సాక్షి, హైదరాబాద్: నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న టీఎస్‌ఆర్టీసీ ఆదాయమార్గాలను వెతుకుతోంది. ఆదాయం పెంచుకొని నష్టాలను అధిగమించేందుకుగాను బీవోటీ (బిల్ట్–ఆపరేట్–ట్రాన్స్‌ఫర్) ప్రాజెక్టులపై దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రధానప్రాంతాల్లో ఉన్న సొంతస్థలాలను బీవోటీ ప్రాజెక్టులకు లీజుకిచ్చి ఫీజు వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా సర్వే నిర్వహించి 50 ప్రాంతాలను గుర్తించింది. వీటికి వీలైనంత త్వరలో టెండర్లు పిలవాలని భావిస్తోంది. వీటిద్వారా ఎంత ఆదాయం వస్తుందనేదానిపై ఇంకా ఓ అంచనాకు రాకున్నా, గరిష్టమొత్తాన్ని సంపాదించాలని మాత్రం భావిస్తోంది.
ఎకరం.. ఎకరంన్నర స్థలం చొప్పున..
ఆర్టీసీకి రాష్ట్రవ్యాప్తంగా 1,400 ఎకరాల భూములున్నాయి. వీటిల్లో భవనాలు, ఇతర వినియోగాలకుపోను, 150 ఎకరాలు ఖాళీగా ఉన్నాయి. తొలుత వీటినే ఈ ప్రాజెక్టుకు వినియోగించాలని ఆర్టీసీ భావిస్తోంది. కొన్నిచోట్ల డిపోలున్నా, వాటిని మూసేయాలని యోచిస్తోంది. ప్రధానప్రాంతాలకు దగ్గరగా ఉన్న అలాంటివాటిని కూడా బీవోటీ ప్రాజెక్టుకు వినియోగించాలని భావిస్తోంది. ఇటీవల రీజియన్ స్థాయి అధికారులతో బస్‌భవన్ వర్గాలు ఆ వివరాలు తెప్పించుకున్నాయి. ఎకరం, ఎకరంన్నర విస్తీర్ణంలో బిట్లు, బిట్లుగా ప్రాజెక్టులకు కేటాయించాలని అధికారులు భావిస్తున్నారు.
33 ఏళ్లపాటు లీజుకు..
ఆయాస్థలాల ఎస్‌ఆర్‌వో(సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్) విలువను రెట్టింపు చేసి, అందులో 5 శాతం మొత్తాన్ని ఆఫ్‌ఫ్రంట్ విలువగా నిర్ధారిస్తారు. బీవోటీ ప్రాజెక్టుకు సంబంధించి ఒక్కో బిట్‌కు దాని విలువ ఆధారంగా లైసెన్స్ ఫీజును నిర్ధారించి టెండర్లు పిలుస్తారు. ఆయాస్థలాలను 33 ఏళ్లపాటు లీజుకు ఇస్తారు. ముందుగా నిర్ధారించిన ఆఫ్‌ఫ్రంట్ విలువను ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంటుంది. తొలి రెండేళ్లు (నిర్మాణ సమయంగా) లైసెన్సు ఫీజు హాలీడేగా ప్రకటిస్తారు. ఆ తర్వాత నుంచి నిర్ధారిత లైసెన్సు ఫీజు వసూలు చేస్తారు. ప్రతి ఏడాది దీన్ని ఐదు శాతం మేర పెంచి, మొత్తం ఫీజుపై ఐదు శాతాన్ని ప్రతి యేడు ఫీజుగా ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంటుంది. ఇలా లీజు గడువు తీరేవరకు చెల్లించాలి. తర్వాత ఆ ప్రాజెక్టు ఆర్టీసీ సొంతమవుతుంది.
ఆర్టీసీ ఎండీ పాత భవనం ప్రాంతం కూడా...
హైదరాబాద్‌లోని ఆర్టీసీ పాత ప్రధాన కార్యాలయం ఉన్న స్థలం, మియాపూర్ బస్‌బాడీ భవన స్థలం, ఇతర ప్రాంతాల్లో డిపోలకు కేటాయించిన స్థలాలు బీవోటీ ప్రాజెక్టుకు అనువుగా ఉంటాయని ఆ సంస్థ అధికారులు భావిస్తున్నారు. ఎండీ పాత భవన ప్రాంతం ప్రస్తుతం ఖాళీగా ఉంది. మియాపూర్‌లోని బస్‌బాడీ యూనిట్‌ను ఉప్పల్ వర్క్‌షాపునకు తరలించి దాన్ని కూడా వాణిజ్య అవసరాలకు వాడాలని ఇప్పటికే నిర్ణయించారు. కానీ, అందులో భవనం ఉన్నందున ఇప్పటికిప్పుడు దాన్ని బీవోటీ ప్రాజెక్టుకు వీలుగా టెండర్లలో ఉంచాలా వద్దా అన్న విషయమై నిర్ణయం తీసుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment