వచ్చే ఏడాది లాభాల్లోకి | IVRCL hopes to cut debt by Rs 2500 crore via asset sale by March | Sakshi
Sakshi News home page

వచ్చే ఏడాది లాభాల్లోకి

Published Tue, Dec 30 2014 12:32 AM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM

వచ్చే ఏడాది లాభాల్లోకి - Sakshi

వచ్చే ఏడాది లాభాల్లోకి

ఐవీఆర్‌సీఎల్ గ్రూపు చైర్మన్ ఇ.సుధీర్ రెడ్డి
రెండేళ్లలో రూ.800 కోట్ల నష్టాలు పూడ్చుకుంటాం
మార్చిలోగా రూ. 2,500 కోట్ల రుణభారాన్ని వదుల్చుకుంటాం
బీవోటీలకు దూరం, నీటి ప్రాజెక్టులపై ప్రధానంగా దృష్టి
రెండేళ్లలో రూ. 8,000 కోట్ల ఆదాయం లక్ష్యం

 
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
నిర్మాణ రంగ కంపెనీ ఐవీఆర్‌సీఎల్ సాధ్యమైనంత తొందరగా అప్పుల భారాన్ని వదిలించుకొని లాభాల పట్టాలు ఎక్కడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా మొత్తం బీవోటీ ప్రాజెక్టులను పూర్తిగా విక్రయించడమే కాకుండా, కొత్త బీవోటీ ప్రాజెక్టులను చేపట్టకుండా ఈపీసీ ముఖ్యంగా నీటిపారుదల ప్రాజెక్టులపై దృష్టిసారించనున్నట్లు ఐవీఆర్‌సీఎల్ గ్రూపు చైర్మన్ ఇ.సుధీర్ రెడ్డి తెలిపారు.

వచ్చే మూడు నెలల్లో మూడు బీవోటీ ప్రాజెక్టులను విక్రయించడం ద్వారా  సుమారు రూ. 2,500 కోట్ల రుణ భారాన్ని తగ్గించుకోవడమే కాకుండా సుమారు రూ.600-800 కోట్ల మూలధనం చేతికి వస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఐవీఆర్‌సీఎల్ చేతిలో మొత్తం ఎనిమిది బీవోటీ ప్రాజెక్టులు ఉన్నాయని, అందులో మూడు ఈ త్రైమాసికంలోగా, తర్వాతి తొమ్మిది నెలల్లో మిగిలిన ప్రాజెక్టులను విక్రియించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సుధీర్ తెలిపారు. ఈ బీవోటీ ప్రాజెక్టులపైన సుమారు రూ. 3,500 కోట్ల రుణం ఉందని, వీటిని విక్రయించడం ద్వారా సుమారు రూ. 300 - 350 కోట్ల వడ్డీ భారం తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

గ్రూపు మొత్తంపై సుమారు రూ. 6,500 కోట్ల రుణ భారం ఉండగా, వడ్డీల కింద గతేడాది రూ. 650 కోట్లు చెల్లించింది.  కంపెనీ వ్యాపార ప్రణాళికలను వివరించడానికి సోమవారం హైదరాబాద్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది కంపెనీ లాభాల్లోకి వస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కంపెనీకి రూ. 800 కోట్ల పేరుకుపోయిన నష్టాలు ఉన్నాయని, వీటని వదిలించుకోవడానికి మరో రెండు మూడేళ్లు పడుతుందన్నారు.
 
ఈపీసీపైనే దృష్టి
బీవోటీ ప్రాజెక్టులకు దూరంగా ఉండి ఈపీసీ కాంట్రాక్టులపైనే దృష్టిసారించనున్నట్లు సుధీర్ తెలిపారు. అందులో అత్యంత అనుభవం ఉన్న నీటిపారుదల విభాగంపైనే అత్యధికంగా దృష్టిసారించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఐవీఆర్‌సీఎల్ రూ. 18,000 కోట్ల ఆర్డర్లలో 50 శాతం నీటిపారుదల విభాగం నుంచే ఉండగా, ఆదాయంలో 70 శాతం, లాభాల్లో 80 శాతం నుంచే వస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాలు ప్రతిష్టాత్మకంగా నీటిపారుదల ప్రాజెక్టులపై దృష్టిసారించడం, వాటర్‌గ్రిడ్, నూతన రాజధాని నిర్మాణం వంటి అంశాలు కలిసొస్తాయన్నారు.

ప్రస్తుతం కంపెనీ ఆదాయం సుమారుగా రూ. 5,000 కోట్లు దాటనుందని, ఇది వచ్చే ఏడాది రూ. 6,500 కోట్లకు, రెండేళ్లలో రూ. 8,000 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. బీవోటీ ప్రాజెక్టులను విక్రయించిన తర్వాత కంపెనీ చేతిలో ఉన్న 1,700 ఎకరాల భూమిని విక్రయించనున్నట్లు తెలిపారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం చూస్తే ఈ భూమి విలువ సుమారుగా రూ. 3,000 కోట్లుగా ఉంది. రూ. 300 కోట్ల క్విప్ ఇష్యూకి వాటాదారుల అనుమతి ఇప్పటికే లభించిందని, ఈ ఇష్యూ వచ్చే ఏడాది ఉండొచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement