BOT projects
-
సొంతస్థలాలను లీజుకిద్దాం.. బీవోటీ వైపు టీఎస్ఆర్టీసీ చూపు
సాక్షి, హైదరాబాద్: నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న టీఎస్ఆర్టీసీ ఆదాయమార్గాలను వెతుకుతోంది. ఆదాయం పెంచుకొని నష్టాలను అధిగమించేందుకుగాను బీవోటీ (బిల్ట్–ఆపరేట్–ట్రాన్స్ఫర్) ప్రాజెక్టులపై దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రధానప్రాంతాల్లో ఉన్న సొంతస్థలాలను బీవోటీ ప్రాజెక్టులకు లీజుకిచ్చి ఫీజు వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా సర్వే నిర్వహించి 50 ప్రాంతాలను గుర్తించింది. వీటికి వీలైనంత త్వరలో టెండర్లు పిలవాలని భావిస్తోంది. వీటిద్వారా ఎంత ఆదాయం వస్తుందనేదానిపై ఇంకా ఓ అంచనాకు రాకున్నా, గరిష్టమొత్తాన్ని సంపాదించాలని మాత్రం భావిస్తోంది. ఎకరం.. ఎకరంన్నర స్థలం చొప్పున.. ఆర్టీసీకి రాష్ట్రవ్యాప్తంగా 1,400 ఎకరాల భూములున్నాయి. వీటిల్లో భవనాలు, ఇతర వినియోగాలకుపోను, 150 ఎకరాలు ఖాళీగా ఉన్నాయి. తొలుత వీటినే ఈ ప్రాజెక్టుకు వినియోగించాలని ఆర్టీసీ భావిస్తోంది. కొన్నిచోట్ల డిపోలున్నా, వాటిని మూసేయాలని యోచిస్తోంది. ప్రధానప్రాంతాలకు దగ్గరగా ఉన్న అలాంటివాటిని కూడా బీవోటీ ప్రాజెక్టుకు వినియోగించాలని భావిస్తోంది. ఇటీవల రీజియన్ స్థాయి అధికారులతో బస్‌భవన్ వర్గాలు ఆ వివరాలు తెప్పించుకున్నాయి. ఎకరం, ఎకరంన్నర విస్తీర్ణంలో బిట్లు, బిట్లుగా ప్రాజెక్టులకు కేటాయించాలని అధికారులు భావిస్తున్నారు. 33 ఏళ్లపాటు లీజుకు.. ఆయాస్థలాల ఎస్ఆర్వో(సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్) విలువను రెట్టింపు చేసి, అందులో 5 శాతం మొత్తాన్ని ఆఫ్‌ఫ్రంట్ విలువగా నిర్ధారిస్తారు. బీవోటీ ప్రాజెక్టుకు సంబంధించి ఒక్కో బిట్‌కు దాని విలువ ఆధారంగా లైసెన్స్ ఫీజును నిర్ధారించి టెండర్లు పిలుస్తారు. ఆయాస్థలాలను 33 ఏళ్లపాటు లీజుకు ఇస్తారు. ముందుగా నిర్ధారించిన ఆఫ్‌ఫ్రంట్ విలువను ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంటుంది. తొలి రెండేళ్లు (నిర్మాణ సమయంగా) లైసెన్సు ఫీజు హాలీడేగా ప్రకటిస్తారు. ఆ తర్వాత నుంచి నిర్ధారిత లైసెన్సు ఫీజు వసూలు చేస్తారు. ప్రతి ఏడాది దీన్ని ఐదు శాతం మేర పెంచి, మొత్తం ఫీజుపై ఐదు శాతాన్ని ప్రతి యేడు ఫీజుగా ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంటుంది. ఇలా లీజు గడువు తీరేవరకు చెల్లించాలి. తర్వాత ఆ ప్రాజెక్టు ఆర్టీసీ సొంతమవుతుంది. ఆర్టీసీ ఎండీ పాత భవనం ప్రాంతం కూడా... హైదరాబాద్‌లోని ఆర్టీసీ పాత ప్రధాన కార్యాలయం ఉన్న స్థలం, మియాపూర్ బస్‌బాడీ భవన స్థలం, ఇతర ప్రాంతాల్లో డిపోలకు కేటాయించిన స్థలాలు బీవోటీ ప్రాజెక్టుకు అనువుగా ఉంటాయని ఆ సంస్థ అధికారులు భావిస్తున్నారు. ఎండీ పాత భవన ప్రాంతం ప్రస్తుతం ఖాళీగా ఉంది. మియాపూర్‌లోని బస్‌బాడీ యూనిట్‌ను ఉప్పల్ వర్క్‌షాపునకు తరలించి దాన్ని కూడా వాణిజ్య అవసరాలకు వాడాలని ఇప్పటికే నిర్ణయించారు. కానీ, అందులో భవనం ఉన్నందున ఇప్పటికిప్పుడు దాన్ని బీవోటీ ప్రాజెక్టుకు వీలుగా టెండర్లలో ఉంచాలా వద్దా అన్న విషయమై నిర్ణయం తీసుకోలేదు. -
ఇక.. వేగంగా ట్రిప్లింగ్
కాజీపేట– బల్లార్షా మధ్య నిర్మాణం రూ. 2063 కోట్ల అంచనా వ్యయం ప్రణాళిక సిద్ధం చేసిన కేంద్రం బీవోటీ పద్ధతిలో పనులు ? సాక్షి, హన్మకొండ : నాలుగేళ్లుగా నత్తనడకన సాగుతున్న కాజీపేట–బల్లార్ష ట్రిప్లింగ్ పనులు వేగం పుంజుకోనున్నాయి. ఐదేళ్ల వ్యవధిలో ఈ పనులు పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భారీగా నిధులు సమీకరించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. మహారాష్ట్రలోని బల్లార్ష–కాజీపేట మధ్య ఉన్న 201 కిలోమీటర్ల డబ్లింగ్ (అప్‌లైన్, డౌన్‌లైన్) రైలు మార్గాన్ని ట్రిప్లింగ్ (మూడోలైను)గా అభివద్ధి చేస్తున్నారు. ఐదేళ్ల కిందట ఈ పనులు ప్రారంభమైనా నిధుల లేమి కారణంగా నత్తనడకన సాగుతున్నాయి. ఐదేళ్ల వ్యవధిలో కనీసం యాభై కిలోమీటర్ల ట్రాక్‌ను నిర్మించలేక పోయారు. కేవలం మంచిర్యాల వద్ద గోదావరి నదిపై మూడో వంతెన నిర్మాణం పూర్తయింది. ఈ వంతెనకు అటు ఇటు కొన్ని కిలోమీటర్ల వరకే ట్రిప్లింగ్ పనులు జరిగాయి. రోజురోజుకి ఈ మార్గంలో పెరుగుతున్న రద్దీని తట్టుకునేందుకు మూడో మార్గం తప్పనిసరైంది. దీంతో ట్రిప్లింగ్ పనులు వేగం పెంచేందుకు నిధుల సమీకరణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. బల్లార్షా – కాజీపేట ట్రిప్లింగ్‌కు నిర్మాణంపై ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు ట్రిప్లింగ్ పనులకు రూ.2063 కోట్ల వ్యయం అవుతుందని కేంద్ర ఆర్థికశాఖ అంచనా వేసింది. ఈ నిధులను రైల్వేశాఖ, ప్రైవేటు సంస్థల ద్వారా సేకరించాలని నిర్ణయించారు. మూడోలైను ద్వారా ఎక్కువగా వాణిజ్య పరమైన సరుకుల రవాణా (గూడ్సు)కు ఉపయోగించనున్నారు. దీంతో ట్రిప్లింగ్ పనులను బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (బీఓటీ) పద్ధతిలో చేపట్టడంపై చర్చలు జరుగుతున్నాయి. ఐదేళ్లుగా.. చెన్నై – న్యూఢిల్లీ గ్రాండ్‌ట్రంక్ మార్గంలో నాగ్‌పూర్ – విజయవాడ వరకు ఉన్న మార్గం అత్యంత రద్దీగా ఉంటుంది. ఈ మార్గంలో బల్లార్ష – కాజీపేట – విజయవాడల మధ్య ఉన్న 400 కిలోమీటర్ల మార్గంలో ప్రస్తుతం అప్‌లైన్, డౌన్లైను నిరంతరం రద్దీగా ఉంటున్నాయి. ఈ మార్గంలో కొత్త రైలును ప్రవేశపెట్టడం కష్టమయ్యే పరిస్థితి నెలకొంది. రద్దీ కారణంగా గూడ్సు రైళ్లు గంటల తరబడి ఆలస్యమవుతున్నాయి. ఈ సమస్యను నివారించేందుకు 2012–13 రైల్వే బడ్జెట్లో బల్లార్షా – కాజీపేట – విజయవాడ మార్గాన్ని ట్రిప్లింగ్ (మూడోలైను) చేస్తామని రైల్వేమంత్రి ప్రకటించారు. గత నాలుగేళ్లుగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. బెల్లంపల్లి – పెద్దపల్లిల మధ్య ఈ పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. -
వచ్చే ఏడాది లాభాల్లోకి
