దుతూనే కాంగ్రెస్, బీజేపీల నుంచి సుమారు 35 మందికిపైగా సర్పంచ్‌లు, ఎంపీటీసీలను చేర్చుకుంది. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన మర్నాడే మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పార్టీని వీడినా శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్‌తోపాటు మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్, పల్లె రవికుమార్ తదితరులను చేర్చుకొని కేడర్ ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంది.
దక్కని భారీ మెజారిటీ..
పోలింగ్ సరళిని బట్టి 25 వేలకుపైగా ఓట్ల మెజారిటీ సాధిస్తామని టీఆర్‌ఎస్ అంచనా వేసింది. అయితే ఓట్ల లెక్కింపులో 10వ రౌండ్ వరకు రాజగోపాల్‌రెడ్డి నుంచి గట్టి ప్రతిఘటన ఎదురైనట్లు గణాంకాలు వెల్లడించాయి. అదే సమయంలో కారు గుర్తును పోలిన చిహ్నాలైన రోడ్డు రోలర్, రోటీ మేకర్‌తోపాటు చెప్పుల గుర్తుతో పోటీ చేసిన మరో అభ్యర్థికి గణనీయమైన ఓట్లు రావడం కూడా మెజారిటీపై ప్రభావం చూపినట్లు టీఆర్‌ఎస్ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment