సాక్షి, హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించిన ఏఈ పేపర్ లీకేజీ వ్యవహారం తెలంగాణలో ప్రకంపనలు పుట్టిస్తోంది. అభ్యర్థుల నుంచే కాకుండా.. రాజకీయపరమైన విమర్శలూ తెర మీదకు వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో నిందితులు అరెస్ట్ కాగా, దర్యాప్తు సీసీఎస్ సిట్‌కు బదిలీ అయ్యింది. అయితే ఆ వెనువెంటనే ఈ కేసు దర్యాప్తు కోసం సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ రంగంలోకి దిగారు.
మంగళవారం సాయంత్రం బేగంబజార్ పీఎస్‌కు చేరుకున్న సీసీఎస్ సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్.. పేపర్ లీక్ కేసు పరిశీలన ప్రారంభించారు. ఇన్‌స్పెక్టర్, ఏసీపీల నుంచి కేసుకు సంబంధించి ఇప్పటిదాకా సేకరించిన సమాచారం సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఏఈ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీకేజీ కేసులో సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పటివరకు ఇద్దరికి మాత్రమే పేపర్ లీక్ అయ్యిందని గుర్తించాం. నిందితుల ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లను ఎఫ్‌ఎస్‌ఎల్(Forensic Science Laboratory)కు పంపించాం. ఆ నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి స్థాయి దర్యాప్తు ఉంటుందని తెలిపారాయన. అలాగే.. ఈ కేసులో ఎంతటి వారు ఉన్నా ఉపేక్షించబోం అని స్పష్టం చేశారాయన.
నివేదిక కోరిన గవర్నర్
మరోవైపు టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీరియస్‌గా స్పందించారు. ఈ మేరకు టీఎస్‌పీఎస్‌సీ కార్యదర్శికి రాజ్‌భవన్ ద్వారా మంగళవారం సాయంత్రం లేఖ పంపించారామె. ఈ కేసు వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి.. 48 గంట్లోగా అదీ వివరణాత్మక నివేదిక అందించాలని గవర్నర్ కార్యాలయం టీఎస్‌పీఎస్‌సీని ఆదేశించింది. అలాగే.. ‘అసలైన అభ్యర్థుల ప్రయోజనాలు కాపాడేలా చర్యలు తీసుకోవాల’ని గవర్నర్ తన లేఖ ద్వారా ఆదేశించారు. ఇలాంటి దురదృష్ట ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని.. అందుకు అవసరమైన దిద్దుబాటు చర్యలను చేపట్టడంతో పాటు బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా గవర్నర్ తమిళిసై ఆదేశించారు.
ఇదీ చదవండి: నా కుటుంబ సభ్యులెవరూ గ్రూప్-1 రాయలేదు
Comments
Please login to add a commentAdd a comment