ఐవీఆర్సీఎల్ గ్రూపు చైర్మన్ ఇ.సుధీర్ రెడ్డి ⇒రెండేళ్లలో రూ.800 కోట్ల నష్టాలు పూడ్చుకుంటాం ⇒మార్చిలోగా రూ. 2,500 కోట్ల రుణభారాన్ని వదుల్చుకుంటాం ⇒బీవోటీలకు దూరం, నీటి ప్రాజెక్టులపై ప్రధానంగా దృష్టి ⇒రెండేళ్లలో రూ. 8,000 కోట్ల ఆదాయం లక్ష్యం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిర్మాణ రంగ కంపెనీ ఐవీఆర్సీఎల్ సాధ్యమైనంత తొందరగా అప్పుల భారాన్ని వదిలించుకొని లాభాల పట్టాలు ఎక్కడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా మొత్తం బీవోటీ ప్రాజెక్టులను పూర్తిగా విక్రయించడమే కాకుండా, కొత్త బీవోటీ ప్రాజెక్టులను చేపట్టకుండా ఈపీసీ ముఖ్యంగా నీటిపారుదల ప్రాజెక్టులపై దృష్టిసారించనున్నట్లు ఐవీఆర్సీఎల్ గ్రూపు చైర్మన్ ఇ.సుధీర్ రెడ్డి తెలిపారు. వచ్చే మూడు నెలల్లో మూడు బీవోటీ ప్రాజెక్టులను విక్రయించడం ద్వారా సుమారు రూ. 2,500 కోట్ల రుణ భారాన్ని తగ్గించుకోవడమే కాకుండా సుమారు రూ.600-800 కోట్ల మూలధనం చేతికి వస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఐవీఆర్సీఎల్ చేతిలో మొత్తం ఎనిమిది బీవోటీ ప్రాజెక్టులు ఉన్నాయని, అందులో మూడు ఈ త్రైమాసికంలోగా, తర్వాతి తొమ్మిది నెలల్లో మిగిలిన ప్రాజెక్టులను విక్రియించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సుధీర్ తెలిపారు. ఈ బీవోటీ ప్రాజెక్టులపైన సుమారు రూ. 3,500 కోట్ల రుణం ఉందని, వీటిని విక్రయించడం ద్వారా సుమారు రూ. 300 - 350 కోట్ల వడ్డీ భారం తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. గ్రూపు మొత్తంపై సుమారు రూ. 6,500 కోట్ల రుణ భారం ఉండగా, వడ్డీల కింద గతేడాది రూ. 650 కోట్లు చెల్లించింది. కంపెనీ వ్యాపార ప్రణాళికలను వివరించడానికి సోమవారం హైదరాబాద్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది కంపెనీ లాభాల్లోకి వస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కంపెనీకి రూ. 800 కోట్ల పేరుకుపోయిన నష్టాలు ఉన్నాయని, వీటని వదిలించుకోవడానికి మరో రెండు మూడేళ్లు పడుతుందన్నారు. ఈపీసీపైనే దృష్టి బీవోటీ ప్రాజెక్టులకు దూరంగా ఉండి ఈపీసీ కాంట్రాక్టులపైనే దృష్టిసారించనున్నట్లు సుధీర్ తెలిపారు. అందులో అత్యంత అనుభవం ఉన్న నీటిపారుదల విభాగంపైనే అత్యధికంగా దృష్టిసారించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఐవీఆర్సీఎల్ రూ. 18,000 కోట్ల ఆర్డర్లలో 50 శాతం నీటిపారుదల విభాగం నుంచే ఉండగా, ఆదాయంలో 70 శాతం, లాభాల్లో 80 శాతం నుంచే వస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాలు ప్రతిష్టాత్మకంగా నీటిపారుదల ప్రాజెక్టులపై దృష్టిసారించడం, వాటర్‌గ్రిడ్, నూతన రాజధాని నిర్మాణం వంటి అంశాలు కలిసొస్తాయన్నారు. ప్రస్తుతం కంపెనీ ఆదాయం సుమారుగా రూ. 5,000 కోట్లు దాటనుందని, ఇది వచ్చే ఏడాది రూ. 6,500 కోట్లకు, రెండేళ్లలో రూ. 8,000 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. బీవోటీ ప్రాజెక్టులను విక్రయించిన తర్వాత కంపెనీ చేతిలో ఉన్న 1,700 ఎకరాల భూమిని విక్రయించనున్నట్లు తెలిపారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం చూస్తే ఈ భూమి విలువ సుమారుగా రూ. 3,000 కోట్లుగా ఉంది. రూ. 300 కోట్ల క్విప్ ఇష్యూకి వాటాదారుల అనుమతి ఇప్పటికే లభించిందని, ఈ ఇష్యూ వచ్చే ఏడాది ఉండొచ్చన్నారు.