హైదరాబాద్: శాసనమండలి ‘హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్’పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన సురభి వాణీదేవికి ప్రాధాన్యతగల పదవి ఇవ్వాలనే యోచనలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఉన్నారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో ఆయన కుటుంబానికి మరింత గుర్తింపు దక్కేలా చూడాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఎమ్మెల్యే కోటాలో శాసనమండలి సభ్యులుగా ఎన్నికైన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ పదవీకాలం ఈ ఏడాది జూన్ మొదటి వారంలో ముగియనుంది. దీంతో మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవుల నుంచి ఇద్దరు నేతలు తప్పుకోవాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో మండలి చైర్మన్‌గా పీవీ కుమార్తె, పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ సురభి వాణీదేవిని ఎంపిక చేసే అవకాశం ఉంది. ఒకవేళ గుత్తా సుఖేందర్‌రెడ్డిని తిరిగి మండలికి నామినేట్ చేసే పక్షంలో డిప్యూటీ చైర్మన్ పదవి వాణీదేవికి లభించే సూచనలున్నాయి. సామాజికవర్గ సమీకరణాల లెక్కలపరంగా చూస్తే బ్రాహ్మణ/కరణం సామాజికవర్గం నుంచి శాసనమండలిలో పురాణం సతీష్, శాసనసభలో వొడితెల సతీష్‌కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదే సామాజికవర్గానికి చెందిన సురభి వాణీదేవికి మండలి చైర్మన్ లేదా డిప్యూటీ చైర్మన్ పదవిని అప్పగిస్తే ఆ సామాజికవర్గానికి తగిన గుర్తింపు కూడా లభిస్తుందని టీఆర్‌ఎస్ లెక్కలు వేస్తోంది.
పీవీ కుటుంబానికి మరింత గుర్తింపు
కాంగ్రెస్ పార్టీకి చెందిన దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ఆ పార్టీ తగిన గుర్తింపునివ్వలేదని గతంలో విమర్శించిన సీఎం కేసీఆర్... పీవీ శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని ప్రకటించారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభలో తీర్మానం కూడా చేశారు. దీంతోపాటు హైదరాబాద్‌లో పీవీ స్మారకం అభివృద్ధి, త్వరలో అసెంబ్లీలో పీవీ చిత్రపటం ఆవిష్కరణ, ఢిల్లీ తెలంగాణ భవన్‌లో కాంస్య విగ్రహం ఏర్పాటు వంటి ప్రతిపాదనలపై కసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వాణీదేవిని మండలి చైర్మన్ లేదా డిప్యూటీ చైర్మన్ పదవిని పీవీ శతజయంతి సందర్భంగా ఇవ్వాలనే యోచనలో ఉన్నారు. వాణీదేవి ప్రస్తుతం కరోనా బారినపడటంతో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆమె వచ్చే నెల ఎమ్మెల్సీగా ప్రమాణం చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment