సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం అదికారులు వేగవంతం చేశారు. ఎరకు ఎక్కడ? ఎప్పుడు బీజం పడిందో తేల్చే పనిలో పడ్డారు. రామచంద్రభారతి, నందు, సింహయాజీలకు ఒకరితో మరొకరికి పరిచయం ఎలా ఏర్పడింది? వీరిని ఎవరెవరు కలిశారు? అనే వివరాలను రాబట్టడంలో నిమగ్నమయ్యారు.
ఇందులో భాగంగా ఈ కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితులు ఫరీదాబాద్‌కు చెందిన పురోహితుడు రామచంద్రభారతి అలియాస్ సతీష్ శర్మ, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త నందకుమార్, తిరుపతికి చెందిన స్వామి సింహయాజీల ఇళ్లు, ఆశ్రమాలలో సోదాలు చేశారు. హైదరాబాద్, తిరుపతి సహా హరియాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాలలోని ఏడు ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు. సైబరాబాద్, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్లకు చెందిన సుమారు 80 మంది పోలీసులు ఏడు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
నందును ఎవరెవరు కలిశారు?
ఇళ్లు, ఆశ్రమాలలో సోదాలు చేస్తున్న అధికారులు కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. నందకుమార్‌కు చెందిన ఫిల్మ్‌నగర్‌లోని డెక్కన్ కిచెన్ హోటల్‌లో, ఆయన ఇంటిలోనూ పోలీసులు సోదాలు చేసిన సంగతి తెలిసిందే. హిల్‌టాప్ అపార్ట్‌మెంట్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకొని.. నందును కలవటానికి ఎవరెవరు వచ్చారనే అంశంపై ఆరా తీశారు. అలాగే రామచంద్రభారతికి చెందిన హరియాణలోని ఫరీదాబాద్, అలాగే కర్ణాటకలోని పుత్తూరులో ఉన్న ఇళ్లల్లో సిట్ అధికారులు సోదాలు చేశారు.
తిరుపతిలోని సింహాయాజీ ఇంటిలో కూడా తనిఖీలు చేపట్టారు. కుటుంబ సభ్యులు, స్థానికులను విచారించి పలు కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. ఆయా సోదాల సందర్భంగా పలు రికార్డులు, కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. మరోవైపు గత నెల 26న హైదరాబాద్‌కు వచ్చిన రామచంద్రభారతి, సింహయాజీలు నందకుమార్‌కు చెందిన డెక్కన్ కిచెన్ హోటల్‌లోనే బస చేసినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి సీసీటీవీ కెమెరాలలో ఇది రికార్డయినట్లు ఓ అధికారి తెలిపారు.
తుషార్, భారతి మధ్యన కేరళ వైద్యుడు
రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీలను రెండు రోజుల పాటు కస్టడీలో విచారించిన పోలీసులు.. వారి నుంచి పలువురి పేర్లు రాబట్టినట్లు తెలిసింది. దీంతో ఈ కేసుతో వారికి ఉన్న సంబంధం, ఇతరత్రా వివరాలను సేకరించేందుకు కేరళలోని కొచ్చి ప్రాంతానికి చెందిన ఓ వైద్యుడి ఇంటిలో సోదాలు చేసినట్లు తెలిసింది. రామచంద్రభారతి, తుషార్‌కు మధ్య ఈయన వారధిలాంటి వాడని సిట్ అధికారులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. తుషార్‌కు అత్యంత సన్నిహితుడైన ఈ వైద్యుడే రామచంద్రభారతిని తుషార్‌కు పరిచయం చేశాడని గుర్తించారు. ఇందుకోసం ఆధారాలను సేకరిస్తున్నామని, ఈ కేసుతో సంబంధం ఉన్న వారి కార్యకలాపాలు, వివరాలను సేకరిస్తున్నామని సిట్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు.
నేడు నగరానికి సిట్ బృందాలు
మరో నిందితుడు సింహయాజీ గత నెల 26న తిరుపతి నుంచి హైదరాబాద్‌కు విమానంలో వచ్చారని, ఈయన ప్రయాణ టికెట్‌ను ఓ జాతీయ పార్టీకి చెందిన కీలక నేత దగ్గరి బంధువే సమకూర్చారని పోలీసులు గుర్తించారు. గత 2 రోజులుగా ఇతర రాష్ట్రాలలో సోదాలలో ఉన్న సిట్ బృందాలు సోమవారం హైదరాబాద్‌కు చేరుకుంటాయని, వారు సేకరించిన సమాచారాన్ని విశ్లేషించాక ఈ కేసులో మరికొందరిని నిందితులుగా చేసే అవకాశం ఉందని, అవసరమైతే వారిని అరెస్టు చేసి విచారించి పూర్తి వివరాలు రాబడతామని ఓ అధికారి వివరించారు.
చదవండి: అసెంబ్లీ సెగ్మెంట్లపై నజర్.. ఎన్నికలకు సమాయత్తంపై కేసీఆర్ ఫోకస్
Comments
Please login to add a commentAdd a comment