సాక్షి,హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ క్వశ్చన్ పేపర్ల లీకేజీ వ్యవహారం.. తెలంగాణలో రాజకీయ విమర్శలకు తావిచ్చింది. అధికార బీఆర్‌ఎస్, బీజేపీలు పోటీపడి నిందితులతో సత్సంబంధాలు ఉన్నాయంటూ నిందలు వేసుకుంటున్నాయి. ఈ క్రమంలో.. పేపర్ లీకేజీతో కేటీఆర్‌కు సంబంధం ఉందంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరోపించగా, దానికి ఘాటు కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్.
టీఎస్‌పీఎస్సీ పశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలపై బీఆర్‌ఎస్ వర్కింగ్‌ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ‘‘బండి సంజయ్ తెలివిలేని దద్దమ్మ, రాజకీయ అజ్ఞాని’’ అంటూ మండిపడ్డారు. ‘‘పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ప్రభుత్వ శాఖ కాదు.. అది ఒక రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. ప్రభుత్వాల పనితీరు, వ్యవస్థల గురించి అవగాహన లేని నాయకుడు సంజయ్. వాటిపై ఆయనకు కనీస అవగాహన కూడా లేదు.
..ఒక వ్యక్తి చేసిన నేరాన్ని వ్యవస్థకు ఆపాదించి గందరగోళం సృష్టిస్తున్నారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి వారి భవిష్యత్తును నాశనం చేసేలా రాజకీయాలు చేస్తున్నారు. నిరుద్యోగుల పట్ల మా నిబద్ధతను ప్రశ్నించే నైతిక హక్కు బీజేపీకి లేదు.
ఆ పార్టీ ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో ఇప్పటికే వందలసార్లకు పైగా ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయి. అంతెందుకు ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో 13 సార్లు ప్రశ్నపత్రం లీక్ అయింది. ప్రధాని మోదీని రాజీనామా అడిగే దమ్ము బండి సంజయ్‌కు ఉందా? నిరుద్యోగ యువత ప్రయోజనాలు కాపాడటమే మా ప్రభుత్వ లక్ష్యం. ఇందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు టీఎస్‌పీఎస్సీకి అందిస్తాం. రెచ్చగొట్టే రాజకీయ పార్టీల కుట్రల్లో భాగం కాకుండా, తెలంగాణ యువత అంతా ఉద్యోగాల సాధనపైనే దృష్టి పెట్టాలి అని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
మరోవైపు టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీతో ముప్ఫై లక్షల మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేశారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. రాత్రి పగలు చదివి కష్టపడి పరీక్షలు రాస్తే.. నిరుద్యోగుల భవిష్యత్ ను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారాయన. సిట్ దర్యాప్తుతో ఏం ఒరుగుతుందో ఫాంహౌజ్, నయీం కేసులను చూస్తేనే తెలుస్తోందని, టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో తన కేబినెట్ సహచరుల ప్రమేయం లేదనుకుంటే.. సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించాలని సీఎం కేసీఆర్‌ను కోరారు బండి సంజయ్. ఈ క్రమంలో కేటీఆర్‌కు పేపర్ లీకేజీతో సంబంధం ఉందని ఆరోపించిన ఆయన.. వెంటనే ఆయన్ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్‌పీఎస్‌సీ కమిషన్‌ను పూర్తిగా రద్దు చేయడంతో పాటు అందులోని సభ్యులను బదిలీ చేయాలని డిమాండ్ చేశారాయన.
Comments
Please login to add a commentAdd a comment