సాక్షి, హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో రాథోడ్ రేణుకకు ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ కోసం రేణుక దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు శనివారం కొట్టివేసింది. మరోవైపు పేపర్ లీక్ కేసులో ఇటీవల అరెస్ట్ అయిన మరో ముగ్గురు నిందితులను సిట్ కస్టడీకి కోరింది. అరెస్టయిన ప్రశాంత్, రాజేష్, తిరుపతయ్యను వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ముగ్గురు నిందితుల కస్టడీ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. తీర్పును సోమవారం ప్రకటిస్తామని నాంపల్లి కోర్టు వెల్లడించింది.
కాగా, టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల కేసు ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే పేపర్ లీక్ కేసులో ఏ3 నిందితురాలిగా ఉన్న బెయిల్ దాఖలు చేసింది. రేణుకకు ఆరోగ్యం బాగోలేదని, తనకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారని వారి బాగోగులు చూసే వారు ఎవరూ లేనందున బెయిల్ ఇవ్వాలని రేణుక తరఫు న్యాయవాది కోర్టును కోరారు. సిట్ విచారణకు ఆమె మొదటి నుంచి సహకరిస్తోందని, ఇక ముందు కూడా సహకరిస్తుందన్న న్యాయవాది పేర్కొన్నారు.
అయితే కేసు విచారణ ఇంకా పూర్తి కాలేదని, చాలా మంది పాత్ర ఇందులో ఉందని సిట్ విచారణలో వెల్లడైందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. ఈ దశలో బెయిల్ ఇస్తే విచారణపై ప్రభావం చూపుతుందని అన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న నాంపల్లి కోర్టు రేణు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.
Comments
Please login to add a commentAdd a comment